(విజయనగరం నుండి లియోన్యూస్ ప్రతినిధి)
మాన్సాస్ ఛైర్పర్సన్ సంచైత గజపతి తీరు.. ‘నేను చెప్పిందే వేదం.. నేను పలికిందే గీతం’ అన్నట్టుందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయినప్పటికీ వాటన్నింటినీ పెడచెవిన పెడుతూ.. తాను అనుకున్నదే చేసుకుపోతుండటం.. తలపండిన రాజకీయ విశ్లేషకులకూ అంతుపట్టడం లేదు. కేంద్ర ప్రభుత్వ ఆశీస్సులు.. రాష్ట్ర ప్రభుత్వ అండదండలు.. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం.. వెరసి మాన్సాస్ ను తన సొంత జాగీరుగా మలచుకుంటున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
పద్మనాభం కాలేజీ మూసివేత
మాన్సాస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న విశాఖ జిల్లా పద్మనాభం జూనియర్ కాలేజీని మూసివేసినట్లు తెలుస్తోంది. మాన్సాస్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ కళాశాల ఆవరణలో శుక్రవారం భూమిపూజ చేసినట్లు ఆ సంస్థ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. పద్మనాభం కళాశాలకు చెందిన అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బందికి జీతాలు చెల్లించలేమని, వెంటనే కాలేజీ విడిచి వెళ్లిపోవాలని యాజమాన్యం సూచించినట్లు అధ్యాపకులు ఆరోపిస్తున్నారు. కోటలోని మాన్సాస్ కార్యాలయాన్ని పద్మనాభం కళాశాలకు తరలించాలని ఛైర్‌పర్సన్ సంచయిత గజపతిరాజు ఈవోకు ఆదేశించిన నేపథ్యంలో ఆయన కమిషనరుకు ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే.. దీంతో ప్రస్తుతం ఆ కార్యాలయాన్ని కూడా తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.
మూడు దశాబ్దాల చరిత..
పద్మనాభంలో కళాశాలను 1994లో ఏర్పాటు చేశారు. 2020 మార్చి వరకు నిర్వహించారు. 2019-20లో ఇంటర్‌లో ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులు 250 మంది విద్యనభ్యసించారు. ప్రస్తుతం 9 మంది అధ్యాపకులు, ముగ్గురు బోధనేతర సిబ్బంది పనిచేస్తున్నారు. 2020- 21 విద్యాసంవత్సరానికి వీరిలో అయిదుగురు అధ్యాపకులను కోటలోని ఇంటర్, డిగ్రీ కళాశాలల్లో బోధనకు వినియోగించినట్లు తెలుస్తోంది. మిగతావారిని ఇంటికి పంపించే పరిస్థితి దాపురించిందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అర్థాంతరంగా కళాశాలను మూసివేయడంతో అటు విద్యార్థులు, ఇటు అధ్యాపకులు ఆందోళనకు గురవుతున్నారు.
15లోగా ఖాళీ చేయాలి
విజయనగరం కోట ప్రాంగణంలో నిర్వహిస్తున్న ఆప్కో దుకాణాన్ని ఈ నెల 15లోపు ఖాళీ చేయాలని మాన్సాస్ యాజమాన్యం ఆదేశించినట్లు తెలిసింది. మాన్సాస్కు అద్దె రూపంలో చెల్లించాల్సిన రూ.1.29 లక్షల మొత్తాన్ని చెల్లించేందుకు పూచీకత్తు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో వ్యాపారం లేకపోవడంతో ఆప్కో అద్దె మాఫీ కోరగా 50 శాతానికే సంస్థ అంగీకరించినట్లు తెలిసింది. ఈ దుకాణాన్ని 15 ఏళ్లుగా ఇక్కడ నిర్వహిస్తున్నారని, ఉన్నపళంగా ఖాళీ చేయమనడం సమంజసంగా లేదని సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.