1983 జనవరి 9.. తెలుగు కీర్తి దిగ్దిశాంతాలు దాటిన రోజు. రాజకీయం ఏసీ గదులు దాటి గుడిసెకు చేరిన రోజు. పేదవాడికి అన్నం రుచి తెలిసిన రోజు. దేశంలో సరికొత్త రాజకీయం మొదలైన రోజు. నాటి ఢిల్లీ పాలకులకు తెలుగువాడి వాడి.. వేడి తెలిసిన రోజు. తెలుగు జాతికి పండుగ రోజు. తెలుగు నేల పులకించిన రోజు. 35 ఏళ్ల అహంకారానికి చరమగీతం పాడిన రోజు. సరికొత్త ఆంధ్రావనికి నాంది పలికిన రోజు. నందమూరి తారకరాముడు తెలుగుదేశాధీసుడిగా పట్టాభిషిక్తుడైన రోజు.
కాంగ్రెస్ ఏకచ్ఛత్రాధిపత్యం సాగుతున్న వేళ..
ఆంధ్రప్రదేశ్ అవతరించిన నాటి నుంచి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని కంచుకోటగా మర్చుకుని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలుతోంది. అప్పటి ప్రజలకు తెలిసిన పార్టీ కాంగ్రెస్ ఒక్కటే. దీంతో.. వాళ్లు ఏం చేసినా సాగిపోయేది. రాష్ట్ర నాయకులకు ప్రజల కన్నా.. ఢిల్లీ పెద్దలే ముఖ్యం. నాటి ప్రధాని ఇందిర కనుసన్నల్లోనే రాష్ట్రంలో పాలన సాగేది. ఆమె ప్రాపకం కోసం పాకులాడడం మినహా.. ప్రజలను పట్టించుకునే వారుకారు నాటి పాలకులు. దీంతో.. తెలుగు వాడికి ఢిల్లీ స్థాయిలో కనీసం గుర్తింపు కూడా లేకుండా పోయింది.
అసలు అలాంటి భాష ఒకటి ఉందన్న విషయం కూడా ఉత్తరాది వాళ్లకు తెలియకపోయేది. తెలుగు వారిని మదరాసీయులుగా పిలిచే దౌర్భాగ్యపు రోజులు నడిచేవి. రాష్ట్రానికి ఏడాదికో ముఖ్యమంత్రి మారేవారు. మన ముఖ్యమంత్రి ఎవరని అడిగితే.. బాగా చదువుకున్న వారు మినహా.. సామాన్యులు చెప్పలేని రోజులవి. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలా ఉంటారో కూడా ప్రజలకు తెలియని రోజులు. రాజకీయ నాయకులు ఏసీ గదులు దాటి వీధుల్లోకి అడుగు పెట్టని రోజులు. రాజకీయం అంటే.. అది సంపన్నవర్గాలకే పరిమితమని ప్రజలు భావిస్తున్న రోజులు. పేదవాడు గంజినే పరమాన్నంగా భావిస్తున్న రోజులు. ప్రజలు జొన్న సంగటినే విందుభోజనంగా ఆరగిస్తున్న రోజులు. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం లాంటి మాటలకు అర్థం కూడా తెలియకుండా బతుకెళ్లదీస్తున్న రోజులవి. సరిగ్గా.. అప్పుడే.. తెలుగుజాతి దీన స్థితిని చూసి చలించిన ఓ తెలుగుబిడ్డ తిరగబడ్డాడు.
ఆత్మాభిమానం సాక్షిగా.. ఆత్మగౌరవమే నినాదంగా..
నందమూరి తారకరామారావు.. అప్పటికి మూడు దశాబ్దాలుగా తెలుగు సినీ సామ్రాజ్యాన్ని మకుటంలేని మహారాజులా ఏలుతున్నాడు. రాముడిగా, కృష్ణుడిగా, వేంకటేశ్వరుడిగా, శ్రీమహా విష్ణువుగా ప్రజల గుండె గుడుల్లో పూజలందుకుంటున్నాడు. తెలుగువారి ఆరాధ్య దైవంగా దేదీప్యమానంగా వెలిగిపోతున్నాడు. సరిగ్గా అలాంటి సమయంలో.. ఆరుపదుల వయసులో.. తెలుగువాడి ఆత్మాభిమానాన్ని తట్టిలేపుతూ.. ఆత్మగౌరవమే నినాదంగా రాజకీయాల్లోకి ఒక ఉప్పెనలా ఉవ్వెత్తున దూసుకొచ్చాడు.
ఆవిర్భావమే ఓ చరిత్ర
అది 1982 మార్చి 29. చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రోజు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు. హైదరాబాద్ లోని న్యూఎమ్మెల్యే క్వార్టర్స్ లో అన్నగారు పార్టీ ప్రకటించడమే ఓ సంచలనం. అప్పటివరకు ఎన్నడూ లేని విధంగా తెలుగు భాషనే పార్టీపేరుగా ఆయన చేసిన ప్రకటన తెలుగు రాష్ట్రంలో ఓ సరికొత్త పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. శుభానికి గుర్తు పసుపు. ఇదే ఆయన పార్టీ రంగైంది. జెండాను స్వయంగా తనే తీర్చిదిద్దారాయన. అందులోనే తన పార్టీ విధివిధానాలను చెప్పకనే చెప్పారాయన. పేదవాడికి గుర్తుగా గుడిసె.. కార్మికుడికి గుర్తుగా చక్రం.. రైతన్నకు గుర్తుగా నాగలి. వీటన్నింటితో ఆయన తయారు చేసిన పార్టీ జెండా.. అప్పట్లో ఓ సంచలనం. ఇక పార్టీ గుర్తుగా సామాన్యుడు వాడే సైకిల్ ను ఎంచుకున్నాడు. మీ పార్టీ సిద్ధాంతమేంటి అని అడిగిన నాటి మేధావులకు ఒకే ఒక్క మాటతో మరో మాట మాట్లాడేందుకు కూడా అవకాశమివ్వలేదాయన. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’.. ఇదే నా సిద్ధాంతం అన్నారు. కడదాకా దానికే కట్టుబడి ఉన్నారు.
సంచలనం.. నాటి చైతన్య రథయాత్ర
అన్నగారు పార్టీ పెట్టినప్పటి నుంచి ఎన్నో కామెంట్లు ఎదురయ్యాయి అప్పటి ప్రత్యర్థుల నుంచి. ‘ముఖానికి రంగేసుకునే వాడికి రాజకీయమేం తెలుసు’, ‘సినిమా వాళ్లకు ఓట్లెవరు వేస్తారు’, ‘చిన్నపిల్లలకు ఓటు హక్కు ఇస్తేనే ఆయన గెలుస్తారు’ లాంటి ఎన్నెన్నో కామెంట్లు చేశారు. ఆయన 50 సీట్లకు మించి గెలవలేరని కొన్ని పత్రికలు రాశాయి. నాటి కమ్యూనిస్టు నాయకులు ఆయనతో పొత్తు కోసం వచ్చి.. ఆయనకే 50 సీట్లిస్తామంటూ ఆఫర్లు ఇచ్చారు. ఇవేవీ ఆయన పట్టించుకోలేదు. ఒంటరిగా ఎన్నికల రంగంలోకి దిగారు. మేనకాగాంధీ.. సంజయ్ విచార్ మంచ్ పార్టీని మాత్రమే కలుపుకున్నారు. ఆ పార్టీకి 4 సీట్లు కేటాయించారు. ఓ వైపు ఎన్నికల ప్రచార వ్యూహాలను ఖరారు చేసుకుంటూ.. మరో వైపు పార్టీ నిర్మాణం పనులు చూసుకున్నారు. అతి కొద్దిమంది సీనియర్ నాయకులు మినహా.. మొత్తం యువతతోనే పార్టీని నింపేశారు. అంతా కొత్తముఖాలే. యువకులే. చదువుకున్న వాళ్లు, ఏదో సాధించాలన్న తపన ఉన్న వాళ్లకే ప్రాధాన్యం ఇచ్చారు. 90 శాతం టిక్కెట్లు యువకులకే కేటాయించారు. ఇప్పుడున్న అనేక మంది నాయకులు నాడు యువకులుగా అన్నగారి ఆశీస్సులతో అరంగేట్రం చేసిన వాళ్లే.
అప్పటివరకు వృద్ధ రాజకీయాలతో విసుగెత్తిన ప్రజలకు నవ యువ రాజకీయాన్ని పరిచయం చేశాడు. ఎన్నికలకు మొత్తం కార్యరంగం సిద్ధం చేసుకున్నాక.. అసలైన రణరంగంలోకి సింహంలా దూకాడు. చైతన్య రథం ఎక్కి జనం బాట పట్టాడు. 19 రోజుల పాటు ఏకబిగిన రాష్ట్రమంతా చుట్టేశాడు. పగలనక రాత్రనక, ఎండనక వాననక, తీవ్రమైన చలిని కూడా లెక్కచేయక, నిద్రాహారాలు మాని అకుంఠిత దీక్షతో జనంలోకి చొచ్చుకెళ్లాడు. అప్పటివరకు ఏసీ గదులకే పరిమితమైన రాజకీయాన్ని.. పూరి గుడిసెల దాకా తీసుకొచ్చాడు. తెలుగువాడి ఆత్మగౌరవాన్ని ఎలుగెత్తి చాటాడు. నిదురించిన ఆత్మాభిమానాన్ని తట్టి లేపారు. తనలోని ఆవేశంతో జనంలో ధైర్యాన్ని నింపాడు. నాటి అన్నగారి సభలు చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ఎక్కడికెళ్లినా, ఎటు చూసినా జనం. అన్నగారి సభలకు జనం ప్రభంజనంలా తరలివచ్చారు. ఆయన ఆవేశపూరిత ప్రసంగాలకు ముగ్దులైపోయారు. తమ ఆరాద్య దైవం కళ్ల ముందు సాక్షాత్కరించేసరికి తన్మయత్వంతో అలా చూస్తూండిపోయారు.
చివరి రోజున గానీ తెలిసిరాలేదు..
అది 1983 జనవరి 3. నాటి ప్రధాని ఇందిరకు అన్నగారి ప్రభంజనం ఏస్థాయిలో ఉందో తెలిసొచ్చిన రోజు. అది ఎన్నికల ప్రచారానికి చివరి రోజు. తిరుపతిలో ప్రధాని ఇందిర బహిరంగ సభకు ఏర్పాట్లు చేస్తున్నారు నాటి కాంగ్రెస్ నాయకులు. అక్కడ అన్నగారు స్థానిక అభ్యర్థి. అదే రోజు ఆయన కూడా అక్కడ సభ కోసం అనుమతి కోరారు. కానీ, ఆయన సభకు అనుమతి నిరాకరించారు నాటి అధికారులు. దీంతో ఆయన.. ‘‘నేను స్థానిక అభ్యర్థిని. ఇంటింటి ప్రచారానికి వెళతాను. ఎలా అడ్డుకుంటారో చూస్తాను’’ అంటూ అందుకు ఏర్పట్లు మొదలెట్టేశారు. దీంతో దిగొచ్చిన అధికారులు.. ఆయనకు సాయంత్రం 4 గంటలకు సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చారు. అది కూడా ఊరి చివరన. ఇందిర సభ 3 గంటలకు మొదలైంది. జనం భారీగానే వచ్చారు. ఇందిర, రాజీవ్‌లు వేదిక మీద ఉన్నారు. ఇందిర ప్రసంగిస్తున్నారు. అంతలో అలజడి. టపాసుల మోత వినిపించింది. ‘అన్నగారు వచ్చేశారు’ అని అరుపులు. అంతే.. నిముషాల్లో.. ఇందిర సభ ఖాళీ. జనమంతా పోలోమంటూ అన్నగారిని చూసేందుకు ఊరి చివరకు పరుగులు తీశారు. దీంతో.. ఇందిర తన ప్రసంగాన్ని అర్థాంతరంగా ఆపేశారు. హడావుడిగా సభ రద్దు చేసేసి.. హెలికాప్టర్ ఎక్కేశారు. ఆ హెలికాప్టర్ అన్నగారి సభాస్థలి మీదుగా వెళ్లడం విశేషం. అప్పుడు ఆ హెలికాప్టర్ లో ఉన్న నాటి ఏపీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డిపై ఇందిర చిర్రుబుర్రులాడారని అంటుంటారు.
ఇన్నాళ్లూ ఈ ప్రభంజనం గురించి నాకెందుకు చెప్పలేదు అని ఇందిర అన్నారని చెబుతుంటారు. అక్కడే అన్నగారి విజయం ఖారారైపోయింది. ప్రచారం ముగిసింది. ఎన్నిక జరిగపోయింది. ఇక కౌంటింగ్ నాడు ఈనాడు పత్రికలో ‘కాంగ్రెస్ కంచుకోట కూలడం ఖాయం’ అంటూ వచ్చిన శీర్షిక అప్పట్లో సంచలనమైంది. దానికి అనుగుణంగానే ఫలితాలూ వచ్చాయి. కాంగ్రెస్ కంచుకోట బద్దలైపోయింది. మహామహులైన కాంగ్రెస్ నేతలు మట్టికరిచారు. అనామకులైన యువనేతలు ఘనవిజయం సాధించారు. ఢిల్లీ అహంకారంపై తెలుగువాడి ఆత్మగౌరవం అద్భుత విజయం సాధించింది.
తెలుగుదేశం పార్టీ 202 సీట్లలో ఘనవిజయం సాధించింది. మిత్రపక్షం సంజయ్ విచార్ మంచ్ 4 సీట్లు గెలిచింది. తమ సత్తా ఏంటో ప్రజలకు తెలిసొచ్చింది. నిలువెత్తు తెలుగుతేజం ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించింది. ప్రజల సమక్షంలో ప్రమాణస్వీకారం చేసిన తొలి ముఖ్యమంత్రిగా నందమూరి తారకరామారావు చరిత్రకెక్కారు. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికార పగ్గాలు అందుకుని దేశాన్ని ఆశ్చర్యపరిచారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుతెచ్చుకున్నారు. తెలుగు భాషకు దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఓ ప్రత్యేక స్థానం కల్పించారు. ప్రమాణస్వీకారం చేసిన వేదికపైనే రెండు రూపాయలకే కిలో బియ్యం పథకానికి శ్రీకారం చుట్టారు. దేశంలో సంక్షేమ పథకాలకు ఆద్యుడయ్యారు. తెలుగు వారికి ఆరాద్యుడయ్యారు. తెలుగు భాషకు పర్యాయపదంలా నిలిచారు మన ఎన్టీఆర్.