రవితేజ సినిమాలకి సంబంధించి హిట్ .. ఫ్లాప్ అనే విషయాలను పక్కన పెట్టేసి చూస్తే, కథ మాత్రం నత్త నడక నడవదు. తన బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగానే, తన సినిమా కథ మాంచి జోష్ తో పరుగులు తీయాలని ఆయన భావిస్తాడు. అలాగే మాస్ ఆడియన్స్ తన నుంచి ఆశించే అన్ని అంశాలు తన సినిమాల్లో ఉండేలా చూసుకుంటాడు. అందువల్లనే ఆయన మాస్ మహారాజ్ అనిపించుకున్నాడు. ఇక ఆయన తాజా చిత్రంగా ‘క్రాక్’ సినిమా రూపొందింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది.
రవితేజ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాకి గోపీచంద్ మలినేని దర్శకుడిగా వ్యవహరించాడు. తాజా ఇంటర్వ్యూలో రవితేజ మాట్లాడుతూ .. “గోపీచంద్ మలినేని నేను హీరోగా చేసిన ‘వెంకీ’ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. అప్పటి నుంచి నాకు ఆయనతో పరిచయం ఉంది. అయితే తను పెద్దగా మాట్లాడేవాడు కాదు. అందువలన ఆయనలో మంచి డైరెక్టర్ ఉన్నాడనే విషయం నాకు తెలియదు. తను నాకు ‘డాన్ శీను’ కథ వినిపించినప్పుడు కూడా నేను ఆశ్చర్యపోయాను. అయితే ఎలా తీస్తాడా అనే ఒక డౌట్ ఉండేది.
‘డాన్ శీను’ సినిమాతో గోపీచంద్ మలినేని నాకు మంచి హిట్ ఇచ్చాడు. ఆ సినిమా ఆయనకి కూడా మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ఆ తరువాత ఇద్దరం కలిసి ‘బలుపు’ సినిమా చేశాము. ఆ సినిమా కూడా మంచి వసూళ్లను రాబట్టింది. కొంత గ్యాప్ తరువాత ఇప్పుడు ‘క్రాక్’ చేశాము. గత సినిమాలకంటే గోపీచంద్ మలినేని ఈ సినిమాను బాగా తీశాడు. సంక్రాంతి కానుకగా బరిలోకి దిగుతున్న ఈ సినిమాతో, మాకు హ్యాట్రిక్ హిట్ పడటం ఖాయమనిపిస్తోంది” అని అన్నాడు. తమన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో రవితేజ సరసన శ్రుతి హాసన్ అలరించనుందనే సంగతి తెలిసిందే.
Must Read ;- ఫైనాన్స్ రచ్చేనా : రవితేజ క్రాక్.. రిలీజ్‌కు బ్రేక్!