( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
గాజువాకలో శనివారం రాత్రి వరలక్ష్మిని హత్య చేసిన తీరు వెనుక తాజాగా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వరలక్ష్మి హత్యపై వాస్తవాలను తెలుసుకునేందుకు ప్రయత్నించిన పి ఓ డబ్ల్యు, ఎన్ ఎఫ్ ఐ డబ్ల్యూ బృందం దృష్టికి అనేక విషయాలు వచ్చాయి. అవన్నీ అనేక అనుమానాలకు ఊతమిస్తున్నాయి.
గాజువాకలోని ఆమె బంధువుల్ని స్థానికులను కలిసి సమాచారం సేకరించి నేర స్థలాన్ని పరిశీలించగా లోపభూయిష్టమైన పోలీసులు దర్యాప్తు జరిగినట్టు మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి. సంచలనం సృష్టించిన వరలక్ష్మి హత్యకేసులో నేరస్తుడు చెప్పిన కథనాన్నే రీ కస్ట్ర్సక్షన్ చేసుకుని ఆ విధంగా జరిగిందని పోలీసులు చెబుతున్నారని పీవోడబ్ల్యూ లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. నేర స్థలాన్ని స్వాధీనం చేసుకుని పదే పదే గాలించి ప్రతి చిన్న సాక్ష్యాన్ని సేకరించాల్సిన పోలీసులు ఆ పని కూడా చేయలేదంటున్నారు.
కోడిగుడ్లు.. నిమ్మకాయలు.. నల్లని వస్త్రం
వరలక్ష్మి గొంతుకోసిన చోట గోడ పక్కన గోతిలో ఆమె షూ పడి ఉంది. దానిని పోలీసులు సేకరించకపోవడం గమనార్హం. రక్తపు మరకలు ఉన్నచోటే పైభాగంలో కోడిగుడ్డు, నిమ్మకాయలు, పసుపు, కుంకుమ నల్లగుడ్డలో ఏదో చుట్టేసి ఉంది. ఆ వస్తువు రంగు, వాటి స్వభావం చూస్తే శనివారం అక్కడ పెట్టినట్టు కనిపిస్తున్నాయి. నేరస్తులు ఒకరి కంటే ఎక్కువమందే దురుద్దేశంతో వరలక్ష్మిని అక్కడికి రప్పించి హత్య చేసినట్లు కనిపిస్తోందని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఆలయ ప్రాంగణం గోడ చాలా ఎత్తుగా ఉండి పొదల్లోకి వెళ్ళడానికి అనుకూలంగా లేదు. అటువైపు ఆమె అంతట ఆమె వెళ్లగలిగే పరిస్థితి కనిపించడం లేదు. నేరాన్ని అనేక కోణాల నుండి పరిశీలించాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తున్నా కానీ పోలీసుల దర్యాప్తులో ఈ విషయాలను పరిగణనలోకి తీసుకోనట్టు స్పష్టమవుతోంది. వరలక్ష్మి మరణంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ దృష్టికి మహిళా సంఘాల నేతలు తీసుకెళ్లారు. ఈ దర్యాప్తులో మరి ఏమైనా కొత్త కోణాలు చూస్తాయా? అన్నది వేచి చూడాలి. క్షుద్ర పూజలకు వినియోగించే వస్తువులు అక్కడ లభించడం వెనుక కారణాలపై పోలీసులు ఇప్పటి వరకు ఒక్క ప్రకటన కూడా చేయలేదు.











