సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం పాలైన వైసీపీకి వరుస ఎదురుదెబ్బలు తాకుతున్నాయి. కీలక నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఎంపీలు, ఎమ్మెల్సీలు సహా కింది స్థాయి నేతలు సైతం పార్టీకి, పదవికి రాజీనామా చేసి జగన్‌కు గుడ్‌బై చెప్తున్నారు. తాజాగా మరో కీలక నేత ఫ్యాన్ పార్టీకి షాకిచ్చారు. ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఆ పార్టీ ద్వారా సంక్రమించిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. మర్రి రాజశేఖర్ రాజీనామాతో ఐదుగురు ఎమ్మెల్సీలు వైసీపీని వీడినట్లయింది. గతంలో పోతుల సునీత, బల్లి కల్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, జయమంగళ వెంకటరమణ ఉన్నారు.
రాజీనామా తర్వాత జగన్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు మర్రి. జగన్ వైఖరి వల్లే తాను వైసీపీకి గుడ్‌బై చెప్పానన్నారు. త్వరలోనే లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకుంటానని చెప్పారు. 2011లో వైసీపీలో చేరి ఉమ్మడి గుంటూరు జిల్లా, పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అభివృద్ధికి కృషి చేశానన్నారు. ఐనప్పటికీ ఆ పార్టీలో అవమానాలే ఎదుర్కొన్నానని చెప్పారు. 2019లో ఎన్నికల్లో విజయం ఖాయమనుకున్న సమయంలో మరో వ్యక్తికి సీటు ఇచ్చారని చెప్పారు.
పార్టీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్సీని చేసి, మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగా హామీ ఇచ్చి జగన్ తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ మాట విని కార్యకర్తలు, అభిమానులు కష్టపడి పని చేశారని, అధికారంలోకి వచ్చాక ఆయన మాట తప్పి వేరేవారికి మంత్రి పదవి ఇచ్చారని గుర్తు చేశారు.
ఇక 2019లో చిలకలూరిపేట నుంచి గెలిచిన వ్యక్తి 2024లో గుంటూరులో పోటీ చేశారని చెప్పారు మర్రి. అప్పుడు కూడా తనను కనీసం సంప్రదించకుండా చిలకలూరిపేటలో వేరేవారికి సీటు ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా పని చేయాలని చెప్పిన జగన్..తర్వాత తిరిగి గుంటూరులో 50 వేలకు పైగా ఓట్లతో ఓడిపోయిన వ్యక్తికి మళ్లీ ఆ బాధ్యతలు అప్పగించి వెన్నుపోటు పోడిచారన్నారు. విశ్వసనీయత కోల్పోయిన జగన్ పద్ధతి నచ్చకే వైకాపాకు రాజీనామా చేస్తున్నానని కార్యకర్తల ముందు ప్రకటన చేశారు. మర్రి రాజీనామాతో ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీకి మరింత గడ్డుకాలం ఎదురుకానుంది.