ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తరఫు వ్యక్తులు రాయబారం నిమిత్తం.. రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవిల్లి అరుణ్‌కుమార్ వద్దకు వెళ్లినట్లుగా సమాచారం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున వ్యవహార దక్షత ఉన్న పెద్దలు, తిమ్మిని బమ్మిని చేసి అవతలివారిని ఒప్పించగల ఘటనాఘటన సమర్థులను రాయబారం నిమిత్తం ఉండవిల్లి వద్దకు బుధవారం నాడే పంపారని సమాచారం. ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నవారు.. జగన్మోహన్ రెడ్డి అడుగుల్ని తప్పుపడుతున్న వారు ఎందరో ఉన్నారు. ఎందరు ఎన్ని రకాలుగా విమర్శించినా జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ పట్టించుకున్నది లేదు. మరి ఒక్క ఉండవిల్లి విషయంలో మాత్రం ఎందుకు స్పందించారు..?
ఉండవల్లి వద్దకే ఎందుకు?
పోలవరం నిర్మాణ వ్యయాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.20,398 కోట్లకు తగ్గించినా, అధికార వైసీపీ నేతలు కేంద్రంతో పోరాటానికి దిగకపోవడంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది. దీనిపై గత వారం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ పోలవరం పై ఏపీకి జరిగిన అన్యాయంపై మీడియా సమావేశం ఏర్పాటుచేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తీరును తప్పుపట్టారు.
పోలవరంపై కేంద్రంతో యుద్ధం చేయకపోయినా, కనీసం కోర్టులో కేసు కూడా వేయకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. పోలవరాన్ని జాతీయ ప్రాజెక్టుగా గుర్తిస్తూ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్లమెంటు సాక్షిగా హామీ ఇచ్చారు. జాతీయ ప్రాజెక్టుకు పూర్తి ఖర్చు కేంద్రం భరించాల్సి ఉంటుంది.
తాజాగా కేంద్రం 2014 నిర్మాణ వ్యయ అంచనాల ప్రకారం రూ.20,398 కోట్లు మాత్రమే ఇస్తామని ప్రకటించింది. దీనిపై ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధానికి లేఖ రాసి చేతులు దులిపేసుకోవడాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తప్పుపట్టారు. ఏ విషయమైనా లోతుగా స్టడీ చేసి, మీడియా ముందుకు వచ్చే ఉండవల్లి అభిప్రాయాలతో చాలా మంది ఏకీభవిస్తూ ఉంటారు. పోలవరం విషయంలో ఉండవల్లి అరుణ్ కుమార్ ఏపీ ప్రభుత్వతీరును, సీఎం జగన్మోహన్ రెడ్డి తీరును మీడియా సమావేవంలో ఎండగట్టడంతో వైసీపీ పరువు పోయినట్టయింది. దీంతో ఉండవల్లిని ఇలాగే వదిలేస్తే, పార్టీ ప్రతిష్ట ఇంకా ఎంత దిగజారుతుందో అనే భయంతో ఉండవల్లితో రాయబారాలు ప్రారంభించారని తెలుస్తోంది.
పోలవరంపై పోరాటం ఎవరితో?
ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పోలవరం అంచనా వ్యయం విషయంలో కేంద్రంతో పోరాటాలు మాని, ప్రతిపక్ష టీడీపీని తప్పుపడుతూ కాలం గడుపుతోంది. ప్రతి అనర్థానికి చంద్రబాబే కారణం అంటే నమ్మడానికి జనం సిద్దంగా లేరు. పోలవరం జాతీయ ప్రాజెక్టు. ప్రతి ఒక్కరికీ తెలుసు. జాతీయ ప్రాజెక్టు అంటేనే ఖర్చంతా కేంద్రం భరించాలి. ఈ విషయం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోడీకి రాసిన లేఖలో కూడా స్పష్టం చేశారు. పోలవరం నిర్మాణం పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని, నిర్వహణ మాత్రమే ఏపీ ప్రభుత్వం చూసుకుంటుందని లేఖలో వివరించారు.
ఇదీ చదవండి :
వైసీపీ ఎమ్మెల్యే టీడీలో చేరుతారా? బీజేపీలో చేరుతారా?
ధరణి ముసుగులో మోసాలున్నాయ్ జాగ్రత్త!
అంటే పోలవరం మరో ఐదేళ్లకు పూర్తి చేసినా ఖర్చంతా కేంద్ర ప్రభుత్వం భరించాల్సిందే. ఈ విషయం వదిలేసి పోలవరం నిర్మాణ వ్యయాన్ని కేంద్రం తగ్గించడానికి చంద్రబాబే కారణం అంటూ, ఆయన అనుసరించిన విధానాలను తప్పుపడుతూ కూర్చుంటే రాజకీయ ప్రయోజనాలు కూడా నెరవేరే అవకాశం లేదు. ఈ విషయాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మీడియా సమావేశంలో కుండబద్దలు కొట్టారు. పోరాడాల్సింది కేంద్రంతో, ప్రతిపక్షంతో కాదని ఆయన సూటిగా చెప్పారు. దీంతో ఏపీ ప్రభుత్వం నోట్లో పచ్చి వెలక్కాయ పడ్డట్టయింది. పోలవరం విషయంలో వైసీపీ దిగజారుడు రాజకీయాలను ఉండవల్లి ఎండగట్టడంతో ఆయనతో రాయబేరాలు ప్రారంభించారని సమాచారం.
వ్యతిరేకగళాలను నొక్కివేస్తారా?
‘వినదగు నెవ్వరు చెప్పిన’ అని సుమతీ శతకంలో చెప్పినట్టు, మనకు శత్రువయినా మంచి చెబితే వినాలి. అంతేకాని మనం చేసే ప్రతిదానికి భజన చేసే వారిని పక్కనబెట్టుకుంటే ఎప్పటికైనా పుట్టి మునుగుతుంది. పోలవరం విషయంలో జరిగిన, జరుగుతున్న నష్టాన్ని మాజీ ఎంపీ ఉండవల్లి పూసగుచ్చినట్టు చెప్పారు. చంద్రబాబునాయుడు పాలనాకాలంలో పోలవరంపై ఏం జరిగింది, ఇప్పుడు ఏం జరిగిందో స్పష్టంగా చెప్పారు. పోలవరం జాతీయ ప్రాజెక్టుకదా అని నిర్మాణ బాధ్యతలను కేంద్రానికి అప్పగిస్తే వారు పనులు రెండు దశాబ్ధాలకు కూడా పూర్తి చేస్తారన్న నమ్మకం లేదు.
దేశంలో నత్తనడకన సాగుతున్న 12 జాతీయ ప్రాజెక్టుల పనులే ఇందుకు ఉదాహరణ. పోలవరం పనులు త్వరగా పూర్తి చేసుకోవాలని ఆనాడు చంద్రబాబు ప్రభుత్వం నిర్మాణ పనులను తీసుకుంది. వైసీపీ నాయకులు ఆనాడు పోలవరాన్ని టీడీపీ ఏటీఎంలా వాడుకుంటోందని ప్రచారం చేశారు. పోలవరానికి 55 వేల కోట్లు ఎందుకు 20 వేల కోట్లు సరిపోతాయని కేంద్రానికి లేఖలు కూడా రాశారు. ఇవన్నీ నేడు వైసీపీ ప్రభుత్వానకి శాపాల్లా మారాయి.
వారు అధికారంలోకి వచ్చాక పోలవరం పనులు ఏపీ ప్రభుత్వమే ఎందుకు చేస్తోంది. కేంద్రానికి అప్పగించాల్సింది కదా? అంటే ఎదుటి వాడు చేస్తే వ్యభిచారం, మనం చేస్తే సంసారం అన్న చందంగా పోలవరం విషయంలో ఏపీ ప్రభుత్వ వ్యవహారం తయారైందనే విషయాన్ని ఉండవల్లి కుండబద్దలు కొట్టారు. ఉండవల్లిని ఇలా వదిలేస్తే ఇంకా బజారుకు లాగుతాడనే భయంతో ఆయనతో వైసీపీ అగ్రనేతలు రాయబారాలు సాగిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఉండవల్లిని చంద్రబాబుమీదకే వదులుతారా?
అనేక విషయాలపై ప్రెస్ మీట్లు పెట్టి ఎవరినీ వదలకుండా ఏకిపారేస్తున్న మాజీ ఎంపీ ఉండవల్లిని మరలా చంద్రబాబుపైకి సంధించే అవకాశం ఉంది. ఉండవల్లి మీడియా సమావేశాలు పూర్తిగా ఆపివేస్తే ప్రజలకు అనుమానం వచ్చే అవకాశం ఉంది. మీడియా సమావేశాలు పెట్టాలి, కానీ అంతా నీవల్లే అంటే, అంతా చంద్రబాబునాయుడు వల్లే రాష్ట్రానికి అనర్థం జరిగిందన్న అర్థం వచ్చేలా ఉండవల్లితో మీడియా సమావేశాలు పెట్టిచాలని వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో తెలియాలంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.