కథానాయిక అందంగా ఉండాలనే ప్రేక్షకులు కోరుకుంటారు .. పాత్ర తీరు తెన్నులు ఎలాంటివైనా ఆమె అందంగా కనిపించాలనే ఆశిస్తారు. అందంగా ఉంటేనే ఆదరిస్తారు .. ఆ అందానికి అభినయం తోడైనప్పుడే అందలం ఎక్కిస్తారు. అలా అందమైన అభినయంతో తెలుగు తెరపై ఎంతోమంది కథానాయికలు తమదైన సంతకం చేశారు. అలాంటివారిలో ఎలాంటి భావాలనైనా కళ్లతో పలికించే కథానాయికలను వ్రేళ్లపైనే లెక్కపెట్టొచ్చు. ఈ తరం కథానాయికల జాబితాను తీసుకుంటే, ఆకర్షణీయమైన కళ్లతో అందరి మనసులను మంత్రించిన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కనిపిస్తుంది.
తెలుగు తెరపై కళ్లతోనే అద్భుతమైన హావభావాలను పలికించిన అలనాటి కథానాయికలుగా కాంచనమాల .. సావిత్రి .. బి. సరోజాదేవి .. కృష్ణకుమారి .. జమున ప్రేక్షకుల నుంచి ప్రశంసలను అందుకున్నారు. ఇక కళ్లతోనే ‘శ్రీదేవి’ చేసిన విన్యాసాలను అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేదు. ఆ తరువాత కాలంలో వచ్చిన ‘భానుప్రియ’ కళ్లతోనే నవరసాలను నాట్యం చేయించింది. ఆ తరువాత వచ్చినవారిలో కొంతవరకూ ఆ క్రెడిట్ ను ‘సౌందర్య’ సొంతం చేసుకుంది. ఇక ఈ జనరేషన్లో వచ్చిన ఆ తరహా కథానాయికలలో మాత్రం ‘అనుపమ పరమేశ్వరన్’ పేరు మాత్రమే వినిపిస్తోంది.
తెలుగు తెరకి ‘అ ఆ’ సినిమాతో పరిచయమైన అనుపమ పరమేశ్వరన్, ఆ తరువాత చేసిన ‘ప్రేమమ్’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆమెను ప్రేక్షకులకు మరింత చేరువ చేయడానికి ‘శతమానం భవతి’ సినిమా
దోహదపడింది. నానీ జోడీగా చేసిన ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాతో ఆమె మరో హిట్ ను సొంతం చేసుకుంది. ‘హలో గురు ప్రేమకోసమే’ ఆశించినస్థాయిలో ఆడకపోయినా, ఆమె పోషించిన ‘అనూ’ పాత్ర యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఇక చివరిగా బెల్లంకొండ శ్రీనివాస్ తో కలిసి ఆమె చేసిన ‘రాక్షసుడు’ కూడా విజయాన్ని సాధించింది. అయితే ఆ కథలో ఆమె హీరోయిన్ అని చెప్పడానికి లేదు. అందువలన ఆ హిట్ ఆమె ఖాతాలోకి చేరలేదు.
ప్రస్తుతం తెలుగులో అధికారికంగా అనుపమ చేస్తున్న సినిమా ఒక్కటే .. అదే ’18 పేజెస్’. గీతా ఆర్ట్స్ 2′ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ సినిమాలో, ‘నిఖిల్’ జోడీగా ఆమె కనిపించనుంది. కథ – స్క్రీన్ ప్లే సుకుమార్ అందిస్తున్న ఈ సినిమాకి, పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. కరోనా కారణంగా ఆరంభంలోనే ఆగిపోయిన ఈ సినిమా షూటింగ్, త్వరలోనే తిరిగి మొదలుకానుంది. అనుపమ తరువాత ప్రాజెక్టు ఏమిటి? అనే ప్రశ్నకు సమాధానమైతే ప్రస్తుతానికి కనిపించడం లేదు. ఇక తమిళ .. మలయాళ భాషల్లోను ఆమె ఒక్కో సినిమానే చేస్తోంది. ఈ కారణంగానేనేమో ఆమె జోరు తగ్గిందనే టాక్ జోరుగానే షికారు చేస్తోంది.