హైదరాబాద్‌ను ప్రకృతి పగబట్టిందా? అన్నంతగా వరుసగా భారీ వర్షాలు హైదరాబాద్ లో కురుస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం కూడా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడింది. దట్టమైన మేఘాలు అలుముకున్నాయి. దాంతో పట్టపగలే చీకట్లు కమ్మాయి. భారీ వర్షం ప్రభావంతో లోతట్టు ప్రాంతాలు మళ్లీ భయం గుప్పిట్లో వెళ్లాయి. ఎస్ఆర్‌నగర్, అమీర్‌పేట్, మల్కాజ్‌గిరి, నేరేడ్‌మెట్, సఫిల్‌గూడ, దిల్‌సుఖ్‌నగర్, కొత్తపేట, ఎల్‌బినగర్, మీర్‌పేట్, వనస్థలిపురం తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురిసినట్లు తెలుస్తోంది. అయితే మీర్‌పేట్ చెరువు కట్టకు గండి పడి లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తినట్లు తెలుస్తోంది. దీంతో ముంపుప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేసినట్లు తెలిసింది.
చెట్ల కింద ఉండొద్దు…
ఇప్పటికే వరద ముంపులో దాదాపు 200 కాలనీలు ఉన్నాయి. మళ్లీ భారీ వర్షం కురవడంతో లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముందస్తు చర్చల్లో భాగంగా జిహెచ్ఎంసి డిఆర్, ఇతర సిబ్బంది, అధికారులు రంగంలోకి సహాయక చర్యలు చేపడుతున్నారు. మరో రెండు రోజుల వరకు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వరద ముంపు ప్రాంత ప్రజలకు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. చెట్ల కింద వాహనదారులు ఉండొద్దని నగరవాసులను అధికారులు సూచనలు చేస్తున్నారు. సహాయక చర్యలు చేపట్టేందుకు 53 బోట్లను అందుబాటులో ఉంచినట్లు తెలుస్తోంది. అధికారులు బృందాలుగా ఏర్పడి ముంపు ప్రాంతాలను పర్యటిస్తున్నారు.
మరో అల్పపీడనం..
తెలుగు రాష్ట్రాలను వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. దీనికతోడు ఇప్పుడు మరో అల్పపీడనం ఏర్పడింది. మధ్య బంగాళఖాతం పరిసర ప్రాంతాలలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావం వలన అదే ప్రాంతములో ఉదయం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఇది మరింత తీవ్రంగా మారే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో రానున్న రోజుల్లో వర్షాలు పడే వీలుందని తెలుస్తోంది.










