నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఒక సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్ర షూటింగ్ మధ్యలోనే నిలిచిపోయింది. ఈమధ్యనే షూటింగ్స్ మొదలయ్యాయి. కానీ ఇప్పటి వరకు బాలయ్య – బోయపాటి సినిమా షూటింగ్ మాత్రం పట్టాలెక్కలేదు. ఎట్టకేలకు ఈ సినిమా షూట్ ను షురూ చేసింది చిత్ర యూనిట్. ఈరోజు నుంచి రెగ్యులర్ షూట్ ను స్టార్ట్ చేసినట్టుగా దర్శకుడు బోయపాటి శ్రీను ట్విట్టర్ ద్వారా తెలిపారు.
బాలయ్య షూటింగ్ లో చురుకుగా పాల్గొంటున్నారని, ఒక్క షెడ్యూల్ తో ఈ సినిమాను పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. ఈ చిత్ర షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసుకొని రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారు. అసలే బాలయ్య – బోయపాటి సినిమా అంటే అభిమానుల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘సింహ’, లెజెండ్ వంటి సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాలు సొంతం చేసుకున్నాయి.
వీరి కలయికలో వస్తోన్న మూడవ సినిమా కావడంతో నందమూరి అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా పక్కా మాస్ మసాలా ఎంటెర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలయ్య మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపిస్తాడని ఇప్పటికే దర్శకుడు బోయపాటి తెలిపారు. అలాగే ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో బాలయ్య – బోయపాటి శ్రీను హ్యాట్రిక్ కొడతారని ఆశిద్దాం.