పివి నరసింహారావు ఎంతటి గొప్ప రాజనీతిజ్ఞుడో మనకు తెలిసిందే. ఆయన హయాంలో ఎన్నో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చి మన దేశ జిడిపిని ఆనాడు పరుగులు పెట్టించిన ఘనుడు. దేశ ప్రధానిగా భారతదేశానికి సేవలందించిన తెలుగు తేజంగా మనం ఆయనను అభివర్ణించుకుంటాం. అలాంటి వ్యక్తికి సముచిత గౌరవ స్థానాన్ని కేంద్రం కల్పించాలని కోరుతూ ఆయనకు భారతరత్న పురస్కారం ఇవ్వాలని తెలంగాణ శాసన సభా సమావేశాల్లో మంగళవారం తీర్మానం చేయాలని నిర్ణయించారు. అయితే పివికి భారత రత్న ఇవ్వాలనే తీర్మానంపై ఎంఐఎం పార్టీ తమ అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ అసెంబ్లీకి గైర్హాజరైంది. దీనిపై పివి అభిమానులు, ప్రజలు అసంత`ప్తి వ్యక్తం చేస్తున్నారు.
ఆయనను మతం కళ్లద్దాల్లోంచి చూడవద్దని కోరుతున్నారు. ఆయన కేవలం తెలంగాణ గర్వించదగిన వ్యక్తి మాత్రమే కాదని మొత్తం దేశం గర్వించదగ్గ వక్తిగా చూడాలని తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మతం రంగును పులమొద్దని కోరుతున్నారు. ఈ నిరసన ద్వారా బాబ్రీ మసీదు కూల్చివేతను పీవీకి ముడిపెట్టడం సబబు కాదనే విషయాన్ని టిఆర్ఎస్, కాంగ్రెస్, ఇతర కొన్ని పార్టీ వర్గాలు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బాబ్రీ మసీదు కూల్చివేత ఘటనపై ఆనాడు పివి స్పందించిన తీరు మజ్లీస్‌కు మింగుడు పడనట్లుగా తెలుస్తోంది. అందుకే పివికి భారతరత్న ఇవ్వాలనే అంశంపై మజ్లీస్ ముభావంగా ఉన్నట్లుంది. ఈ నేపథ్యంలోనే అసెంబ్లీకి గైర్హాజరై ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు, పివి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఎంఐఎం సభకు గైర్హాజరైనంత మాత్రాన అసెంబ్లీ తీర్మానానికి వచ్చిన అడ్డంకి ఏమీ లేదు. వారు వ్యతిరేకించారనే ప్రచారం తప్ప సాధించేది మరేమీ ఉండదు అని ప్రజలు భావిస్తున్నారు.
టిఆర్ఎస్ పార్టీ మాత్రం పివికి భారత రత్న ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రతులను కేంద్రానికి పంపించడానికి రంగం సిద్ధం చేసింది. మరోపక్క పివి శతజయంతి ఉత్సవాలను ఏడాది పొడవునా నిర్వహించేలా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే.