ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తొలి రోజు నుంచే టీడీపీపై తన వ్యతిరేకతను సోము వీర్రాజు చాటుకున్నారు. తాజాగా అంతర్వేది ఆలయ రథం దగ్ధం విషయంపై స్పందించిన ఆయన వైసీపీ ప్రభుత్వాన్ని వదిలేసి గత టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దీంతో వీర్రాజు గారి బుద్ది మారలేదనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోంది.
అంతర్వేది ఆలయ రథం దగ్ధంతో హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని వ్యాఖ్యానించిన ఆయన ఇందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు. ఏపీలో టీడీపీ, వైసీపీ ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శలు చేశారు. ఇక అక్కడి నుంచి గత టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.
హిందుత్వం విషయంలో టీడీపీకి మాట్లాడే అర్హత లేదని పేర్కొన్న వీర్రాజు కృష్ణా పుష్కరాల సమయంలో 17 దేవాలయాలను టీడీపీ ప్రభుత్వం కూల్చివేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు అంత రాద్ధాంతం చేస్తున్న టీడీపీకి అప్పుడు హిందుత్వం గుర్తుకు రాలేదా? అంటూ ప్రశ్నించారు. దేవాలయాలను కూల్చిన స్థలాలను చూసేందుకు వెళ్లిన తమపై ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
కూల్చిన గుళ్ళలో ఒక్కటైనా తిరిగి చంద్రబాబు కట్టించాడా? అంటూ ఆయన ప్రశ్నించారు. దళిత క్రైస్తవులకు రిజర్వేషన్స్ కల్పిస్తామని చంద్రబాబు ఇచ్చారని గుర్తు చేసిన ఆయన ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వాలని తీర్మానం చేసిన టీడీపీనే ఇప్పుడు హిందూమతం గురించి ఆందోళన చెందుతోందని ఎద్దేవా చేశారు.రాష్ట్ర రాజధాని కోసం కేంద్రం 7వేల 200 కోట్లు ఇచ్చిందని తెలిపిన ఆయన రాజధానిలో ఏం కట్టారో చంద్రబాబు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రథం దగ్ధం విషయాన్ని కూడా టీడీపీని తిట్టడానికి ఉపయోగించుకున్న సోము వీర్రాజుపై విమర్శలు ప్రచారం జరుగుతున్నాయి. హిందుత్వానికి తామే వారసులమంటూ చెప్పుకొనే బీజేపీ వైసీపీ ప్రభుత్వాన్ని చూసీచూడనట్లు వదిలివేయడమేంటనే చర్చ జరుగుతోంది. ఏ ప్రభుత్వంలో జరిగినా తప్పు తప్పే. అలాంటిది ప్రస్తుత అధికారంలో ఉన్న వైసీపీని గాక టీడీపీపై సోము ఆగ్రహాన్ని వ్యక్తం చేయడంతో మీ బుద్ధి మారదా వీర్రాజూ అంటూ రాజకీయ వర్గాల నుంచి వార్తలు వినబడుతున్నాయి.