ఏపీ ఆర్థిక శాఖ మంత్రి ఈ సారి మీడియా ముందుకు రాకుండానే బుర్ర కథలు చెప్పేశారని విఫక్షాలు ఆరోపిస్తున్నాయి. గతంలో లెక్కా పత్రం లేకుండానే వేలాది కోట్లను ఏపీ ప్రభుత్వం ఖర్చు పెడుతోందని పీఏసీ చైర్మన్ హోదాలో టీడీపీ సీనియర్ నేత, అనంతపురం జిల్లా ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేసిన సమయంలో కాస్తంత గ్యాప్ తీసుకుని తీరిగ్గా మీడియా ముందుకు వచ్చిన బుగ్గన.. తనదైన శైలి బుర్ర కథ చెప్పారని విపక్ష టీడీపీ ఆరోపించిన సంగతి తెలిసిందే. అసలు పయ్యావుల చేసిన ఆరోపణలకు బుగ్గన సమాధానమే చెప్పలేదని కూడా టీడీపీ సహా ఇతర విఫక్షాలు ఆరోపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీ అప్పుల్లో కూరుకుపోతున్న వైనంపై విపక్షాలు గళం పెంచాయి. వరుసగా విమర్శలు సంధిస్తున్నాయి. దీనిపై అన్ని మీడియా సంస్థలు కూడా డీబేట్లు నడిపించేస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇక స్పందించకపోతే బాగుండదని అనుకున్నారో, ఏమో తెలియదు గానీ.. శనివారం సాయంత్రం ఏపీ ఆర్థిక పరిస్థితిపై బుగ్గన ఓ పత్రికా ప్రకటనను విడుదల చేశారు.
అప్పులన్నీ జనం ఖాతాల్లోకేనట
ఈ పత్రికా ప్రకటనలో బుగ్గన చాలా అంశాలనే వివరించారు. ఆ అంశాలేమిటంటే.. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఇప్పటిదాకా రాష్ట్ర ప్రభుత్వం రూ.1,27,105.81 కోట్ల అప్పులు చేసింది. అందులో రూ.1,05,102.22 కోట్లను నేరుగా జనం ఖాతాల్లో వేసింది. కేంద్రం అనుమతి మేరకే అప్పులు చేసింది. రాజకీయ లబ్ధి కోసమే విపక్షాలు విష ప్రచారం చేస్తున్నాయి. కరోనాతో ప్రభుత్వానికి రాబడులు తగ్గాయి.కరోనా కట్టడికి రూ.7130.19 కోట్లు ఖర్చు చేసింది. పరిమితికి లోబడే అప్పులు చేసింది. గతేడాది కాలంలో రూ.7947 కోట్ల ఆదాయాన్ని కోల్పోయింది.. ఇలా బుగ్గన పెద్ద చిట్టానే విప్పారు. బుగ్గన ప్రకటన ప్రకారం చేసిన అప్పుల్లో రూ.22 కోట్లు మినహా మిగిలిన మొత్తాన్ని సంక్షేమ పథకాల అమలులో భాగంగా నేరుగా జనం ఖాతాల్లోనే వేసిన వైనాన్ని బుగ్గన తేల్చేశారు. అంటే.. కేవలం సంక్షేమ పథకాల అమలు కోసమే జగన్ సర్కారు అప్పులు చేసిందని కూడా బుగ్గన తేల్చేశారు. అంటే.. తీసుకొచ్చిన అప్పుల్లో అభివృద్ధి పనులకు వినియోగించిన మొత్తం లేశమాత్రమేనని కూడా బుగ్గన చెప్పేసినట్టే కదా.
మీడియా ముందుకు రాలేదెందుకో?
గతంలో పయ్యావుల చేసిన కామెంట్లు ఏపీలో కలకలమే రేపాయి. కేవలం ఆరోపణలతోనే ముగించని పయ్యావుల పక్కా ఆధారాలు తీసుకుని నేరుగా రాజ్ భవన్ వద్దకెళ్లి గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామం వైసీపీలో పెను ప్రకంపనలే సృష్టించినట్టే ఉంది. పయ్యావుల వెల్లడించిన వివరాల సేకరణకే బుగ్గనకు చాలా సమయం పట్టిందన్న వాదనలు కూడా వినిపించాయి. పయ్యావుల ఆరోపణను ఖండించేందుకు మీడియా ముందుకు వచ్చిన బుగ్గనకు చుక్కలు కనిపించాయి. మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు బుగ్గన నుంచి సరైన సమాధానాలు రాలేదు. దీంతో తన పరువుతో పాటు సీఎం జగన్ పరువు కూడా బుగ్గన తీసేశారన్న వాదనలు వినిపించాయి. ఈ నేపథ్యంలోనే తాజా ఆందోళనలపై వివరణ ఇచ్చేందుకు సిద్ధమైన బుగ్గన.. గతానుభవాలను గుర్తు చేసుకుని కేవలం పత్రికా ప్రకటనకే పరిమితమయ్యారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- బుగ్గన ఏపీలో కనిపించరా?











