ఏపీలో ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉన్న వైనంపై ఇటీవలి కాలంలో అంతకంతకూ ఆందోళన పెరిగిపోతోంది. ఉద్యోగుల వేతనాలు, రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్ల చెల్లింపులకూ జగన్ సర్కారు అప్పుల బాటనే పడుతోంది. ఈ క్రమంలో ఒకటో తారీఖు వేతనాలు అన్న మాట ఉద్యోగులు ఎప్పుడో మరిచిపోయారు. రాబడి లేకుంటే అప్పుల బాట పట్టడం ఓకే గానీ.. నిత్యం రాబడి పెరుగుతూనే ఉన్నా కూడా జగన్ సర్కారు అప్పుల బాటలోనే సాగుతున్న వైనంపై ఇప్పుడు కొత్త తరహా అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇదేదో వైసీపీ అంటే గిట్టని వారు చెబుతున్న మాట కాదు. స్వయంగా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు తాజాగా విడుదల చేసిన గణాంకాలే ఈ మాటను చెబుతున్నాయి. పన్నుల వసూళ్లు పెరిగాయంటే.. ఆదాయం పెరిగినట్టే కదా. మరి గతేడాది ఆగస్టుతో పోలిస్తే.. ఈ ఏడాది అటు కేంద్రం ఖాతాలోకి వెళ్లే జీఎస్టీ వసూళ్లతో పాటు ఇటు ఏపీ నుంచి కేంద్రానికి వెళ్లే జీఎస్టీ వసూళ్లు కూడా పెరిగాయి. మరి ఆదాయం పెరుగున్నట్టే కదా. ఆదాయం పెరిగినప్పుడు అప్పులు చేయాల్సిన అవసరం ఏముంది? అదే ఇప్పుడు కొత్త తరహా చర్చకు దారి తీస్తోంది.
జీఎస్టీ వసూళ్ల లెక్క ఇదే
ఈ ఏడాదిలో ఆగస్టు నెల మంగళవారంతో ముగిసింది కదా. ఈ నేపథ్యంలో ఆగస్టు నెలలో వసూలైన జీఎస్టీ గణాంకాలను కేంద్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే.. జీఎస్టీ పన్నుల వసూళ్లు ఏకంగా 30 శాతం మేర పెరిగాయి. ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు ఏకంగా రూ.1,12,020 కోట్లు వసూలయ్యాయి. ఈ వసూళ్ల పెరుగుదలలో తెలుగు రాష్ట్రాలు కూడా సత్తా చాటాయి. ఏపీలో జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే.. ఏకంగా 33 శాతం పెరిగాయి. అంటే.. దేశవ్యాప్తంగా పెరిగిన జీఎస్టీ వసూళ్ల కంటే ఏపీ వసూళ్లలో నమోదైన పెరుగుదలే అధికం కదా. ఇక అన్ని వనరులున్నాయని చెప్పుకుంటున్న తెలంగాణ కూడా ఏపీ మాదిరిగా సత్తా చాటలేకున్నా.. 26 శాతం పెరుగుదలను నమోదు చేసింది. మొత్తంగా జీఎస్టీ సగటు వసూళ్లలో ఏపీ టాప్ లేపిందన్న మాటే కదా.
పెరిగిన ఆదాయం ఏమవుతోంది?
పన్నుల వసూళ్లు పెరగడమంటే ప్రభుత్వానికి ఆదాయం పెరిగినట్టే కదా. జీఎస్టీ వసూళ్లలోనూ కేంద్రం వాటాతో పాటు రాష్ట్రం వాటా కూడా ఉంటుంది కదా. మరి జీఎస్టీ వసూళ్లు పెరిగితే.. రాష్ట్రాలకు కూడాఇ పెరిగినట్టే కదా. ఖర్చుకు తగ్గ రాబడి లేకుంటే అప్పులు బాట పట్టినా అర్థం ఉంటుంది. మరి రాబడిలో క్రమంగా వృద్ధి నమోదు అవుతుంటే.. ఖర్చులేమీ పెరగవు కదా. అంటే.. రాబడి పెరిగితే ఖర్చులకు సరిపడ నిధులు చేతిలో ఉన్నట్టే కదా. మరి రాబడి పెరుగుతున్నా కూడా ఏపీలోని జగన్ సర్కారు ఎందుకు అప్పులు చేస్తున్నట్లు? అసలు పెరుగుతున్న రాబడిని జగన్ ప్రభుత్వం ఏం చేస్తోంది? ఖర్చులకు సరిపడ రాబడి లేకున్నా.. రాబడిలో పెరుగుదల ఉంటే.. చేసే అప్పుల మొత్తం కూడా తగ్గాలి కదా. మరి మరింత మేర అప్పుల కోసం జగన్ సర్కారు ఎందుకు సాహసిస్తున్నట్టు? ఈ ప్రశ్నలకు జగన్ సర్కారు ఎప్పుడు సమాధానం చెబుతుందో.. అసలు చెబుతుందో, లేదో కూడా తెలియని పరిస్థితిపై ఆసక్తకర చర్చ మొదలైపోయింది.











