ఏ రాష్ట్ర మంత్రి అయినా.. తనకు కేటాయించిన శాఖను పర్యవేక్షిస్తూ.. అవసరం అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపాల్సి వస్తేనే ఢిల్లీ ఫ్లైటెక్కుతారు. అయితే ఏపీ ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహారం చూస్తుంటే.. ఏపీకి మంత్రి అయిన ఆయన నిత్యం దేశ రాజధాని ఢిల్లీలోనే కనిపిస్తున్నారు. ఏపీలో అస్సలు కనిపించడం లేదు. ఏపీలో అప్పుడప్పుడు కనిపించినా.. ఏదో చుట్టపు చూపుగా ఏపీకి వస్తున్నట్టుగానే ఆయన వ్యవహారం కనిపిస్తోంది. అప్పుడెప్పుడో ఏపీ ప్రభుత్వం లెక్కాపత్రం లేకుండా ఖర్చులు చేస్తోందని పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సమయంలో.. ఆ ఆరోపణలను ఖండించేందుకు మీడియా ముందుకు వచ్చిన బుగ్గన.. ఆ తర్వాత అసలు ఏపీలో కనిపించనే లేదని చెప్పాలి. ఈ తరహా వైఖరి కారణంగా బుగ్గన ఎప్పటికప్పుడు విపక్షాలకు టార్గెట్ అవుతున్నారు.
నిర్మలతో భేటీ
ఢిల్లీకి ఎప్పుడెళ్లారో తెలియదు గానీ.. మంగళవారం నాడు బుగ్గన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. సుధీర్ఘంగానే సాగిన ఈ భేటీలో చాలా అంశాలు చర్చకు వచ్చినట్టుగా బుగ్గనే స్వయంగా చెప్పారు. ఈ సందర్భంగా బుగ్గన ఏమన్నారంటే.. ‘‘అన్‌రాక్ అల్యూమినియం కంపెనీ వివాదంలో పరిష్కారం కోసం రకరకాలుగా ప్రయత్నిస్తున్నాం. ఈ కంపెనీకి సంబంధించిన ఆర్బిట్రేషన్ కేసుపై నిర్మల సీతారామన్‌తో చర్చించా. ఈ సంస్థకు అవసరమైన బాక్సైట్‌ను ఏపీ సరఫరా చేసేలా ఏర్పాట్లు చేయడానికి యత్నిస్తున్నాం. ఈ కేసులో చట్టపరంగా ఉన్న అడ్డంకులు తొలగిపోతే ఒక పెద్ద కంపెనీ ఆంధ్రప్రదేశ్‌కు వస్తుంది. అలాగే ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ సంస్థల ఏర్పాటుకు రాష్ట్రంలో భూకేటాయింపులపై కూడా నిర్మలతో మాట్లాడా. ఈ సంస్థల స్థాపనకు అవసరమైన భూములను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. రాష్ట్రంలో సాధ్యమైనన్ని ఎక్కువ విద్యా సంస్థలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలు ఉండాలని సీఎం జగన్ భావిస్తున్నారు. పోలవరం నిధుల గురించి కూడా నిర్మలతో చర్చించా’’ అని బుగ్గన చెప్పారు.
ఏపీ భవన్ లో బస చేస్తున్నట్లేనా?
మొన్నటిదాకా ఎప్పుడు ఢిల్లీకి వెళ్లినా మీడియా కంటబడకూడదన్న భావనతో బుగ్గన ఢిల్లీలోని ఏపీ భవన్ ముఖం కూడా చూసేవారు కాదు. తన వెంట వచ్చే అధికారులతో కలిసి ఆయన ఖరీదైన స్టార్ హోటళ్లలోనే బస చేసేవారు. తన పర్యటన వివరాలు గోప్యంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే వారు. అసలే రాష్ట్రం అప్పుల్లో ఉంటే.. ఏం పని మీద వెళతారో గానీ.. బుగ్గన లక్షలకు లక్షలు ప్రజా ధనాన్ని వృథా చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు. అయితే ఇప్పుడా విమర్శలు కాస్తంత తగ్గినట్టే కనిపిస్తున్నాయి. అంతేకాకుండా కేంద్ర మంత్రులతో భేటీ అయిన సందర్భాల్లో అక్కడే మీడియా ముందుకూ వస్తున్నారు. మరి ఇప్పుడైనా ఏపీ భవన్ లోనే బుగ్గన బస చేస్తున్నారా? అన్న దిశగా ఆసక్తికర విశ్లేషణలు సాగుతున్నాయి.











