అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గానికి రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన నేత పయ్యావుల కేశవ్. ఈ నియోజకవర్గం నుంచి ఆయన 1994,2004,2009,2019లలో ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1994లో తొలిసారి ఎన్నిక కావడంతో ఆయనకు మంత్రి వర్గంలో చోటు దక్కలేదు. పలు అంశాలపై కేశవ్ చేసిన సూచనలు అందరి దృష్టిని ఆకర్శించాయి. 1999 ఎన్నికలలో తిరిగి టీడీపీ అధికారంలోకి వస్తే కేశవ్ కు మంత్రి పదవి తప్పకుండా లభిస్తుందని అందరూ ఆశించారు. కానీ అదృష్టం ఆయనను వెక్కిరించింది. ఆ ఎన్నికలలో ఆయన తన చిరకాల ప్రత్యర్థి ఎల్లారెడ్డి గారి శివరామ రెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో మంత్రి పదవి చేపట్టలేకపోయారు.
2004,2009లలో వరుసగా ఆయన టీడీపీ నుంచి గెలుపొందారు. కానీ దురదృష్టవశాత్తు టీడీపీ అధికారంలోకి రాలేకపోయింది. ప్రజా హద్దుల కమిటీ చైర్మన్ గా, విపక్ష నేతగా ఆయన అప్పటి వైఎస్ఆర్ ప్రభుత్వానికి మూడు చెరువుల నీళ్లు తాగించాడు. ఓటమితో నిస్తేజంలో ఉన్న పార్టీ శ్రేణులను దిశా నిర్దేశం చేస్తూ ఆయన కీలక పాత్ర పోషించారు. అధ్యక్షుడు చంద్రబాబు కూడా కేశవ్ కు పోత్సాహం అందించడంతో కేశవ్ తన సత్తా చాటారు. కేశవ్ ప్రసంగాలకు రాష్ట్ర వ్యాప్తంగా అభిమానులు ఉండేవారని చంద్రబాబు కూడా చెప్పిన సంగతి తెలిసిందే. టీడీపీ అధికారంలోకి రాగానే కేశవ్ కు మంత్రి పదవి వస్తోందని రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది.
2014లో జరిగిన ఎన్నికలలో టీడీపీ గాలి రాష్ట్ర వ్యాప్తంగా వీచినా ఉరవకొండ నుంచి కేశవ్ ఓడిపోయారు. ఇది ఒక రకంగా ఆయనకు ఆశనిపాతమే. కానీ పార్టీ అధికారంలోకి రావడంతో మంత్రి పదవి రావడం ఖాయమని కేశవ్ భావించారని తెలుస్తోంది. సామాజిక సమీకరణాల దృష్ట్యా ఎమ్మెల్సీ పదవి దక్కినా మంత్రి పదవి మాత్రం దక్కలేదు. 2019 ఎన్నికలలో తిరిగి ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందిన పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. మంత్రిపదవి ‘అందని ద్రాక్ష’గా కేశవ్ కు మిగిలిపోయిందని నియోజక వర్గ ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ఈ విషయంలోనే కేశవ్ టీడీపీ అధిష్ఠానంపై గుర్రుగా ఉన్నారనే వార్తలు వినబడుతున్నాయి.
పార్టీ మారి వైసీపీలో చేరే ఉద్దేశం తనకు లేదని ఇప్పటికే స్పష్టం చేసిన కేశవ్ టీడీపీ తన పట్ల చిన్న చూపు చూస్తోందని ఆలోచనలో ఉన్నట్లు జిల్లా వాసులు చెబుతున్నారు. చంద్రబాబును మినహాయించి ఒకరిద్దరు టీడీపీ నేతలు తప్పా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడం లేదు. విషయ అవగాహనతో బాటు మంచి వ్యక్తగా పేరొందిన కేశవ్ జగన్ సర్కార్ పై ఇప్పటి వరకు నోరు మెదప లేదు. కేశవ్ యాక్టీవ్ అయి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించాలని టీడీపీ శ్రేణులు, అభిమానులు కోరుకుంటున్నారు!











