ప్రకాశం జిల్లాతో పాటుగా కొంత మేర నెల్లూరు జిల్లా నీటి కొరతను తీర్చేందుకు ఉద్దేశించిందే వెలిగొండ ప్రాజెక్టు. రాష్ట్ర విభజనకు ముందే ఈ ప్రాజెక్టుకు కేంద్రం అనుమతులు మంజూరు చేసింది. ప్రాజెక్టు పనులు కూడా దాదాపుగా పూర్తి కావచ్చే స్థితిలో ఉన్నాయి. టీడీపీ హయాంలో ఈ ప్రాజెక్టు పనులు పరుగులు పెట్టగా.. వైసీపీ పాలన మొదలయ్యాక పనుల స్పీడు పడకేసింది. ఇలాంటి నేపథ్యంలో ఉరుము లేని పిడుగులా కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కారు ఈ ప్రాజెక్టును గెజిట్ లో చేర్చలేదు. అయితే ప్రాజెక్టు ప్రాధాన్యం దృష్ట్యా.. నిధుల విడుదలకు మాత్రం అంగీకరించింది. గోరు చుట్టుపై రోకటి పోటు మాదిరిగా.. గెజిట్ లో లేని ప్రాజెక్టుకు నిధులు ఎలా విడుదల చేస్తారంటూ తెలంగాణ అభ్యంతరపెడుతోంది. వెరసి ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిపోయింది. అయితే తెలంగాణకు సర్దిచెప్పి.. ప్రాజెక్టును గెజిట్ లో చేర్చేలా ఏపీలో అధికారంలోకి వచ్చిన వైసీపీ చర్యలు చేపట్టాల్సి ఉంది. ఆ బాధ్యతను వైసీపీ మరిచిపోగా.. విపక్షంలో ఉన్నా.. రాష్ట్ర భవిష్యత్తు, ప్రకాశం జిల్లా అభివృద్ధి గురించి ఆలోచించిన టీడీపీ ఆ బాధ్యతను తన భుజానికెత్తుకుంది.
ఢిల్లీలో కేంద్ర మంత్రితో భేటీ
ఈ క్రమంలో ప్రకాశం జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, ఆ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేల బృందం మంగళవారం ఢిల్లీకి చేరింది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. ఈ బృందంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, గొట్టిపాటి రవికుమార్, డోల బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, ఉదయగిరి మాజీ శాసనసభ్యులు బొల్లినేని రామారావు, ప్రకాశం జిల్లా మాజీ ఎమ్మెల్యేలు కందుల నారాయణరెడ్డి, ముక్కు ఉగ్రనరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్ రావు, బి ఎన్. విజయ్ కుమార్, ముత్తముల అశోక్ రెడ్డి, పార్టీ నేతలు గూడూరి ఎరిక్షన్ బాబు, దామచర్ల సత్య తదితరులు ఉన్నారు.
సానుకూలంగా షెకావత్
తనను కలిసి టీడీపీ ప్రతినిధి బృందం చెప్పిన వాదన మొత్తం సావదానంగా విన్న మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు. వెలిగొండను గెజిట్ లో చేర్చాలని మంత్రిని కోరిన బృందం.. విభజన చట్టంలో వెలిగొండకు అనుమతులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం జారీ చేసిన గెజిట్ లో వెలిగొండను చేర్చలేదని, తక్షణమే వెలిగొండ ప్రాజెక్టునుఅనుమతి కలిగిన ప్రాజెక్టు గా గెజిట్ లో చేర్చాలని బృందం మంత్రిని కోరింది. ఈ క్రమంలోనేప్రకాశం జిల్లా కరువు కాటకాలు, ప్రజల ఇబ్బందులు, త్రాగు,సాగు నీటి సమస్యలను బృందం సభ్యులు మంత్రికి వివరించారు. టీడీపీ ప్రతినిధి బృందం చెప్పిన వివరాలన్నింటినీ విన్న తర్వాత.. గెజిట్ లో వెలిగొండ ప్రాజెక్టును చేర్చే దిశగా చర్యలు చేపడతామని మంత్రి హామీ ఇచ్చారు. వెరసి వైసీపీ చేయాల్సిన పనిని ఇప్పుడు బాధ్యత కలిగిన టీడీపీ తన భుజానికెత్తుకున్నదన్న మాట.
Must Read ;- టీడీపీకి దమ్ముంది.. మరి వైసీపీ మాటేంటో?