No Disha Act In AP :
గుంటూరు జిల్లాలో బీటెక్ విద్యార్థిని రమ్య హత్య కేసు జగన్ సర్కారును పూర్తిగా డిఫెన్స్ లో పడేసింది. నేరాల నియంత్రణ పట్టని జగన్ సర్కారు.. మహిళలపై ప్రత్యేకించి దళిత మహిళలపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నా పట్టించుకోకుండా.. దారుణాలు జరిగిన తర్వాత పరిహారం ఇచ్చేస్తే సరిపోతుందన్న కోణంలో కొనసాగుతున్న వైనంపై ఇప్పుడు ఏపీలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం దిశ పేరిట ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చామని, ఆ చట్టం ప్రకారం దిశ పోలీస్ స్టేషన్లు, దిశ యాప్ ను కూడా అమల్లోకి తీసుకువచ్చామని జగన్ సర్కారు చెబుతున్న సంగతి తెలిసిందే. ఇదే మాటను సీఎం జగన్ తో పాటు రాష్ట్ర హోం మంత్రిగా ఉన్న దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళా నేత మేకతోటి సుచరిత కూడా పదే పదే చెబుతున్నారు. అయితే వీరిద్దరి మాటలతో పాటు వైసీపీ చేస్తున్న దిశ ప్రకటనల్లో ఎలాంటి వాస్తవం లేదని తేలిపోయింది. ఈ మేరకు గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సంచలన ప్రకటన చేశారు.
హఫీజ్ ఏమంటారంటే..?
ఏపీలో దిశ చట్టం అమలులో లేదని గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ సంచలన ప్రకటన చేశారు. అదేదో ఆయన అలా సాధారణంగా చెప్పిన మాటేమీ కాదు. రమ్య హత్య జరిగిన తర్వాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలోనే హఫీజ్ ఈ సంచలన విషయాన్ని వెల్లడించారు. ఓ ఐపీఎస్ అధికారిగా హఫీజ్ ఏమీ అబద్ధం చెప్పరు కదా. భారత రాజ్యాంగం నిర్దేశించిన మేరకే విధులు నిర్వర్తించే సివిల్ సర్వెంట్లు.. తాము రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తున్నా గానీ.. కేంద్రం నిర్దేశించిన మేరకే వ్యవహరించాల్సి ఉంటుంది. స్థానిక ప్రభుత్వాల ప్రలోభాల మేరకు ఒకరిద్దరూ మాట తూలినా.. మెజారిటీ సివిల్ సర్వెంట్లు కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాల మేరకే వ్యవహరిస్తారు కూడా. హఫీజ్ చెప్పిన మాటలో నిజముంది కూడా. దిశ చట్టం పేరిట జగన్ సర్కారు ప్రతిపాదించిన బిల్లును చట్టంగా రూపొందిందే విషయాన్ని కేంద్రం పక్కనపెట్టింది. ఈ బిల్లులో చాలా అంశాలపై సందేహాలున్నాయని, వాటిని క్లారిఫై చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలో ఈ బిల్లు చట్టంగా రూపుదాల్చే వ్యవహారం ఇంకా పూర్తి కాలేదు. కేంద్రం దీనిని ఇంకా చట్టంగా రూపొందించలేదు కూడా. హఫీజ్ కూడా ఇదే విషయాన్ని విస్పష్టంగానే చెప్పేశారు.
మరి అబద్ధాలెందుకు?
దిశ బిల్లు చట్టంగా రూపుదాల్చకున్నా.. వైసీపీ ప్రభుత్వ పెద్దలతో పాటు ఆ పార్టీకి చెందిన కీలక నేతలు, కేడర్ నిత్యం దిశ చట్టాన్ని అమలు చేస్తున్నామని చెప్పడమంటే.. అబద్ధం చెబుతున్నట్టే కదా. ఇదే విషయాన్ని పలు మీడియా సంస్థలకు చెందిన ప్రతినిధులు ప్రస్తావించినా కూడా వైసీపీ నేతల్లో మార్పు రావడం లేదు. అంతేకాకుండా ఈ విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తేనే.. అవును. నిజమే. తాము దిశ బిల్లును చట్టంగా ఆమోదించమని పంపాం. కేంద్రమే ఇందులో జాప్యం చేస్తోంది. దానికి తామెలా బాధ్యులం అవుతాం. దిశ బిల్లు చట్టంగా అమలు కాకున్నా కూడా రాష్ట్రంలో ఆ బిల్లులోని అంశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నామంటూ వైసీపీ నేతలు చెబుతున్న తీరు కూడా వివాదాస్పదంగా మారుతోంది. బిల్లును చట్టంగా ఆమోదింపజేసుకోవడాన్ని పక్కనపెట్టి.. ఇంకెన్ని చెప్పినా ప్రయోజనం లేదు కదా. ఈ సత్యాన్ని వైసీపీ నేతలు ఎప్పుడు గమనిస్తారో? ఏమో?.
Must Read ;- వైసీపీని వీడి.. టీడీపీ వైపుగా దళితులు