ఏపీ అప్పుల ఊబిలో కూరుకుపోతోంది. ఇప్పటికే ఏపీ అప్పు రూ.5 లక్షల కోట్లకు చేరిపోయిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. జగన్ తన రెండేళ్ల పాలనలోనే రూ.1.21 లక్షల కోట్లకు పైగా అప్పులు చేశారని కూడా చెబుతున్నాయి. చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో కేవలం రూ.1.44 లక్షల కోట్ల అప్పులతోనే నెట్టుకొచ్చారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో ఏపీ నెత్తిన పడిన అప్పు రూ.97,124 కోట్లను కలుపుకుంటే.. చంద్రబాబు పదవి దిగిపోయే నాటికి ఏపీ అప్పుల మొత్తం రూ.2.52 లక్షల కోట్లకు చేరింది. అంటే జగన్ సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టే నాటికి ఏపీ మొత్తం అప్పు రూ.2.52 లక్షల కోట్లు. అయితే తన రెండేళ్ల పాలనలోనే జగన్ ఏకంగా రూ.1.21 లక్షల కోట్ల మేర అప్పులు చేశారు. ఈ అప్పును కూడా కలుపుకుంటే.. ప్రస్తుత ఏపీ మొత్తం అప్పు రూ.3.73 కోట్లకు చేరింది. జగన్ ఇంకా రెండున్నరేళ్ల కంటే కూడా అధిక కాలమే ఏపీకి సీఎంగా ఉండనున్నారు. మరి రెండేళ్లకే రూ.1.21 లక్షల కోట్ల అప్పు చేసిన జగన్.. మిగిలిన మూడేళ్లో, రెండున్నరేళ్లలో అంతకంటే ఎక్కువే అప్పు చేస్తారు కదా. అంటే.. జగన్ తొలి టెర్మ్ అయిపోయే నాటికి ఏపీ మొత్తం అప్పు ఏకంగా రూ.5 లక్షల కోట్లను దాటిపోనుందన్న మాట.
జగన్ ఏమన్నారంటే..?
ఏపీలో నానాటికీ పెరిగిపోతున్న అప్పులపై వైసీపీ మినహా దాదాపుగా అన్ని రాజకీయ పార్టీలు, మేథావులు, ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఆందోళనలపై జగన్ ఇప్పటిదాకా ఏమాత్రం దృష్టి సారించలేదనే చెప్పాలి. అయితే శుక్రవారం నాడు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వ సాయాన్ని విడుదల చేసిన సందర్భంగా అప్పులపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై జగన్ స్పందించారు. ప్రజలకు మేలు చేద్దామనే అప్పులు చేస్తున్నామని సంచలన వ్యాఖ్యలు చేస్తున్న జగన్.. ప్రజల కొనుగోలు శక్తి పెంచేందుకే సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా జగన్ ఏమన్నారంటే.. **ప్రజల్లో కొనుగోలు శక్తి లేకపోతే పారిశ్రామిక రంగం క్షీణిస్తుంది. అందుకే అప్పు చేసైనా సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ విషయంలో ప్రతిపక్షాలు దురుద్దేశంతో ప్రచారం చేస్తున్నాయి. తమ ప్రభుత్వంలో పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యమిస్తున్నాం. మన కర్మ కొద్దీ రాష్ట్రంలో ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 ఉన్నాయి. వారికి కొమ్ము కాసే టీడీపీ ఉండటం దురదృష్టకరం. మంచి పనులను కూడా వీరు నెగిటెవ్ లైన్లో చూపించే అధ్వానమైన పరిస్థితులు ఉన్నాయి. పండ్లు పండే చెట్టుకే కదా రాళ్ల దెబ్బలు. మంచి చేయాలనుకున్నాం చేసి చూపిస్తాం@@ ఇలా జగన్ ప్రసంగం సాగిపోయింది.
అప్పులతో సంక్షేమం సక్రమమేనా?
ఎక్కడైనా ఆదాయం పెరిగే పనుల కోసం అప్పులు తేవడం సర్వసాధారణమే. అయితే జగన్ జమానాలో కేవలం సంక్షేమం కోసం అప్పులు చేస్తున్నామని స్వయంగా సీఎంగా ఉన్న జగనే చెబుతుంటే.. మరి సంక్షేమం కోసం తెచ్చిన అప్పులను తీర్చడమెలా? అదే అభివృద్ధి పనుల కోసం అప్పులు తెస్తే. ఆయా అభివృద్ధి పనుల వల్ల ఆదాయం పెరిగి అప్పులు తీర్చేందుకు నిధులు జతకూడతాయి. మరి హారతి కర్పూరంలా కరిగిపోయే సంక్షేమానికి అప్పులు చేస్తామంటే ఎలా? అన్న వాదనలు ఆసక్తి రేపుతున్నాయి. సంక్షేమ పథకాల కోసం కూడా అప్పులు చేయడం ఓ పరిధి మేరకు కరెక్టేనని సంభాళించుకున్నా.. ఇతరత్రా అభివృద్ధి పనులన్నింటినీ వదిలేసి.. కేవలం సంక్షేమ పథకాల అమలు, వాటి కోసం అప్పుల కోసం వెంపర్లాటతోనే సాగితే.. ఇక అభివృద్ధిపై దృష్టి సారించేదెప్పుడు? ఆ అప్పులను తీర్చేదెప్పుడు? అన్న దిశగా ఇప్పుడు ఆసక్తికర విశ్లేషణలకు తెర లేసింది.
Must Read ;- బాబు పోయి జగన్ వచ్చే!.. టాప్ 4 పోయి 13 వచ్చే!











