స్థానిక సంస్థల ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి పెద్దిరెడ్డిని ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇంటికే పరిమితం చేయడంతోపాటు, మీడియాతో మాట్లాడకూడదని ఎస్‌ఈసీ ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. మంత్రిని ఇంటికే పరిమితం చేయాల్సిన పనిలేదని అయితే మీడియాతో మాత్రం మాట్లాడవద్దని సింగల్ జడ్జి తీర్పు చెప్పారు. దీనిపై మంత్రి పెద్దిరెడ్డి డివిజన్ బెంచ్‌కు అప్పీల్ చేసుకున్నారు. దీనిపై నిన్న వాదనలు విన్న న్యాయమూర్తులు, నేడు తీర్పు వెలువరించారు. స్థానిక ఎన్నికలు పూర్తయ్యే వరకు ఎన్నికల నియమావళికి మంత్రి పెద్దిరెడ్డి కట్టుబడి ఉండాల్సిందేనన్న హైకోర్టు తీర్పు వెలువరించింది.
మీడియాతో మాట్లాడవచ్చు కానీ..
మంత్రి పెద్దిరెడ్డి మీడియాతో మాట్లాడవచ్చని కానీ స్థానిక ఎన్నికల గురించి కానీ, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గురించి మాట్లాడటానికి వీల్లేదని ధర్మాసనం ఆదేశించింది. మీడియాతో మాట్లాడవద్దు అని చెప్పడం రాజ్యాంగం కల్పించిన భావప్రకటనా స్వేఛ్ఛకు భంగం కలిగించడమేనని పెద్దిరెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదనలు విన్న ధర్మాసనం మీడియాతో మాట్లాడవచ్చు కానీ, స్థానిక ఎన్నికలను ప్రభావితం చేసే ఎలాంటి అంశాలను ప్రస్తావించడానికి వీల్లేదని, ఎన్నికల నియమావళిని తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు ఆదేశించింది.











