నెల్లూరు జిల్లాలో వైసీపీ సీనియర్ నేత, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలో ప్రకంపనలు రేపనున్నాయి. మాజీ మంత్రి దివంగత ఆనం వివేకానందరెడ్డి 70వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన సంస్మరణ సభలో ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ..తన సోదరుడు వివేకానందరెడ్డితో నెల్లూరుకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేశారు. అదే సమయంలో ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు రానున్న కాలంలో ఆనం ఫ్యామిలీ రాజకీయ కార్యాచరణను సూచిస్తున్నాయనే చర్చ మొదలైంది. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరని ఆయన వ్యాఖ్యానించారు. నెల్లూరుకు ఆనం కుటుంబం దూరమవుతోందని కొంతమంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, రానున్న కాలంలో తమ మార్కు చూపిస్తామని వ్యాఖ్యానించారు. దీంతోపాటు నెల్లూరులో గడప గడపని టచ్ చేస్తామని, తమ మార్కు చూపిస్తామని చెప్పారు. ప్రస్తుతం ప్రభుత్వం చేస్తున్న పనులపైగాని, ఇతర నాయకులపై గాని ఎలాంటి విమర్శలు చేయకుండానే రామనారాయణరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు. ఎవరు ఎన్ని చేసినా.. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఆనం కుటుంబ ముద్రను చెరిపి వేయలేరని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు ఇప్పటికిప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి సాధారణమే అనిపించవచ్చు. కాని గతంలో రామనారాయణరెడ్డి వ్యాఖ్యలు, జిల్లా రాజకీయాల్లో వర్గపోరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటేనే తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి.
గతంలోనూ సంచలన వ్యాఖ్యలు
వైసీపీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. తన నియోజకవర్గంలో పనులు జరగడం లేదని. నెల్లూరు జిల్లాలో వెంకటగిరి అనే నియోజకవర్గం ఒకటుందని గుర్తించాలని వ్యాఖ్యానించారు. మరో ఏడాది చూస్తానని, పరిస్థితి మారకుంటే ఉద్యమిస్తానని కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. నెల్లూరు జిల్లాలో జలవనరుల శాఖ అధికారులు నీళ్లు అమ్ముకుంటున్నారని..ఆ లెక్కలేమిటో తేల్చాలని డిమాండ్ చేశారు. ఎస్‌ఎస్ కెనాల్‌ను పరిశీలించాలని సీఎం జగన్ స్వయంగా చెప్పినా అధికారులు వినడం లేదని గతంలో విమర్శించారు. నెల్లూరు జిల్లాలో ఇసుక నుంచి క్రికెట్ బెట్టింగ్‌ల దందా యథేచ్ఛగా సాగుతోందని, పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి ఉందని గతంలో సంచలన కామెంట్ చేశారు ఆనం రామనారాయణ రెడ్డి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో గతంలో వైసీపీ ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. తన రాజకీయ అనుభవం, వైఎస్‌తో తనకు ఉన్న అనుబంధం, సీనియార్టీలను కనీసం గుర్తించకుండా ఇలా నోటీసులు ఇవ్వడంపైనా నొచ్చుకున్నారన్న చర్చ నడిచింది. మంత్రివర్గంలో స్థానం దొరకకపోవడం, తనకంటే జూనియర్ అయిన అనిల్ కుమార్ యాదవ్ జోక్యం జిల్లాలో ఎక్కువ కావడం, అనిల్ కుమార్ యాదవ్, కోటంరెడ్డిలు కలసి ఆనం వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారన్న అసహనం లాంటి అంశాలు ఈ వ్యాఖ్యలకు కారణంగా అప్పట్లో భావించారు. తరువాత కొంతకాలం సైలెంట్ అయిన రామనారాయణ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. నెల్లూరు జిల్లాలో ప్రస్తుతం ఆనం రామనారాయణ రెడ్డి, కాకాని గోవర్దన్‌రెడ్డి ఒక వర్గం కాగా, మంత్రి అనిల్, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఒక వర్గంగా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
కాలేజీపై ఆధిపత్య పోరు..
జిల్లాలో కీలకమైన విఆర్ విద్యా సంస్థలపై ఆనం కుటుంబ ఆధిపత్యం ఉండేది. ఆ విద్యాసంస్థల ఆర్థిక లావాదేవీల్లో లుకలుకున్నాయన్న ఆరోపణలు రావడంతో కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం కోర్టు విచారణలో ఈ వ్యవహారం ఉంది. విద్యాసంస్థలను సైతం తమ నుంచి దూరం చేసేందుకు మంత్రి అనిల్ కుమార్, కోటంరెడ్డిలు కుట్ర చేస్తున్నారన్న అనుమానం కూడా ఆనం కుటుంబంలో ఉందనే చర్చ నడుస్తోంది. దీంతో పాటుగా నెల్లూరులో చారిత్రక వేణుగోపాలస్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు వ్యవహారం, ఆలయ భూముల వ్యవహారంలోనూ ఆనం కుటుంబానికి వ్యతిరేకంగా రాజకీయం నడుస్తోందనే అభిప్రాయం కూడా నెలకొంది. ఇదే జిల్లాలో వెంకటగిరి, డక్కిలి మండలాల్లో రూ. 240 కోట్ల విలువైన పనులతో పాటు అల్తూరుపాడు రిజర్వాయర్‌కు సంబంధించిన పనుల్లోనూ రివర్స్ టెండరింగ్‌ని అమలుచేయడంపైనా ఆనం అసహనం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. వీటితోపాటు డీసీసీబీ ఛైర్మన్ ఎంపిక వ్యవహారం, జిల్లా ఉన్నతాధికారుల బదిలీల్లో కనీసం తమ అభిప్రాయాలను కూడా అడగడం లేదనే అభిప్రాయంతో ఉన్నారట ఆనం రామనారాయణ రెడ్డి. ఇక తాజాగా చేసిన వ్యాఖ్యలు నెల్లూరులో త్వరలోనే రాజకీయ సమీకరణాల్లో రానున్న మార్పులకు సూచిక అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.