ఆమె పేరు సిస్టర్ అభయ. దేవుని సేవకు అంకితం కావాలని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో నన్‌గా మారింది. కానీ మేక వన్నె పులులు తన చుట్టే ఉన్నారని తెలుసుకోలేకపోయింది. తనలాగే అందరూ దేవుని నమ్మి సేవ చేస్తున్నవారే అనుకుంది. కానీ ఫాదర్, నన్ ముసుగులో తప్పుడు కార్యకలాపాలు చేసేవారు ఉంటారని కనీసం ఊహించలేదు సిస్టర్ అభయ. తమ అసభ్యపు చర్యలను దాచడానికి ఓ అమాయకురాలని పొట్టన పెట్టుకున్నారు. పైగా ఆత్మహత్యగా చిత్రీకరించారు. సాక్ష్యాలంతా అలాగే ఉన్నా.. ప్రజలు తనకోసం ఉద్యమించారు. ఫలితంగా 28 ఏళ్ల సుదీర్ఘ విచారణ అనంతరం ఎట్టకేలకు అభయకు న్యాయం జరిగింది.
1992లో అనుమానస్పద మృతి..
అది 1992 మార్చి 27, రోజులాగే తెల్లవారుజామునే లేచిన సిస్టర్ అభయ ఏదో పని మీద కిచెన్ వెళ్లారు. అక్కడ జరుగుతున్న వ్యవహారం చూసి నిశ్చేష్టురాలైంది. ఫాదర్ కొట్టూర్, ఫాదర్ వూథ్రకయాల్, నన్ సెఫీలను అభ్యంతరకర పరిస్థితిలో చూసింది అభయ. తమ విషయం ఎక్కడ భయపపెడుతుందో అని అభయను కర్రతో గట్టిగా కొట్టి చంపేశారు. ఆపై బావిలో పడేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. స్థానిక పోలీసులు, క్రైం బ్రాంచ్ కూడా ఆత్మహత్యగా కేసుగా ముగించారు. కానీ స్థానికులు ఊరుకులేదు. పోలీసులు, క్రైం బ్రాంచ్ విచారణపై విమర్శలు గుప్పించారు. ఎలాగైనా అభయకు న్యాయం జరగాలని నినదించారు. కానీ ఎవరి నుంచి సరైన స్పందన లభించలేదు.
28 ఏళ్ల సుదీర్ఘ విచారణ..
సామాజిక కార్యకర్త జోమన్ పుతిన్ పురక్కల్ 1993లో కోర్టును ఆశ్రయించడంతో కేసు సిబిఐకి అప్పగించింది. దాదాపు 15 సంవత్సరాల విచారణ అనంతరం 2009లో చార్జిషీట్ దాఖలు చేసింది సిబిఐ. ఆపై 11 ఏళ్ల పాటు జరిగిన విచారణ అనంతరం ఇద్దరిని మాత్రమే దోషులగా నిర్ధారించింది సిబిఐ కోర్టు. రెండేళ్ల క్రితం సరైన ఆధారాలు లేకపోవడం వల్ల ఫాదర్ వూథ్రకయాల్‌ని నిర్ధోషిగా ప్రకటించింది కోర్టు. ఫాదర్ కొట్టూర్, నన్ సెఫీలను దోషులుగా తేల్చిన ప్రభుత్వం జీవితఖైదు వేసింది. శిక్షతో పాటు ఇరువురికి 5 లక్షల జరిమానా కూడా విధించింది.
సాక్షిగా మారిన దొంగ
విచారణ జరుగుతుండగానే సిస్టర్ అభయ తల్లిదండ్రులు మరణించారు. చిరు దొంగతనాలు చేసే ఒక దొంగ ఇందులో కీలక సాక్షిగా మారడం విచిత్రమైన విషయం. అదే రోజున అక్కడికి దొంగతనానికి వెళ్లిన రాజు అనే దొంగ ప్రత్యక్ష సాక్షిగా నిలిచాడు. విచారణ జరిగినన్ని రోజులు ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా, ఎవరికీ భయపడకుండా బిడ్డలాంటి అభయకు న్యాయం జరిగితే చాలని చెప్పడం విశేషం. ఇప్పటికీ చిన్న గుడిసెలో నివసించే రాజు, కేసులో శిక్షలపై ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇది వినడానికి ఆమె తల్లిదండ్రులు లేకపోయినా.. తండ్రి లాంటి నేను ఎంతో సంతోషిస్తున్నానని, తన ఆత్మకు శాంతి చేకూరుతుందని చెప్పుకొచ్చాడు.
న్యాయం ఆలస్యమవడం కూడా అన్యాయమే..
మామూలుగా దోషులు ఏదైనా కేసులో తప్పించుకుంటే అన్యాయం జరిగినట్టుగా భావిస్తాము. కానీ, కేసులో న్యాయం ఆలస్యమవడం కూడా అన్యాయమే. ఈ కేసుకు అది అక్షరాలా వర్తిస్తుంది. కేసు తీర్పు వినకుండానే, తమ కుమార్తెకు జరిగిన న్యాయం చూడకుండానే బాధపడుతూనే ఆ తల్లిదండ్రులు కన్నుమూశారు. అటువంటి వారికి కోర్టు ఏం సమాధానం చెప్తుంది. ఇదే కాదు.. మన దేశంలో ఇలాంటి సంఘటనలే ఎక్కువగా జరుగుతున్నాయి. ఏ కేసు విషయంలో అయినా కూడా కాల పరిమితి ఉండడం అవసరం. కేసులను బట్టి కొన్నింటికి పొడిగించే అవకాశాలు కల్పించాలి. అప్పుడే ఎవరికైనా సత్వర న్యాయం జరుగుతుంది. ఆ విధంగా న్యాయం జరిగినపుడే న్యాయ స్థానంపైన నమ్మకం పెరుగుతుంది.
Must Read ;- ఇప్పటికీ కన్నీరు పెట్టిస్తున్న దారుణం











