వెండితెరపై హీరోయిన్ గా కనిపించడం అంత తేలికైన విషయమేం కాదు. ఒకవేళ ఏదో అదృష్టం కలిసొచ్చి ఓ అవకాశం వచ్చినా అక్కడి నుంచి ముందుకు దూసుకెళ్లడం ఆషామాషీ విషయమేం కాదు. తెరపై హీరోయిన్ గా కనిపించాలన్నా .. రాణించాలన్నా అందం ఒక్కటే ఉంటే సరిపోదు .. అభినయం కూడా కావాలి. అది మాత్రమే సరిపోదు కాస్తంత లౌక్యం కూడా కావాలి. అందం అవకాశాలను గుమ్మం వరకూ తీసుకొస్తుంది .. అభినయం నాయికగా నిలబెడుతుంది .. లౌక్యం అవకాశాలు పెరగడానికి ఉపయోగ పడుతుంది. అందం .. అభినయం ఉండికూడా చాలామంది కథానాయికలు వెనకబడటానికి కారణం లౌక్యం లేకపోవడమే.

సీనియర్ స్టార్ హీరోయిన్స్ లో మంచి లౌక్యం ఉన్నవారిలో కాజల్ .. తమన్నా ముందువరుసలో కనిపిస్తారు. కాజల్ – తమన్నా ఈ ఇద్దరినీ వెండితెర చందమామలుగా చెప్పుకోవచ్చు. ఇద్దరూ కూడా తమ కెరియర్ ను మొదలుపెట్టేసి 15 సంవత్సరాలు దాటిపోయింది. ‘చందమామ‘ సినిమాతో కాజల్ తెలుగు తెరకి పరిచయమైతే, ‘శ్రీ’ సినిమాతో తమన్నా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీరి తొలి చిత్రాలు చూస్తే, ఎంతో అమాయకంగా .. మరెంతో సెన్సిటివ్ గా కనిపిస్తారు. ఆ సినిమాలు చూసినప్పుడు వీళ్లు ఈ స్థాయిలో దూసుకుపోతారని ఎవరూ ఊహించి ఉండరు.
Also Read ;- ఎద ఎదలో.. ఎన్నెన్నో ‘షకీల’ గుండె పదనిసలు

కాజల్ .. తమన్నా ఇద్దరూ కూడా గ్లామర్ ను మాత్రమే నమ్ముకోలేదు .. అలాగే ఒక భాషకి చెందిన సినిమాలకి మాత్రమే పరిమితం కాలేదు. గ్లామర్ తో పాటు నటనకి అవకాశం ఉన్న పాత్రలను చేశారు. తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషా చిత్రాలలోను తమ సత్తా చాటుకున్నారు. ఒక వైపున సీనియర్ హీరోల సరసన మెప్పిస్తూనే, మరోవైపున యువ హీరోలతో ఆడిపాడుతూ అలరిస్తున్నారు. డాన్సుల్లోను హీరోలతో పోటీపడుతూ తమ జోరు కొనసాగిస్తున్నారు. కొల్లలుగా కొత్త కథానాయికలు వస్తున్నప్పటికీ, తమ ప్లేస్ కి ఢోకా లేకుండా చూసుకుంటున్నారు.
న్యూ ఇయర్లోను చెరో పెద్ద ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. చిరంజీవి సరసన నాయికగా కాజల్ ‘ఆచార్య’ సినిమాతో అలరించనుంది. ‘ఎఫ్ 3’ సినిమాతో వెంకటేశ్ జోడీగా తమన్నా ఆకట్టుకోనుంది. ఇక యువ హీరోల జోడీగా చెరో మూడు సినిమాలు చేస్తున్నారు. ఇంతకాలమైనా వీళ్ల అందంలో అలసట కనిపించడం లేదు .. అభినయం బోర్ కొట్టడం లేదు .. క్రేజ్ ఎంతమాత్రం తగ్గడం లేదు. అప్పటికీ ఇప్పటికీ ఈ ఇద్దరూ వెన్నెల్లో చందమామల్లా అలాగే ఉన్నారు .. సక్సెస్ కి సవాళ్లు విసురుతూనే ఉన్నారు.
Must Read ;- ఆ.. విషయంలో.. కాజల్ తర్వాత.. కీర్తి సురేషే..!











