(విశాఖపట్నం నుంచి వీడియో న్యూస్ ప్రతినిధి)
విశాఖపట్నాన్ని రాజధానిగా వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రకటించిన తరువాత.. అక్కడ భూదందాలు ఎవరు చేస్తున్నారో, కబ్జాలకు పాల్పడ్డం, భూముల కొనుగోళ్ల మాఫియా నడిపించడం ఎలా, ఎవరి ఆధ్వర్యంలో జరుగుతోందో.. ప్రజలకు తెలుసు. అయితే.. సొంత పార్టీ వారికి కూడా నీతులు బోధించే క్రమంలో రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి బహిరంగంగానే పూనుకునే సరికి.. వారిలోనూ వ్యతిరేకత వచ్చింది. విజయసాయి పార్టీలో అధికార కేంద్రమే అయినప్పటికీ.. ఘాటుగా జవాబివ్వడానికి వారు వెనుకాడకపోవడం గమనార్హం.
జిల్లా అభివృద్ధి సమీక్షా కమిటీ సమావేశంలో ఎంపీ విజయసాయి రెడ్డి వ్యాఖ్యలపై అధికార పార్టీ ప్రజా ప్రతినిధులే అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడితే భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయోనన్న భయంతో ఎవరూ కిమ్మనక పోయినా, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ మాత్రం తన వాదన వినిపించారు.
విశాఖలో పరిపాలన రాజధానిగా ప్రకటించిన తరువాత ఆరంభమైన భూ ఆక్రమణలు, దందాలపై ఎంపీ విజయసాయిరెడ్డి నిర్మొహమాటంగా సమావేశంలో ప్రస్తావించారు. భూ ఆక్రమణలు వెనుక జిల్లాకు చెందిన రాజకీయ నేతల హస్తం ఉన్నట్టు తగిన ఆధారాలతో సమాచారం వస్తోందని, ఇటువంటి వ్యవహారాల్లో అధికార పార్టీ సభ్యులుగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సుతిమెత్తగా హెచ్చరించారు.
దీంతో చాలామంది ఎమ్మెల్యేలకు చిర్రెత్తుకొచ్చింది. ఆయన ఎవరి పేరునూ నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ.. అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కనీస స్వేచ్ఛ లేకపోవడంపై ఎప్పటి నుంచో గుర్రుగా ఉన్న నాయకులంతా.. లోలోనే రగిలిపోయారు. అయితే చోడవరం ఎమ్మెల్యే ధర్మ శ్రీ మాత్రం తనపై వచ్చిన భూదందాల పై వివరణ ఇచ్చారు.
ఆరోపణల్లో నిజం లేదని, ఆ వివాదం తన బంధువులకు సంబంధించిందని చెప్పుకొచ్చారు. ఒక ప్రతిపక్ష నేతలా ధర్మశ్రీ ఇచ్చిన వివరణతో ఎంపీ విజయసాయి రెడ్డి కి చుక్కెదురైంది. నీతి, నిజాయితీల గురించి ఎమ్మెల్యే చెప్పుకుంటూ రావడంతో ఏం సమాధానం చెప్పాలో ఎంపీకి పాలుపోలేదు. ఇక ప్రతిపక్షాలు ఎలానో విమర్శిస్తూనే ఉంటాయి. అటువంటి సమయంలో సొంత పార్టీ ప్రజాప్రతినిధుల గురించి అనవసరంగా ఎంపీ ప్రస్తావించినట్టయింది.