ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలిచే తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. సొంతపార్టీ నేతల నుంచే ఆమెకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాడికొండ నియోజకవర్గం తుళ్లూరు మండలానికి చెందిన నందిగం సురేష్ బాపట్ల నుంచి వైసీపీ ఎంపీ గెలిచారు. అయినా తాడికొండ నియోజకవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో ఇక్కడ పెత్తనం చేయాలని చూశారు. దీంతో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి ప్రతిఘటించారు.
నందిగం సురేష్‌ను అదుపు చేయాలని వైసీపీ అధిష్టానం వద్ద వాపోయారు. దీంతో నందిగం సురేష్ తాడికొండ నియోజకవర్గంలో వేలు పెట్టడం లేదు. వైసీపీ పెద్దలు నందిగం సురేష్‌కు చెప్పడంతో, అప్పటి నుంచి ఇద్దరూ సఖ్యతతో ఎవరి పని వారు చేసుకుపోతున్నారు. ఆ తరవాత టీడీపీ ఎమ్మెల్సీగా ఉన్న డొక్కా మాణిక్య వరప్రసాద్ వైసీపీలో చేరిపోయారు. ఆ వెంటనే వైసీపీ నుంచి ఎమ్మెల్సీ అయ్యారు. అక్కడ నుంచి తాడికొండలో డొక్కా మాణిక్య వరప్రసాద్ చాపకింద నీరులా చొచ్చుకువస్తూ ఉండవల్లి శ్రీదేవికి నిద్రలేకుండా చేస్తున్నారని సమాచారం.
తాడికొండలో క్యాడర్ పెంచుకుంటోన్న డొక్కా
డొక్కాకు తాడికొండ నియోజకవర్గంలో మంచి పట్టుంది. గతంలో ఈ నియోజకవర్గం నుంచే గెలిచి మంత్రి కూడా అయ్యారు. దీంతో తాడికొండ అంటే డొక్కా సొంత నియోజకవర్గంగా భావిస్తారు. టీడీపీలో కొన్నాళ్లు పనిచేసినా 2019 ఎన్నికల్లో డొక్కా తాడికొండ సీటు సాధించలేకపోయారు. దీంతో ఆయన ప్రత్తిపాడు నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తరవాత జరిగిన రాజకీయ పరిణామాల్లో ఆయన వైసీపీలో చేరిపోయారు.
అక్కడ నుంచి తాడికొండ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ స్థానిక ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారట. వచ్చే ఎన్నికల నాటికి తాడికొండ వైసీపీ నుంచి పోటీ చేయాలని డొక్కా భావించడమే ఇందుకు కారణంగా రాజకీయవర్గాలు చర్చించుకుంటున్నాయి.
ఉండవల్లి శ్రీదేవిపై తీవ్ర వ్యతిరేకత
రాజధాని గ్రామాలన్నీ దాదాపుగా తాడికొండ నియోజకవర్గంలో ఎక్కువగా ఉన్నాయి. దీంతో అమరావతి రాజధానికి మూడు ముక్కలు చేయడం వంటి ప్రభుత్వ నిర్ణయాన్ని ఉండవల్లి శ్రీదేవి గట్టిగా సమర్ధించడంతో స్థానిక ప్రజల్లో ఆమెపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇక తాడికొండలో ఉండవల్లి శ్రీదేవి పోటీ చేస్తే డిపాజిట్లు వచ్చే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు. ఇది గమనించిన వైసీపీ అధిష్ఠానమే డొక్కాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే వాదనకు కూడా స్థానికంగా వినిపిస్తోంది. అందుకే తాడికొండ నియోజకవర్గంలో డొక్కా స్వేచ్ఛగా తిరగగలుతుతున్నారని తెలుస్తోంది. ఈ వ్యవహారాలన్నీ ఉండవల్లి శ్రీదేవికి రాజకీయంగా ఆందోళన కలిగిస్తున్నాయట. పైగా డొక్కాపై అధిష్టానానికి ఫిర్యాదు చేసే పరిస్థితిలో కూడా శ్రీదేవి లేదని స్థానిక నాయకులు అంటున్నారు.
అవినీతి ఆరోపణలతో కొడగట్టిన ఉండవల్లి శ్రీదేవి ప్రభ
తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో తాడికొండ ఎమ్మెల్యే తీరుపై ఆ పార్టీ నాయకులే విసిగిపోయారు. వైసీపీ నేతల నుంచే డబ్బు తీసుకుని తిరిగి ఇవ్వకపోగా బెదిరింపులకు దిగడం, ఇసుక దందా, పోలీసు అధికారులను బెదిరించడం ఇవన్నీ తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి రాజకీయ కెరీర్‌కు మాయని మచ్చలా తయారయ్యాయి. ఒక్కసారి అవినీతి మరక అంటితే దాన్ని తొలగించుకోవడం ఎంత కష్టమో ఇప్పుడిప్పుడే తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి తెలిసి వస్తోందట. తాడికొండ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయో వేచి చూడాల్సిందే.