పార్లమెంట్ నూతన భవన నిర్మాణ శంకుస్థాపన ప్రధాని మోదీ చేతుల మీదుగా జరుగుతోంది. ఈ కార్యక్రమం గురువారం మధ్యాహ్నం 12:55కి ప్రారంభమయ్యింది. ఆపై 2:15 గంటలకు ప్రధాని ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సుమారు 20 వేల కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించ తలపెట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో పార్లమెంటు నూతన భవన నిర్మాణం అత్యంత కీలకమైనది. లాంచనంగా నేడు శంకుస్థాపన కార్యక్రమం జరిగినప్పటికీ.. నిర్మాణ పనులు మాత్రం ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేదు. ఎందుకంటే.. ఈ సెంట్రల్ విస్టా ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో ఇప్పటికే కొన్ని పిటిషన్లు విచారణ దశలో ఉన్నాయి. దీంతో.. సుప్రీం నుంచి అనుమతి వచ్చిన తర్వాతే నిర్మాణ పనులు మొదలయ్యే అవకాశం ఉంది.
పార్లమెంటు భవనం అద్భుతం
కొత్తగా నిర్మించబోతున్న పార్లమెంట్ భవనం ప్రస్తుత పార్లమెంట్ భవనానికి దగ్గర్లోనే ఏర్పాట్లు చేశారు. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా నిర్మించనున్న పార్లమెంటు నూతన భవనానికి.. ఇంద్రభవనాన్ని తలపించేలా డిజైన్ చేశారు. ఇది మొత్తం నాలుగు అంతస్తుల్లో 64,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. నూతన పార్లమెంట్ భవన నిర్మాణ అంచనా వ్యయం రూ 971 కోట్లుగా అంచనా వేశారు. ఇందులో ప్రతి సభ్యుడికీ ప్రత్యేకంగా ఓ చాంబర్ ఉంటుంది.
లోక్ సభలో 888 మంది సభ్యులు కూర్చనే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో లోక్ సభలో సభ్యుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని దీన్ని బట్టి విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాజ్యసభలో 384 మంది, ఉమ్మడి సభలో 1,224 మంది సభ్యులు కూర్చునేలా డిజైన్ చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు, శిల్పుల సహకారంతో, అద్భుతమైన వారసత్వ సంపదగా దీన్ని తీర్చిదిద్దనున్నారు.
75వ స్వాతంత్ర దినోత్సవానికి పూర్తి
దేశ 75వ స్వాతంత్ర దినోత్సవం (2022 ఆగస్టు) నాటికి దీని నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేంద్రం భావిస్తోంది. సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా రాజ్‌పథ్ నుంచి రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్ వరకు మొత్తం 3 కిలోమీటర్ల పరిధిలో అద్భుత నిర్మాణాలతో, పార్కులతో అభివృద్ధి చేయాలని కేంద్రం సంకల్పించింది. ఈ మొత్తం పనులును 2024 నాటికి పూర్తి చేయాలని కేంద్రం నిర్ణయించింది.
Also Read ;- చర్చల్లోకి అమిత్‌షా : కేంద్రం ఇంకాస్త దిగినట్టే..











