ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు తెలుగుదేశం పార్టీ అన్నదాతల బంద్ కు మద్దతు ఇచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్లు అందరికీ తెలుగుదేశం నాయకులు వినతిపత్రాలు ఇవ్వబోతున్నారు. ఈ మేరకు చంద్రబాబునాయుడు పిలుపు ఇచ్చారు. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్, ప్రతిపక్షంలోని కాంగ్రెస్ రెండూ కూడా బంద్ లో స్వయంగా పాల్గొంటున్నాయి. మంత్రులు కూడా.. ఏయే జాతీయ రహదార్ల మీద బంద్ లో పాల్గొనాలో ఖచ్చితమైన కార్యచరణను రూపొందించారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. బంద్ నిర్వహణకు ‘అనుమతి’ ఇచ్చింది. అవును.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం.. బంద్ కు మద్దతిస్తున్నదని ఎవరైనా అనుకుంటుండవచ్చు గానీ.. నిజానికి వారు ఇచ్చింది ‘అనుమతి’ మాత్రమే!
వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు చేసిన ప్రకటన మాత్రం అలాగే ఉంది. అందులోని వివరాలు ఇవి..
‘‘దేశవ్యాప్తంగా రైతు సంఘాలు తమ ఆందోళనలో భాగంగా రేపు నిర్వహించతలపెట్టిన బంద్ విషయంలో వారి మనోభావాలను గౌరవిస్తున్నాం. అయితే రైతు సంఘాలు ఎటువంటి హింసాత్మక సంఘటనలకు తావివ్వకుండా, మధ్యాహ్నం 1 గంటలోపు, బంద్‌ను ముగించుకుంటే ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉంటుంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు కూడా మధ్యాహ్నం 1 గంట తర్వాతే తెరవాలని ఆదేశిస్తున్నాం. అలాగే 1 గంట వరకూ బస్సు సర్వీసులను నడపవద్దని ఆర్టీసీని కూడా ఆదేశిస్తున్నాం. విద్యాసంస్థలను రేపు పూర్తిగా మూసివేయాల్సిందిగా కూడా ఆదేశిస్తున్నాం. బంద్ పూర్తి స్వచ్ఛందంగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా సహకరించాలని రైతు సంఘాలకు విజ్ఞప్తిచేస్తున్నాం. ’’
అని పేర్కొన్న కన్నబాబు.. ఈ రైతుల బంద్ విషయంలో కూడా తమకంటె ఎక్కువ మైలేజీ చంద్రబాబుకు వచ్చేస్తుందేమో అని కంగారు పడినట్లున్నారు. అందుకే..
‘‘ఇక్కడే మరొక విషయాన్నికూడా ప్రజల దృష్టికి తీసుకువస్తున్నాం. నిజానికి కేంద్రంలో వ్యవసాయ బిల్లులకు చంద్రబాబు పార్టీ బేషరతుగా, గట్టిగా ఆరోజు మద్దతు పలికిన విషయం అందరికీ తెలిసిందే. అదే సమయంలో వైయస్సార్ కాంగ్రెస్‌పార్టీ కనీస మద్దతు ధర (ఎంఎస్‌పీ)కు పూర్తి భరోసా ఇస్తున్నామన్న కేంద్ర ప్రభుత్వ హామీ నేపథ్యంలో మాత్రమే, రైతుల ప్రయోజనాలకు ఎటువంటి విఘాతం కలగదన్న కేంద్ర ప్రభుత్వ హామీ నేపథ్యంలోనే వ్యవసాయ బిల్లులకు షరతులతో కూడిన మద్దతు పలికిన విషయంకూడా అందరికీ తెలుసు. కాని ఈరోజు, చంద్రబాబు మరో యూటర్న్ తీసుకుని జిల్లాకేంద్రాల్లో కలెక్టర్లకు రేపు విజ్ఞాపనలు ఇవ్వాల్సిందిగా నిర్ణయించారని మీడియా ద్వారా వింటున్నాం. పార్లమెంటులో బిల్లులకు బేషరతుగా మద్దతు పలికి, ఇప్పుడు జిల్లాకలెక్టర్లకు చంద్రబాబు పార్టీ విజ్ఞాపనలు ఇవ్వడం ఎంతటి దిగజారుడు రాజకీయమో అందరికీ కనిపిస్తోంది.’’
అని చంద్రబాబునాయుడు మీద విమర్శలు కురిపించడానికి కూడా ప్రయత్నించారు.
==
Must Read ;- అప్పులు, అస్తులు, పన్నులేనా.. ప్రజారోగ్యం మాటేమిటీ: చంద్రబాబు
అంతా బాగానే ఉన్నది గానీ.. చంద్రబాబు రైతులకు మద్దతుగా పోరాటంలోకి తన పార్టీని స్వయంగా దించడాన్ని కూడా తప్పుపడితే ఎలా అర్థం చేసుకోవాలి?
తమ పార్టీకి ఉన్న మొత్తం ఎంపీలతో మూకుమ్మడిగా ఈ రెండు పార్టీలు బిల్లులకు అనుకూలంగానే ఓటు చేశాయి. ఆ విషయంలో ఎవ్వరూ పరిశుద్ధాత్మ స్వరూపులు అనుకోవడానికి వీల్లేదు. కానీ.. 22 మంది సభ్యుల వైఎస్సార్సీపీ మద్దతు ఇవ్వడంలో లేని తప్పు, నేరం.. ముగ్గురు సభ్యులున్న తెలుగుదేశం ఇవ్వడంలో ఎలా ఉంటుంది. చిన్న పార్టీ తప్పు పెద్దది ఎలా అవుతుంది. ఆ చట్టాలను తాము ఎందుకు నమ్మి మద్దతిచ్చామని వైసీపీ వారు చెప్పుకుంటున్నారో.. అదే కారణాలను (సాకులను) టీడీపీ కూడా చెప్పుకోగలదు కదా. వాస్తవానికి ఈ రెండు పార్టీలు కేంద్రంలోని బీజేపీ పెట్టే బిల్లులకు ఎందుకు మద్దతిస్తున్నాయో ప్రజలందరికీ తెలుసు.
కానీ.. చంద్రబాబునాయుడు కనీసం.. బిల్లుల వ్యవహారం దేశవ్యాప్తంగా రభస అవుతున్న ఈ తరుణానికైనా తన తప్పు తెలుసుకున్నారు. పూర్తిగా కాకపోయినా, దిద్దుకునే ప్రయత్నం చేస్తున్నారు. స్వయంగా తమ పార్టీని పోరాటంలోకి దించి.. కలెక్టర్లకు వినతిపత్రాలు ఇవ్వాలంటున్నారు. అంతిమంగా ఉభయుల ప్రయోజనాలూ రైతు సంక్షేమమే అయినప్పుడు.. ఆయన ఈ నిర్ణయానికి రావడంలో తప్పేముంది. చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారని, తెదేపా పోరాటంలోకి రావడం కూడా తప్పే అని వైఎస్సార్సీపీ వక్రప్రచారానికి ప్రయత్నించడం హేయం.
రాష్ట్రంలో ఒక వైపు రైతు పోరాట కమిటీ సాయంత్రం వరకు కూడా బంద్ జరగాల్సిందే అని పిలుపు ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం మధ్యాహ్నం దాకా బంద్ చేసుకోవచ్చునని అనుమతి ఇచ్చింది. ఇదేం తీరో అర్థం కావడం లేదు. అదే సమయంలో పొరుగున ఉన్న తెలంగాణలో తెరాస నాయకులంతా రోడ్డెక్కి.. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా నినదించబోతున్నారు. అలాంటి తెగువ ఏపీలో ఏ ఒక్క పార్టీకి కూడా లేకపోవడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చేసుకున్న ఖర్మం!
ఇప్పటికైనా నాయకులు.. ఈ రైతుపోరాటాలను కూడా తమ తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలకు అనుకూలంగా ఎలా వాడుకోవాలో వ్యూహరచన చేయడం మానేసి.. రైతులకు అండగా నిలవడం గురించి, అంతిమంగా వారి ఏకైక డిమాండ్ అయిన వ్యవసాయ చట్టాల రద్దు సాధ్యం కావడానికి సహకరించడం గురించి దృష్టి పెడితే బాగుంటుంది.
Also Read ;- నాడు వాకౌట్లు, నేడు సస్పెన్షన్లు… అసెంబ్లీలో ఇదే జగన్ తీరు