భారత్ బంద్ అద్భుతంగా జరిగింది. ఏదో ఒక పార్టీకి రాజకీయ ప్రయోజనం చేకూర్చడానికి మాత్రమే జరిగి ఉద్యమాల్లాగా కాకుండా, అన్నదాతల ప్రయోజనం కోసం పార్టీ రహితంగా జరిగిన బంద్ కావడంతో.. దేశమంతా దీని ప్రభావం ఎక్కువగా కనిపించింది. ఈ దెబ్బకు మోడీ సర్కారు మరో మెట్టినట్టు దిగివచ్చినట్టుగా కనిపిస్తోంది. రైతు సంఘాల ప్రతినిధులతో అమిత్ షా మంగళవారం రాత్రి 7 గంటలకు ఇష్టాగోష్టి సమావేశానికి సిద్ధపడ్డారు.
ఇన్నాళ్లూ ఈ చొరవ ఏమైంది? రైతుల దీక్షలు అంటే కేంద్రంలోని ‘అసలు’ పెద్దలు ఎందుకంత పట్టనట్టుగా వ్యవహరించారు. నరేంద్రసింగ్ తోమర్ ను ముందుకు నెట్టి తాము వెనుకనుంచి చోద్యం చూస్తూ కూర్చున్నారెందుకు? ఈ ప్రశ్నలన్నీ ఇప్పుడు అప్రస్తుతం. కాకపోతే.. చివరికిసారిగా మూడు రోజుల కిందట రైతులతో అయిదో విడత చర్చలు జరిగినప్పుడు.. తరువాతి చర్చలను బుధవారానికి షెడ్యూలుచేసిన ప్రభుత్వ పెద్దలు.. బహుశా బంద్‌కు ఎలాంటి స్పందన వస్తుందో దాన్ని బట్టి స్పందించవచ్చునని భావించి ఉంటారు.
భారత్ బంద్ సూపర్ హిట్ అయిందనడంలో సందేహం లేదు. దానికి నిదర్శనమే.. షెడ్యూలు ప్రకారం చర్చలు జరగాల్సినది బుధవారం కాగా, మంగళవారం సాయంత్రమే ‘ఇష్టాగోష్టి’ పేరుతో భేటీ కావడానికి అమిత్ షా సిద్ధపడడం!
అమిత్ షా భేటీ కావడమే సాధారణంగా ఇవాళ్టి రాజకీయాల్లో చాలా పెద్ద సంగతి. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. అపాయింట్మెంట్ అడిగి ఢిల్లీ వెళ్లినా కూడా.. ఆయన్ను కలవడానికి వీల్లేకుండా ఎన్నిసార్లు తిరిగివచ్చేశారో అందరికీ తెలుసు. అలాంటిది అమిత్ షా స్వయంగా రైతు ప్రతినిధుల్ని ఒకరోజు ముందే అనధికార చర్చలకు పిలవడం ప్రభుత్వం మెట్టు దిగిందనడానికి నిదర్శనం.
ఇప్పటిదాకా రైతులు ఒకే ఒక డిమాండ్ మీద చాలా పట్టుదలగా ఉన్నారు. వ్యవసాయ చట్టాలను రద్దు చేయడం తప్ప.. మరో డిమాండ్ లేదనే అంటున్నారు. ప్రభుత్వం ఏదో రెండు మూడు పసలేని సవరణలు చేయడం ద్వారా.. ఈ చట్టాలను రద్దు చేయకుండా.. తమ మాట నెగ్గించుకోవాలనే పట్టుదలతో ముందుకు సాగుతోంది. ఎంఎస్‌పిని కొనసాగించడం, కొనుగోలు దార్లకు చట్టంలో చెప్పినట్టుగా కేవలం పాన్ కార్డు ఉంటే చాలనకుండా.. రిజిస్ట్రేషన్ తప్పనిసరి అనే నిబంధన పెట్టడం వంటి కొన్ని సవరణలకు ప్రభుత్వం సుముఖంగానే ఉంది. కానీ.. ఇలాంటి చిన్న వాటికి లొంగిపోతే రైతులు విశాల ప్రయోజనాలను కోల్పోయిన వారవుతారు.
ఇలాంటి కీలక సమయంలో అమిత్ తో భేటీలో అయినా.. ముందు ముందు ప్రధాని మోదీతో భేటీ కావాల్సి వచ్చినా.. రైతులు లొంగకుండా తమ సింగిల్ డిమాండ్ ను కొనసాగించడం మంచిది. ఇప్పుడు ప్రభుత్వం కొంత దిగింది. ఇంకాస్త దిగుతుంది. అందులో సందేహం లేదు. అంతిమంగా రైతులనే విజయం వరిస్తుంది. అన్నదాతల మాట నెగ్గుతుంది.
Must Read ;- పట్టువీడని పంజాబ్ రైతులు చర్ఛలు ఫలిస్తాయా? చట్టాలు కార్పొరేట్ చుట్టాలా?