ఇటు తూటాల్లాంటి ప్రశ్నలు సంధించే జర్నలిస్టు ఒకరైతే.. తనదైన శైలి సమాధానాలతో ప్రశ్నలిడిగే జర్నలిస్టుకు ముచ్చెమటలు పట్టించే నటుడు మరొకరు. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఈ ఇద్దరి మధ్య గతంలో జరిగిన సంభాషణ ఎన్నెన్ని మంటలను రేపిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తాజా ఇంటర్వ్యూతో నాటి మాటల మంటలను మరిపించే సంభాషణలు ఖాయమన్న వాదన వినిపిస్తోంది. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే పేరిట ఏబీఎన్ మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ వారం క్రితం మొదలెట్టిన సీజన్-3లో రెండో ఎపిసోడ్‌కే ప్రముఖ సినీ నటుడు, మాజీ ఎంపీ, కలెక్షన్ కింగ్‌గా గుర్తింపు సంపాదించుకున్న మంచు మోహన్ బాబును పిలిచేశారు. తొలి ఇంటర్వ్యూలో తనను తీవ్రంగా ద్వేషించే వైఎస్సార్ ఫ్యామిలీకి చెందిన వైఎస్ షర్మిలను ఇంటర్వ్యూ చేసిన రాధాకృష్ణ.. రెండో ఇంటర్వ్యూలో మోహన్ బాబుతో సంభాషించనున్నారు. ఈ ఇంటర్వ్యూ ఆదివారం రాత్రి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్‌లో ప్రసారం కానుంది. దీనికి సంబంధించి విడుదలైన ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.
నాటి మంటలే గుర్తుకొస్తున్నాయి
గతంలో ఇదే కార్యక్రమంలో రాధాకృష్ణ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇస్తూనే ఆయనను కమ్మ పక్షపాతి అంటూ మోహన్ బాబు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. కుల గజ్జి ఉందంటూ కూడా మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపాయి. రాజకీయాలతో పాటు పలు ఇతర అంశాలపై రాధాకృష్ణ సంధించిన ప్రశ్నలకు మోహన్ బాబు కూడా అంతే దీటుగా సమాధానాలు ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియో ఇప్పటికే ట్రెండింగ్ అవుతూ ఉంటుంది. అంతేకాకుండా రాధాకృష్ణను టార్గెట్ చేసే వారంతా.. ఇదే వీడియోను చూపిస్తూ విమర్శలు చేస్తూ ఉంటారు. మొత్తంగా ఆ ఇంటర్వ్యూలో రాధాకృష్ణను కులాలకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా మోహన్ బాబు అభివర్ణించిన తీరు తెలుగు ప్రజలు నిజంగానే ఎప్పటికీ మరిచిపోరనే చెప్పాలి.
తాజా ఇంటర్వ్యూలో ఏఏ అంశాలంటే..?
తాజాగా ఆదివారం ప్రసారం కానున్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ప్రోమోను పరిశీలిస్తే.. ఈ దఫా కూడా రాధాకృష్ణ సంచలన ప్రశ్నలతోనే సిద్ధమైనట్లుగా కనిపిస్తోంది. వైఎస్ జగన్ తో బంధుత్వం, వైఎస్ ఫ్యామిలీతో సాన్నిహిత్యం, జగన్ పాలన, జగన్ జమానాలో కాలేజీలపై పక్షపాత వైఖరి.. ఇలా చాలా అంశాలను ఆర్కే ప్రస్తావించినా.. మోహన్ బాబు పెద్దగా స్పందించినట్టు కనిపించలేదు. అదే సమయంలో చంద్రబాబు హయాంలో కాలేజీ ఫీజుల కోసం రోడ్డెక్కిన వైనాన్ని ప్రస్తావించగానే.. మోహన్ బాబు రియాక్ట్ అయిన తీరును చూస్తుంటే.. ఈ ఇంటర్వ్యూలోనూ మాటల బాగానే మంట రేపినట్టుగా తెలుస్తోంది. మీరు చంద్రబాబు మనిషా? అంటూ మోహన్ బాబు ప్రశ్నించిన తీరుపై ఆర్కే విరుచుకుపడిన తీరు కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఇక సినిమా ఇండస్ట్రీలో పెద్దలు లేరని, దాసరి మరణంతోనే అది పోయిందని మోహన్ బాబు చెప్పగా.. చిరు ఆ స్థానాన్ని భర్తీ చేస్తున్నారుగా అంటూ ఆర్కే వ్యాఖ్యానించడం, చిరుతో తనకు గొడవలు పెట్టేందుకు యత్నిస్తున్నారంటూ ఆర్కేపై మోహన్ బాబు ఫైర్ అవడం కూడా ఈ ఇంటర్వ్యూ స్థాయేంటో చెబుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక అందరిలోనూ అమితాసక్తి రేకెత్తిస్తున్న మా ఎన్నికల్లో తన కుమారుడే గెలుస్తాడని మోహన్ బాబు చెప్పిన వైనం ఇంటర్వ్యూ రక్తి కట్టిస్తోందన్న వాదనలూ వినిపిస్తున్నాయి.
Must Read ;- సాయిరెడ్డికి నో మోర్ ఛాన్స్