వైఎస్ ఫ్యామిలీ, వేమూరి రాదాకృష్ణ.. రెండూ రెండు భిన్న ధృవాల కిందే లెక్క. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా పనిచేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచే ఈ వూరుధ్యం కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఏపీ సీఎంగా ఉన్న వైఎస్సార్ తనయుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అయితే.. రాధాకృష్ణ ఎక్కడ దొరుకుతారా? ఎప్పుడు జైల్లో పెట్టేద్దామా? అన్నంతగా కసి కసి చూపుతున్న వైనం కూడా అందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పుడు వైఎస్సార్ కుమార్తె, జగన్ తోడబుట్టిన చెల్లి వైఎస్ షర్మిలకు ఆర్కేనే ఆపద్భాందవుడిగా మారిపోయారన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. జగన్ తో విభేదించి తెలంగాణలో రాజకీయ పార్టీ పెడుతున్నట్లుగా అందరికంటే ముందు ఆర్కేనే చెప్పేశారు. దానికి కొనసాగింపులా ఇప్పుడు షర్మిల కూడా నేరుగా ఆర్కే స్టూడియోకు వచ్చి మరీ ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పేశారు. వెరసి తెలుగు నేల రాజకీయాల్లో ఇదో సరికొత్త పరిణామంగానే చెప్పాలి.
ఆర్కేకు షర్మిలే చెప్పారా?
వైఎస్ షర్మిల తన సోదరుడు జగన్ తో విభేదాల నేపథ్యంలో ఏపీని వదిలేసి తన అత్తారిల్లు అంటూ తెలంగాణలో అడుగుపెట్టింది. ఎంతైనా రాజశేఖరరెడ్డి కూతురు కదా.. హైదరాబాద్ లో అత్తారింటిలో ఊరికే కూర్చోలేరు కదా. అందుకే తెలంగాణ వేదికగా ఆమె కొత్త రాజకీయ పార్టీ పెట్టేందుకు సిద్ధపడిపోయారు. విషయం తెలిసిన జగన్ ఆమెను అడ్డుకునేందుకు యత్నించారు. షర్మిల ససేమిరా అన్నారు. అన్నాచెల్లెల్లిద్దరూ విడిపోయారు. ఈ మొత్తం తతంగాన్ని ఆర్కే.. తన పత్రిక ఆంధ్రజ్యోతిలో అందరికంటే ముందుగా చెప్పేశారు. ఏ ఒక్కరికీ తెలియని ఈ అంశాలు.. అది కూడా తనను శత్రువుగా పరిగణించే ఇంటిలో జరిగిన పరిణామాలు పూసగుచ్చినట్లుగా ఆర్కేకు ఎలా తెలిశాయని అంతా అనుకున్నారు. అయితే తాజాగా చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తుంటే.. షర్మిలే స్వయంగా ఆర్కేకు అన్ని విషయాలు వివరించి మరీ వార్తలు రాయించుకున్నారన్న వాదనలు బలపడుతున్నాయి. నిజమే మరి.. షర్మిల పార్టీ పేరుతో పాటు ఆమె తన కొత్త పార్టీని తన తండ్రి జయంతి నాడే ప్రారంభించనున్నారని ఆర్కే ఐదు నెలలు ముందుగానే చెప్పేశారు. ఆర్కే చెప్పినట్టుగానే షర్మిల తన పార్టీని తన తండ్రి జయంతి నాడే ప్రారంభించారు.
ఫ్యామిలీ తగాదాలను బయటపెడతారా?
ఆర్కే అంటేనే.. మీడియాలో సంచలనం. ఎక్కడ లేని ప్రశ్నలను సంధించి ఆసక్తికరమైన సమాధానాలను రాబట్టడంలో ఆయనను మించిన దిట్ట మరొకరు లేరనే చెప్పాలి. మరి తనను బద్ధ శత్రువుగా చూస్తున్న జగన్ సోదరి తన స్టూడియోకు ఇంటర్వ్యూ ఇచ్చేందుకు వస్తే.. ఆ అవకాశాన్ని ఆర్కే ఎందుకు వదులుకుంటారు? అయితే ఆర్కే సంధించే ప్రశ్నలకు సూటిగా సుత్తి లేకుండా షర్మిల సమాధానం ఇస్తారా? అన్నది కూడా ప్రశ్నే. ఎందుకంటే.. జగన్ కు సంబంధించిన విషయాలను మాట్లాడేందుకు షర్మిల నిరాకరించే అవకాశాలే ఎక్కువ. మరి ఆ తరహా అవధులను దాటేసి.. షర్మిల నుంచి వైఎస్ ఫ్యామిలీకి చెందిన సంచలన విషయాలను ఆర్కే ఎలా రాబడతారన్న దానిపై ఇప్పుడు ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈ ఆదివారం (26వ తేదీ) ప్రసారం కానున్న ఈ వీడియో ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రజల్లో అమితాసక్తి రేకెత్తిస్తోంది.
Must Read ;- సొంత అమ్మ కూడా జగన్‌కు క్లీన్ చిట్ ఇవ్వలేదే?











