ఏపీ ప్రభుత్వానికి శుక్రవారం నాడు కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి సమీర్ శర్మ పదవీ బాధ్యతలు చేపట్టారు. అదే సమయంలో జగన్ ప్రభుత్వానికి కొత్తగా ఇద్దరు సలహాదారులు కూడా బాధ్యతల్లోకి చేరిపోయారు. వీరిలో ఓ సలహాదారుగా గురువారం నాడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ విధుల్లో చేరితే.. కేన్సర్ వైద్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నోరి దత్తాత్రేయుడిని కూడా సలహాదారుగా నియమిస్తూ జగన్ సర్కారు శుక్రవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. వెరసి ప్రభుత్వానికి కొత్త సీఎస్ బాధ్యతలు స్వీకరించిన మరుక్షణమే.. కొత్తగా మరో ఇద్దరు సలహాదారులు కూడా అందుబాటులోకి వచ్చేశారు.
సింగిల్ డే కూడా గ్యాప్ లేదే
రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ నిజంగానే సింగిల్ డే కూడా గ్యాప్ లేకుండానే.. కొత్త విధుల్లోకి చేరిపోయారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా గురువారం నాడు ఆయన పదవీ విరమణ చేస్తే.. శుక్రవారం ఉదయమే ఆయన ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా కొత్త విధుల్లోకి దూకేశారు. దాస్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ కనబరచిన సీఎం జగన్.. సీఎస్‌గా దాస్ పదవీ విరమణ చేయడానికి నాలుగు రోజులు ముందుగానే ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించుకుంటున్నట్లుగా ఉత్తర్వులు జారీ చేశారు. కేబినెట్ ర్యాంకులో ఢిల్లీలోని ఏపీ భవన్ కేంద్రంగా దాస్ ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా విధులు నిర్వర్తించనున్నారు. ఇప్పటికే అప్పుల్లో రాష్ట్రం చూపిస్తున్న దూకుడుపై కేంద్రం గుర్రుగా ఉంది. అదే సమయంలో కేంద్రానికి తెలపకుండానే సాగునీటి ప్రాజెక్టులను జగన్ సర్కారు కట్టేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రం వద్ద తనదైన శైలిలో చక్రం తిప్పనున్న దాస్.. ఏపీకి సానుకూలంగా కేంద్రం మనసును మార్చే బాధ్యతలను భుజానికెత్తుకుంటారన్న వాదనలు వినిపిస్తున్నాయి. మరి జగన్ నమ్మకాన్ని దాస్ ఏ మేర నిలబెట్టుకుంటారో చూడాలి.
నోరికి అనూహ్యంగా పదవి
ఇదిలా ఉంటే.. ముందస్తుగా ఎలాంటి సమాచారం లేకుండానే జగన్ సర్కారు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచ ప్రఖ్యాత కేన్సర్ నిపుణుడు డాక్టర్ నోరి దత్తాత్రేయుడును ప్రభుత్వ సలహాదారుడిగా ఏపీ సర్కార్ నియమించింది. ఆ పదవిలో రెండేళ్ల పాటు ఆయన కేబినెట్ హోదాలో కొనసాగనున్నారు. డాక్టర్ నోరి నియామకానికి సంబంధించి పరిపాలన శాఖ (రాజకీయ) కార్యదర్శి ముత్యాలరాజు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. రేడియేషన్ ఆంకాలజిస్టుల్లో అత్యంత అనుభవజ్ఞుడిగా డాక్టర్ నోరి పేరుగాంచారు. గత మంగళవారం సీఎం జగన్ తో నోరి భేటీ అయ్యారు. క్యాన్సర్ నివారణ చికిత్సలు, అత్యాధునిక విధానాలపై సీఎంతో సుదీర్ఘంగా చర్చించారు. ఈ విషయంలో తగిన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వ సలహాదారుడిగా ఉండాలని నోరిని జగన్ కోరారు. రేడియేషన్ ఆంకాలజీలో డాక్టర్ నోరికి 43 ఏళ్ల అనుభవం ఉంది. బ్రెస్ట్ సెంటర్, గైనకాలజిక్ ఆంకాలజీ, తల, మెడ, న్యూరో ఆంకాలజీ, థొరాసిస్ ప్రోగ్రామ్ ల కోసం అడ్వాన్స్ డ్ టెక్నిక్ లు, కొత్త టెక్నాలజీని తీసుకురావడంలో ఆయన కీలకపాత్ర పోషించారు. వైద్య రంగంలో చేసిన కృషికి గాను 2015లో భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీతో సత్కరించింది.
Must Read ;- జగన్‌కు ఇంకో అడ్వైజర్ రెడీ