Adityanath Das Will Be Appointed As The AP Government Advisor :
సీనియర్ ఐఏఎస్ అధికారి ఆదిత్యనాథ్ దాస్ త్వరలోనే ఏపీ ప్రభుత్వంలో సలహాదారుగా చేరిపోవడం ఖాయమైపోయిందట. ఈ నెల 30న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన మరుక్షణం ఆయన జగన్ సర్కారుకు కీలక అంశాల్లో సలహాదారుగా నియమితులు కానున్నారట. ఈ మేరకు అమరావతిలోని ఏపీ సచివాలయంలో ఇదే అంశంపై పెద్ద చర్చే నడుస్తోందట. ఇప్పటికే పీఎస్ దాస్ అటు జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వద్ద కీలక శాఖల్లో పనిచేసి వైఎస్ ఫ్యామిలీ గుడ్ బుక్స్ చేరిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా జగన్ హయాంలో ఏకంగా సీఎస్ ఛాన్స్ దక్కించుకున్న దాస్.. జగన్ సర్కారు మనుసులో ఏముందో ఇట్టే పసిగట్టేసి పనులు చక్కబెడుతున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మంత్రులతో సంబంధం లేకుండా తానే స్వయంగా ఢిల్లీ వెళ్లి మరీ పనులు చక్కబెట్టిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయన్న అధికార వర్గాలు చెబుతున్నాయి.
జగన్ చెబితే దాస్ చేసేయడమే
ఐఏఎస్ అధికారిగా తన సర్వీసులో జిల్లా కలెక్టర్ గా పలు జిల్లాల్లో పనిచేసిన తర్వాత రాష్ట్ర స్థాయి సర్వీసులకు వచ్చిన తర్వాత దాస్ పలు కీలక శాఖల్లో పనిచేశారు. విద్యాశాఖతో పాటు జలవనరుల శాఖలోనూ దాస్ సుదీర్ఘ కాలం పాటు పనిచేశారు. విద్యా శాఖలో పనిచేసిన కాలం కంటే జలవనరుల శాఖలోనే ఆయన సుదీర్ఘ కాలం పాటు కొనసాగారు. జగన్ సీఎం అయ్యాక జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన దాస్.. జగన్ అనుకున్న విధంగా జలవనరుల శాఖను నిర్వహించారు. ఈ కారణంగానే పొరుగు రాష్ట్రంలో విభేదాలు తప్పవని తెలిసి కూడా జగన్ మాటను కాదనలేక రాయలసీమ ఎత్తిపోతల పథకానికి కూడా దాస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక పోలవరం ప్రాజెక్టు పనులు మేఘాకు దక్కేలా వ్యవహరించడంలోనూ దాస్ కీలక భూమిక పోషించారన్న వాదనలు లేకపోలేదు. మొత్తంగా జగన్ ఏం అనుకున్నారో, దానిని చేసి చూపించిన అధికారిగా జగన్ మనసులో దాస్ కు మంచి గుర్తింపు ఉంది.
జల వనరుల బాధ్యత దాస్‌కే
ఈ నేపథ్యంలో మరింత కాలం పాటు దాస్ ను సీఎస్ గా కొనసాగించాలని ఇప్పటికే జగన్ కేంద్రానికి లేఖ రాయగా.. కేంద్రం నుంచి స్పందన కరువైంది. దీంతో దాస్ ను మరింతకాలం పాటు సీఎస్ గా కొనసాగించే అవకాశాలే లేవు. ఈ కారణంగానే కొత్త సీఎస్‌గా సమీర్ శర్మను ఎంపిక చేసిన జగన్.. సీఎస్‌గా పదవీ విరమణ చేయగానే.. దాస్ ను తన ప్రభుత్వ సలహాదారుగా నియమించుకునేందుకు రెడీ అయిపోయారట. అంతేకాకుండా జలవనరుల శాఖపై మంచి పట్టు కలిగిన దాస్‌ను జగన్ అదే శాఖకు ముఖ్య సలహాదారుగా నియమించేందుకు రంగం సిద్ధం చేశారట. ఈ దిశగా ఇప్పటికే ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి కాగా.. దాస్ అటు పదవీ విరమణ చేయగానే.. ఇటు జగన్ సర్కారు ఉత్తర్వులు జారీ చేయనుందట.
Must Read ;- రజనీష్‌ది గోల్డెన్ లెగ్గే.. ఇదిగో మరో రుజువు











