ABN Andhrajyoti MD Vemuri Radhakrishna Fails In YS Sharmila Interview :
ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే.. ఏ టీవీ ఛానెల్ లో వస్తుందో? ఏ సమయంలో వస్తుందో? ఇంటర్వ్యూ ఎవరు చేస్తారో?.. తెలుగు ప్రజలకు చెప్పాల్సిన పనే లేదు. ఎందుకంటే.. ఆ పేరిట వరుసగా విడుదలైన ఇంటర్వ్యూలు ఓ రేంజిలో పేలిపోయాయి. రంగం ఏదైనా.. అంశం ఏదైనా.. తనదైన శైలి ప్రశ్నాస్త్రాలతో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ ఇంటర్వ్యూకు హాజరయ్యే ప్రముఖులకు ముచ్చెమటలు పట్టిస్తారు. అసలు ఏబీఎన్ ఇంటర్వ్యూలో కనిపించాలని కోరుకోని ప్రముఖులు ఉండరంటే అతిశయోక్తి కాదేమో. అదే సమయంలో ఏబీఎన్ నుంచి ఇంటర్వ్యూకు రమ్మంటూ పిలుపు వచ్చిందంటేనే.. వణికిపోయే ప్రముఖులు లేరంటే అతిశయోక్తి కాదేమో. అంటే.. ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఇంటర్వ్యూకు హాజరు కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటే.. వారే సరిగ్గా పిలుపు వచ్చేసరికి వణికిపోయేవారు. అసలు ఆదివారం రాత్రి 8.30 గంటలు అయ్యిందంటే చాలు.. దాదాపుగా అన్ని టీవీల్లో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి చానెల్ ప్రసారాలే మారుమోగుతుంటాయి. అంతటి ప్రజాదరణ పొందిన టీవీ ఇంటర్వ్యూలో రాధాకృష్ణ సంధించే ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా మందికి కష్టమే. అలాంటిది ఆదివారం రాత్రి ప్రసారమైన ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే ఎపిసోడ్ లో ఏపీ సీఎం జగన్ సోదరి, వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అలా అలా ఈజీగా సమాధానాలు చెప్పుకుంటూ పోయారు. ఏమాత్రం ఇబ్బంది పడలేదు. అదో ఇంటర్వ్యూలా కాకుండా ఏదో చిట్‌చాట్ కార్యక్రమంగా సాగిపోయింది.
అసలు అక్కడున్నది ఆర్కేనేనా?
షర్మిలతో ఇంటర్వ్యూ చేసిన రాధాకృష్ణను చూసిన వారంతా ఈయన ఆర్కేనేనేనా అని జనాలు తరచి చూసుకున్నారంటే అతిశయోక్తి కాదేమో. ఎందుకంటే.. ఈ ఇంటర్వ్యూను చూసిన వారంతా ఇది నిజంగానే ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే కార్యక్రమమేనా? అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా ఈ ఇంటర్వ్యూను చూసిన వారంతా.. వెంటనే యూట్యూబ్ ఓపెన్ చేసి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే పేరిట గతంలో రాధాకృష్ణ చేసిన ఇంటర్వ్యూ వీడియోలను తరచి తరచి మరీ చూశారు. పాత వీడియోల్లో ఆర్కే నోట నుంచి వచ్చిన ప్రశ్నలు, వాటికి సమాధానం ఇచ్చేందుకు ఆయా రంగాల ప్రముఖులు పడిన ఇబ్బందులను గుర్తు చేసుకున్న జనం.. షర్మిల ఏమాత్రం ఇబ్బంది పడకుండా.. ఈజీగా సమాధానాలు చెప్పుకుంటూ పోయిన వైనం చూసి నిజంగానే షాక్ తిన్నారు. అదే విషయాన్ని తమ స్పందనల ద్వారా తెలియజేశారు కూడా. ఈ సందర్భంగా చాలా మంది షర్మిలను ఇంటర్వ్యూ చేసింది ఆర్కే కాదులే అంటూ సెటైర్లు సంధించారు. మొత్తంగా ఈ ఇంటర్వ్యూల్లో ఆర్కే తొలిసారిగా తేలిపోయారన్న మాట గట్టిగానే వినిపిస్తోంది.
ఈజ్ ఇట్ పెయిడ్..?
గతంలో ఇదే కార్యక్రమంలో పలు రంగాలకు చెందిన వారికి తనదైన శైలి ప్రశ్నలు సంధించి.. ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించిన ఆర్కే.. నిన్నటి ఇంటర్వ్యూలో మాత్రం షర్మిలకు సంధించిన ప్రశ్నలు చూస్తుంటేనే నిజంగానే చాలానే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ ఫ్యామిలీ, వేమూరి రాధాకృష్ణ.. రెండు భిన్న ధృవాల కిందే లెక్క. అలాంటి నేపథ్యంలో వైఎస్ షర్మిలకు ఆర్కే నుంచి ఘాటైన ప్రశ్నలు ఎదురవుతాయని, ఆ ప్రశ్నలకు షర్మిల నుంచి వచ్చే సమాధానాల ద్వారా ఏపీ సీఎం జగన్ ఇమేజీని డ్యామేజీ చేయడంతో పాటు.. ఏపీలో జగన్ సాగిస్తున్న ప్రజాకంటక పాలనను జనం కళ్లకు కట్లేలా ఆర్కే చేస్తారని అంతా అనుకున్నారు. అయితే అలాంటిదేమీ ఈ ఇంటర్వ్యూలో కనిపించిన పాపానే పోలేదు. అసలు కొన్ని ప్రశ్నలు వేసినప్పుడు షర్మిల.. ఇక వాటిని వదిలేద్దాం అంటేనే.. సరే నేనేమీ ఫోర్స్ చేయనులెండి అంటూ ఆర్కే అనునయించిన తీరు కూడా ఈ ఇంటర్వ్యూ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ షర్మిల తన ఇంటర్వ్యూకు వచ్చేందుకు అంగీకరించిన వెంటనే ఆర్కే తనదైన శైలి ప్రశ్నావళిని రూపొందించుకుని ఉంటారని అంతా అనుకున్నారు. అయితే ఆ దిశగా ఆర్కే ప్రశ్నలు కనిపించలేదు. అంతకుమించి షర్మిల నుంచి సమాధానాలు రాకున్నా.. ఆర్కేనే ఆయా సమాధానాలను అందించిన తీరును కూడా చూస్తుంటే.. ఈ ఇంటర్వ్యూ పెయిడ్ ఇంటర్వ్యూనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Must Read ;- బాబు సవాల్‌కు జగన్ సిద్ధమా?