(విజయనగరం నుంచి లియోన్యూస్ ప్రతినిధి)
పూసపాటి వంశీయుల వారసుడు, విజయనగర సంస్థానాధీశుడు, కేంద్ర మాజీ మంత్రి, తెలుగుదేశం సీనియర్ నాయకుడు పూసపాటి అశోక్ గజపతి రాజుకు అవమానం జరిగింది. అందుకే ఆయన తమ ఆడపడుచు శ్రీ పైడితల్లి అమ్మవారిని ఈ ఏడాది దర్శించుకోలేదు. ప్రతిష్టాత్మకమైన అమ్మవారి పండుగకు దూరంగా ఉన్నారు. ఈ విషయంపై విజయనగరంలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పన్నాగంలో భాగంగానే ఇదంతా జరుగుతోందని స్థానిక తెలుగుదేశం వర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి.
తొలేళ్లు రోజు అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ
ప్రతీ ఏడాది విజయదశమి అనంతరం వచ్చే సోమవారం విజయనగరం వాసుల ఇలవేల్పు శ్రీ పైడితల్లి అమ్మవారి తొలేళ్లు, మంగళవారం సిరిమానోత్సవం కొన్ని శతాబ్దాలుగా విజయనగరంలో నిర్వహిస్తున్నారు. కొన్నేళ్లుగా దేవాదాయశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ పండుగగా నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి పైడితల్లి అమ్మవారి దేవస్థానం అనువంశిక ధర్మకర్తగా అశోక్ గజపతి రాజు, ఆయన కుటుంబీకులు తొలేళ్లు రోజు సుప్రభాత వేళ అమ్మవారిని దర్శించుకుని పసుపుకుంకుమలు, పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ.
అయితే ఈ ఏడాది ఆహ్వానపత్రికలో ఆయన పేరు దిగువన అనువంశిక ధర్మకర్తగా బదులు ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ గా ముద్రించడం, సోమవారం ఆయన దర్శనానికి నిర్దేశిత సమయం కేటాయించడం తదితర కారణాలను ఆయన అవమానంగా భావించినట్లు సంబంధిత బంగ్లా వర్గాల సమాచారం.
మాన్సాస్ ఛైర్మన్‌గా తప్పించడమే ..
రాష్ట్ర ప్రభుత్వం అశోక్ గజపతి రాజును మాన్సాస్ ఛైర్మన్ గా ఆకస్మికంగా తప్పించడం , ఆయన అన్నయ్య ఆనందగజపతి రాజు మొదటి భార్య ఉమా గజపతి కుమార్తె సంచైతను నియమించడం , ఆమె మాన్సాస్‌లో అశోక్ హయాంలో అంతర్గతంగా జరిగిన సంఘటనలు ఒకటికొకటిగా బయటపెడుతూ, అశోక్ ప్రతిష్టతను దెబ్బ తీస్తుండటం తదితర కారణాలు అమ్మవారి పండుగకు రాజు గారు దూరం ఉండటానికి కారణాలని పరిశీలకులు భావిస్తున్నారు.
పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్న సంచైత గజపతి
విజయనగరం ప్రజల ఆరాధ్య దైవం, పూసపాటి వంశీయుల విజయనగరం రాజుల ఆడపడుచు శ్రీ పైడితల్లి అమ్మవారిని మాన్సాస్ ట్రస్ట్ ఛైర్పర్సన్ సంచైత గజపతి సోమవారం దర్శించుకున్నారు. మాన్సాస్ ట్రస్ట్ ఛైర్పర్సన్ హోదాలో దర్శించుకున్న ఆమెను ఆలయ అధికారులు పూర్ణకుంభంతో స్వాగతించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పసుపుకుంకుమలతో పాటు పట్టువస్త్రాలను సంచైత గజపతి సమర్పించారు.
దర్శనానంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి దర్శనం దేవుడు కల్పించిన అవకాశమన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల నుండి ప్రజలు వెంటనే బయటపడాలని, అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని కోరినట్లు తెలిపారు. అమ్మవారు ఒక్కోసారి ఒక్కొక్కరికి అవకాశం ఇస్తుంటారని, దాన్ని దైవనిర్ణయంగా భావించాలని పరోక్షంగా బాబాయ్ అశోక్ గజపతికి చురకలు అంటించారు.
వర్చువల్ దర్శనం చేసుకుంటా : అశోక్ గజపతి రాజు
కరోనా నేపథ్యంలో అడ్మినిస్ట్రేషన్ కి సహకరిస్తూ నేరుగా పండుగలో పాల్గోవటం లేదు. వర్చువల్ దర్శనం మాత్రమే చేసుకుంటాను. మా కుటుంబం నుండి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించాం. భక్తుడిగా నాకు ప్రత్యేక గౌరవం అక్కర్లేదు ఎప్పుడైనా దర్శనానికి వెళ్లొచ్చు. సంప్రదాయాలు పాటిస్తూ పండుగ జరపాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను.
అమ్మవారి పండుగలో చోటుచేసుకుంటున్న పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్న పట్టణ ప్రజలు ఉత్సవాలలో రాజకీయాలేంటని ఆశ్చర్యపోతున్నారు.