సోనూ సూద్.. నిజంగానే రియల్ హీరోనే. సినిమాల్లో విలన్ గా కనిపించినా.. నిజ జీవితంలో మాత్రం ఆయన హీరోనే. కరోనా కష్ట కాలంలో లక్షలాది మంది వలస కార్మికులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు చేతికి ఎముకే లేదన్నట్లుగా వ్యవహరించిన సూద్. కోట్లాది రూపాయలను వెచ్చించారు. వలస కార్మికుల కష్టాలు తీర్చేందుకు కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలు కిందామీదా పడుతుంటే.. తనకెందుకులే అని సోనూ ఇంటిపట్టునే కూర్చోలేకపోయారు. తనలోని మానవత్వాన్ని తట్టి లేపి మరీ చేతనయినంత సాయం చేశారు. ఆ తర్వాత కూడా ఆయన తన సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో అందరూ ఆయనను రియల్ హీరోగానే అభివర్ణిస్తున్నారు. అలాంటి రియల్ హీరో.. ఇప్పుడు పన్ను ఎగవేతదారుగా తేలారంటే నమ్మేదెలా? సోనూ ఇంటిలో సోదాలు చేసిన ఆదాయపన్ను శాఖ స్వయంగా వెల్లడిస్తే నమ్మక తప్పదు కదా.
రూ.20 కోట్ల మేర పన్ను ఎగవేత
గడచిన నాలుగు రోజులుగా సోనూ సూద్ పై ఐటీ శాఖ అధికారులు దాడులు చేస్తున్నారు. ముంబైలోని సోనూ ఇల్లు, కోల్ కతాలోని కార్యాలయం, ఇతర ప్రాంతాల్లోని ఆయన ఆస్తులపై ఐటీ శాఖ అధికారులు ఏకకాలంలో దాడులు జరిపారు. సోనూతో పాటు ఆయన సన్నిహితులు, బంధువుల ఇళ్లల్లోనూ ఐటీ శాఖ సోదాలు నిర్వహించింది. ఈ సోదాలపై ఐటీ శాఖ శనివారం ఓ ప్రకటనను విడుదల చేసింది. సోనూ సూద్ ప్రభుత్వానికి రూ.20 కోట్ల మేర పన్నును ఎగవేశారని ఐటీ శాఖ ఈ ప్రకటనలో సంచలన ప్రకటన చేసింది. ఈ ఒక్క మాటతో రియల్ హీరోను పన్ను ఎగవేతదారుగా తేలిపోయిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయినా రెండేళ్లుగా సోనూ సూద్ చేస్తున్న సాయం, ఆపదలో ఉన్న వారిని ఆదుకుంటున్న వైనం చూసి అయినా ఆయన పన్ను ఎగవేతలను ఎలా బయటపెట్టారంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
ఐటీ శాఖ ఏమన్నదంటే..?
ఐటీ శాఖ విడుదల చేసిన ప్రకటనలో ఏముందన్న విషయానికి వస్తే..‘‘సోనూ సూద్20 కోట్ల మేర పన్ను ఎగ్గొట్టారు. చట్టవిరుద్ధంగా ఓ క్రౌడ్ ఫండింగ్ సంస్థ ద్వారా విదేశాల నుంచి ఆయన స్వచ్ఛంద సంస్థ రూ.2.1 కోట్ల నిధులను సమీకరించింది. ఫారిన్ కంట్రిబ్యూషన్ నియంత్రణ చట్టం ప్రకారం అది నేరం. సోనూసూద్ సహా ఆయన సన్నిహితులు, భాగస్వాముల ఇళ్లు, ఆఫీసుల్లో సోదాల సందర్భంగా పన్ను ఎగవేత ఆధారాలను సంపాదించాం. లెక్కలో చూపించని ఆదాయాన్ని దారి మళ్లించేందుకు బోగస్ సంస్థల నుంచి బోగస్ రుణాలను తీసుకున్నట్టు చూపించారు. ఇప్పటిదాకా అలాంటి 20 బోగస్ సంస్థలను గుర్తించాం. డబ్బుకు బదులుగా చెక్కుల రూపంలో ఆ సంస్థలు లబ్ధి చేకూర్చాయి. పన్నులను ఎగ్గొట్టేందుకు అకౌంట్ బుక్స్ కు సంబంధించిన ప్రొఫెషనల్ రశీదులను రుణపత్రాలుగా మార్చి చూపించారు. ఆ డబ్బును ఆస్తుల కొనుగోలు, ఇతర సంస్థల్లో పెట్టుబడుల కోసం వాడారు’’ అని ఐటీ శాఖ సంచలన విషయాలను వెల్లడించింది.











