ఇంకో ఆరు నెలలుంటే.. పంజాబ్ అసెంబ్లీకి ఎన్నికలు జరుగుతాయి. అంతలోనే పంజాబ్‌లో కీలక పరిణామం చోటుచేసుకుంది. పంజాబ్ సీఎం పదవికి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కెప్టెన్ అమరీందర్ సింగ్ శనివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఇటీవలే పంజాబ్ పీసీసీ చీఫ్‌గా మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్ధూ ఎంపికైన నాటి నుంచి పంజాబ్ కాంగ్రెస్‌లో గతంలో ఎన్నడూ లేనంతమేర అలజడి మొదలైన సంగతి తెలిసిందే పీసీసీ చీఫ్ గా సిద్ధూ అభ్యర్థిత్వాన్ని కెప్టెన్ అడ్డుకోవాలని చూస్తే.. ఎలాగోలా పీసీసీ పీఠాన్ని దక్కించుకున్న సిద్ధూ.. అమరీందర్ ను సీఎం పదవి నుంచి దింపే దిశగా తనదైన శైలి వ్యూహాలు అమలు చేశారు. పార్టీ అధిష్ఠానాన్ని తన వైపునకు తిప్పుకున్న సిద్ధూ.. కెప్టెన్ కు పక్కలో బల్లెం మాదిరిగానే పరిణమించారు. సిద్ధూ మాట వింటున్న పార్టీ పెద్దలు.. కెప్టెన్ మాటను మాత్రం అంతగా పట్టించుకోవడం లేదు. ఈ క్రమంలో శనివారం నాడు సీఎల్పీ భేటీకి సిద్ధూ పిలుపునివ్వగా.. ఆ భేటీలో సీఎంగా కొత్త నేతను ఎన్నుకుంటారన్న వార్తలు కెప్టెన్ తీవ్ర కలవరపాటుకు గురి చేశాయి. పదవి కాపాడుకునేందుకు కెప్టెన్ యత్నాలు చేసినా.. అధిష్ఠానం నుంచి సహకారం లభించకపోవడంతో సీఎం పదవికి ఆయన రాజీనామా చేశారు.
సీఎల్పీ భేటీకి ముందు కెప్టెన్ భేటీ
సీఎల్పీ భేటీలో కొత్త సీఎంను ఎన్నుకుంటారన్న సమాచారం తెలియగానే.. నిజంగానే అమరీందర్ సింగ్ తీవ్ర కలవరపాటుకు గురయ్యారు. తన పదవిని కాపాడుకునేందుకు ఆయన అందుబాటులో ఉన్న అన్ని మార్గాలను ప్రయత్నించి చూశారు. సీఎల్పీ భేటీ కంటే ముందుగానే తానో సమావేశాన్ని ఏర్పాటు చేసేందుకు యత్నించిన కెప్టెన్.. తన సమావేశానికి ఆశించిన మేర సంఖ్యలో ఎమ్మెల్యేలు హాజరైతే పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించాలని చూశారు. అయితే అప్పటికే ఈ వ్యూహాన్ని పసిగట్టిన సిద్ధూ.. అమరీందర్ పై పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు అమరీందర్ తో మంతనాలు సాగించారు. ఈ క్రమంలో స్వయంగా సోనియా గాంధీ కూడా అమరీందర్ తో మాట్లాడారట. అందరితో మాట్లాడిన తర్వాత ఇక తన వ్యూహం ఎలాగూ పనిచేయదన్న ఓ భావనకు వచ్చిన అమరీందర్ సీఎల్పీ భేటీ కంటే ముందుగానే తన సీఎం పదవికి రాజీనామా చేసి.. రాజీనామా లేఖను గవర్నర్‌కు సమర్పించారు.
కాంగ్రెస్‌కూ రాజీనామా
ఇదిలా ఉంటే.. సీఎం పదవికి రాజీనామా చేసిన అమరీందర్ సింగ్ ఏకంగా కాంగ్రెస్ పార్టీకి కూడా రాజీనామా చేసి పారేశారు. సీఎం పదవికి రాజీనామా చేస్తూ గవర్నర్ కు లేఖ రాసిన మరుక్షణమే సోనియా గాంధీకి కూడా అమరీందర్ మరో లేఖ రాశారు. తాను ఇకపై కాంగ్రెస్ పార్టీలో కొనసాగలేనని ఆయన సోనియాకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. సీఎం పదవికి కెప్టెన్ రాజీనామా చేసిన నేపథ్యంలో కొత్త సీఎంను ఎన్నుకునేందుకు సిద్ధూ నేతృత్వంలో సీఎల్పీ భేటీ కానుంది. ఈ భేటీలో కొత్త సీఎంను ఎన్నుకునే అవకాశాలున్నాయి. అయితే ఆ కొత్త సీఎం ఎవరన్న దానిపై మాత్రం సస్పెన్స్ నెలకొంది. కేవలం ఆరు నెలల పాటు మాత్రమే సీఎంగా కొనసాగే అవకాశమున్న నేపథ్యంలో సిద్ధూ సీఎం కుర్చీపై కూర్చునేందుకు ఆసక్తి చూపిస్తారా? అన్న దిశగా ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి.
Must Read ;- బీజేపీ, కాంగ్రెస్.. హిట్ కొట్టిందెవరు?