ఏపీలో రాజ్యాంగానికి విరుద్దంగా వాలంటీర్లను నియమించారంటూ నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు ప్రధాని నరేంధ్ర మోడీకి ఫిర్యాదు చేశారు. వాలంటీర్లు చట్ట వ్యతిరేకంగా వ్యవహరిస్తూ గ్రామ పరిపాలనను అస్తవ్యస్తం చేశారని ఆయన ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. గ్రామాల్లో కులాల మధ్య చిచ్చుపెట్టి వాలంటీర్లు ఘర్షణలకు కేంద్రబిందువుగా మారారని లేఖలో ఆరోపించారు. ఏపీలో ఏ ఎన్నికలు జరిగినా అధికార పార్టీకి ఓట్లు వేయాలని వాలంటీర్లు బెదిరింపులకు దిగుతున్నారని ప్రధానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. అధికార పార్టీకి ఓట్లు వేయకుంటే రేషన్ కట్ చేస్తామని, పింఛను ఎత్తివేస్తామని వాలంటీర్లు ప్రజలను భయపెడుతున్నారని, దీని వలన గ్రామ పాలన మొత్తం స్థంభించిపోయిందన్నారు.
వాలంటీర్ల ఆగడాలను కట్టడి చేయండి
సుపరిపాలన పేరుతో గ్రామ వాలంటీర్లను నియమించుకుని ప్రజలు చెల్లించే పన్నుల నుంచి ఏటా రూ.3700 కోట్లు దోచిపెడుతున్నారని రఘురామరాజు ఆరోపించారు. స్థానిక ఎన్నికల్లోనూ వాలంటీర్లు బెదిరింపులకు దిగి వ్యూహాత్మకంగా వ్యవహరించారని ఆయన లేఖలో వివరంగా తెలిపారు. వాలంటీర్ల వల్ల గ్రామాల్లో కొత్తకొత్త గొడవలు వస్తున్నాయని ఆయన అందులో అభిప్రాయపడ్డారు. ప్రశాంతతకు భంగం కలిగిస్తూ కుల,మతాలు, వర్గాల మధ్య చిచ్చు పెడుతున్న వాలంటీర్ల వ్యవస్థపై తగు చర్యలు తీసుకోవాలని లేఖలో ప్రధానిని కోరారు.











