ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపొందినా.. ఆ పార్టీకి మరో టెన్షన్ మొదలైంది. అదే సమయంలో ప్రధాన పార్టీలకూ మరో సవాలు ఎదురుకానుందనే చర్చ నడుస్తోంది. ఖమ్మం-వరంగల్-నల్గొండ పట్టబద్రుల ఎమ్మెల్సీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తీన్మార్ మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. అంతేకాదు.. గెలిచిన అభ్యర్థితో హోరాహోరీగా తలపడ్డారని చెప్పవచ్చు. ఇక్కడ గెలుపోటములకు మధ్య ఓట్ల తేడా మూడు శాతం మాత్రమే ఉండడం, ఏమాత్రం అటూఇటూ అయినా.. టీఆర్ఎస్ ఓడిపోయే పరిస్థితి కనిపించింది. సాగర్ ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్‌కుమార్ పోటీ చేస్తారన్న ఊహాగానాలు మొదలయ్యాయి. ఫలితాలు వెల్లడైన తరువాత తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ.. రూ.వందల కోట్లు ఖర్చుచేసిన పార్టీలకు ధీటుగా ఓటర్లు తమకు మద్దతు ఇచ్చారన్నారు. యుద్ధం ఇప్పటితో ఆగదని, సాగర్ ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని వ్యాఖ్యానించారు. దీంతో ఆయన సాగర్‌లో పోటీచేస్తారన్న ఊహాగానాలూ ఉపందుకున్నాయి.
ఏమాత్రం తేడా వచ్చినా..
ఖమ్మం-వరంగల్-నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి వచ్చిన ఓట్లు చూస్తే.. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి -1,61,811, తీన్మార్ మల్లన్న-1,49,005 ఓట్లు పోల్ అయ్యాయి. 12,806 ఓట్ల తేడాతో మల్లన్న ఓడిపోయారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం శాతం మూడు మాత్రమే. అంతేకాదు..ఇక్కడ చెల్లకుండా పోయిన ఓట్లు దాదాపు 21 వేలు ఉన్నాయి. ఈ ఓట్లలో ఎవరికి ఎన్ని పడేవి అనేది చెప్పలేం. కాని ఆ మూడు శాతం ఓట్లు తీన్మార్ మల్లకు ఎక్కువగా వచ్చి ఉంటే విజయం తారుమారు కావచ్చు. ఇదే సరిగ్గా మిగతా పార్టీలకు సవాలుగా మారింది.
2015లో 13వేల ఓట్లు..
2015లో ఇదే నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి బరిలోకి దిగగా కాంగ్రెస్ మద్దతుతో తీన్మార్ మల్లన్న బరిలో నిలిచారు. అప్పుడు తీన్మార్ మల్లన్న 13303 ఓట్లు సాధించారు. అప్పట్లో 21మంది పోటీ చేయగా ఈ సారి 71మంది పోటీ చేశారు. కాకపోతే అప్పుడు 2.81లక్షల ఓట్లు ఉండగా 1.53లక్షల ఓట్లు పోలయ్యాయి. ఇప్పుడు మొత్తం ఓట్లు 5,05,565 కాగా, 3,86,320 ఓట్లు (76.41శాతం) పోలయ్యాయి. పోస్టల్ బ్యాలెట్ కలుపుకుని మొత్తం 3,87,969 ఓట్లు నమోదయ్యాయి. అప్పుడు కూడా 19,995ఓట్లు చెల్లకుండా పోయాయి. నోటాతో కలిపితే దాదాపు 25వేల ఓట్లు చెల్లలేదని చెప్పవచ్చు. మొత్తం పోలైన ఓట్లలో అది 18శాతం కావడం గమనార్హం. ఈ సారి 21,636 ఓట్లు చెల్లకుండా పోయాయి. అయినా ప్రధాన పార్టీలకు తీన్మార్ మల్లన్న సవాలు విసిరారని చెప్పవచ్చు. ఇక 2019లో హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో తీన్మార్ మల్లన్న పోటీ చేశారు. అయితే అక్కడ డిపాజిట్ కోల్పోయిన విషయాన్ని పార్టీల నాయకులు కొందరు గుర్తు చేస్తున్నారు. అదే సమయంలో తీన్మార్ మల్లన్న పోరాట పటిమను తక్కువగా అంచనా వేయలేమని చెబుతున్నారు.
1650 కిలోమీటర్ల పాదయాత్ర..
హుజూర్‌నగర్ ఉప ఎన్నికల్లో తాను కొన్ని పాఠాలు నేర్చుకున్నానని, తరువాత మళ్లీ పోటీ చేస్తానని తీన్మార్ మల్లన్న అప్పట్లోనే ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందుగానే నియోజకవర్గంలో పాదయాత్ర చేపట్టారు. మొత్తం మీద 1650 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టారు. ఇక సొంత జిల్లా అయిన నల్గొండలో తీన్మార్ మల్లన్న మరింత బలం పుంజుకుంటారన్న చర్చ కూడా మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో మూడో రౌండ్ నుంచి తీన్మార్ మల్లన్నకు ఓట్లు పెరగటాన్ని గమనించవచ్చని నాయకులు చెబుతున్నారు.
ఈ క్రమంలో నాగార్జునసాగర్‌లో పోటీ చేస్తే.. ప్రధాన పార్టీలకు టెన్షన్ తప్పదని చెప్పాల్సి ఉంటుంది. ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా ప్రభుత్వాన్ని విమర్శించడం, తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వార్తా విశ్లేషణలో ప్రజలకు అర్థమయ్యేలా వారి కోణంలో ఆలోచించి అన్ని పార్టీలను ఎండగట్టడం కూడా తీన్మార్ మల్లన్న క్రేజ్ పెరిగేందుకు కారణమైందని చెప్పవచ్చు. అయితే సాగర్ ఎన్నికల నోటిఫికేషన్‌కు రెండు రోజలే సమయం ఉంది. మార్చి 30లోగా నామినేషన్లు వేయాల్సి ఉంటుంది. ఏప్రిల్ 17న ఎన్నికలు ఉండగా లెక్కింపు మే2న ఉండనుంది. నామినేషన్ల స్వీకరణకు తుది గడువు వారం మాత్రమే ఉండగా ఎన్నికలకు మూడు వారాలే సమయం ఉండడంతో తీన్మార్ మల్లన్న పోటీ చేస్తారా లేక మద్దతు ప్రకటిస్తారా అనేది తేలాల్సి ఉంది.