( విశాఖపట్నం నుంచి లియో న్యూస్ ప్రతినిధి)
మల్కాపురం నడిరోడ్డు పై వైసీపీ నాయకులు వీధి గుండాల్లా బాహాబాహీకి దిగారు. వైసీపీ కార్పోరేటర్ అభ్యర్ధి పివి సురేష్ , మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ.. నువ్వెంత? నీ బతుకెంత ? అనుకుంటూ పార్టీ పరువు తీశారు. ఈ మధ్య వైసీపీ కార్పోరేటర్ అభ్యర్ధి పివి సురేష్ అనేక వివాదాలకు కారకుడయ్యాడు. అతని దూకుడు ప్రవర్తన, అసభ్యకరమైన పదజాలం ఆ పార్టీ మంత్రులను ఆదర్శంగా తీసుకున్నట్టు కనిపిస్తోంది. గతంలో వైసీపీ మహిళ నాయకురాలిపై దాడికి యత్నం చేయడం సంచలనం అయింది. ఇప్పుడు మరోసారి మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ పై కోట్లాటాకు దిగడంతో స్థానికంగా అలజడి రేగింది.
మల్కాపురంలో సోమవారం జరిగిన రాజకీయ సమావేశంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు బండ భూతులు తిట్టుకున్నారు. మాజీ డిప్యూటీ మేయర్ దాడి సత్యనారాయణ, కార్పోరేటర్ అభ్యర్ధి పివి సురేష్ వర్గాలను అదుపు చేయడానికి ఇతర నాయకులు నానా పాట్లు పడాల్సి వచ్చింది. ఇద్దరు నాయకుల భూతుల దండకంతో కార్యకర్తలకు ఏం చేయాలో పాలుపోలేదు. కార్పోరేటర్ ఎన్నికల నేపధ్యంలో జనసేన పార్టీకి రాజీనామా చేసి వైసీపీలో చేరిన పివి సురేష్ సొంత పార్టీ నేతలతోనే తగాదాలకు దిగుతున్నారు.
విశాఖలో ఇటువంటి సంఘటనలు అరుదనే చెప్పాలి. మరి పార్టీ నాయకత్వం క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందో.. లేదో వేచి చూడాలి.
MuST Read ;- విశాఖ విమానాశ్రయానికి ఎసరు!