స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ మరో నట దిగ్గజంతో పోటీ పడితే ఎలా ఉంటుంది? దానికి సమాధానం ‘పుష్ఫ’ సినిమానే చెప్పాలి. అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ సినిమాలో విలన్ గా మలయాళ నటుడు ఫాహద్ ఫాజిల్ ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు ఈ పాత్రకు రకరకాల పేర్లు వినిపించాయి. తమిళ నటుడు విజయ్ సేతుపతి పేరు మొదటి వినిపించింది. డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో విజయ్ సేతుపతి తప్పుకున్నాడు. ఆ తర్వాత మరికొన్ని పేర్లు తెరమీదకు వచ్చాయి.
ఇప్పుడు ఫాహద్ ఫాజిల్ ను విలన్ గా తీసుకోవడం వెనక పెద్ద మార్కెటింగ్ స్ట్రాటజీనే ఉంది. ఎందుకంటే అల్లు అర్జున్ కు తెలుగులో ఎంత క్రేజ్ ఉందో మళయాళంలోనూ అంతే క్రేజ్ ఉంది. అక్కడ ఆయనకు అభిమానులు ఎక్కువ. కేరళలో ఆయనను అభిమానులు మల్లు అర్జున్ అని పిలుస్తారు. మలయాళంలో ఫాహద్ ఫాజిల్ కు ఉన్న క్రేజ్ మామూలిది కాదు. ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషిస్తూ నట శిఖరాగ్రానికి ఫాహద్ ఫాజిల్ చేరుకున్నారు. ముఖ్యంగా వైవిధ్యమైన పాత్రలు పోషించడానికే ఆయన మక్కువ చూపుతారు. అక్కడ అంత క్రేజ్ ఉన్న ఫాహద్ ఈ సినిమాలో విలన్ గా పోషించడం వల్ల ఆయన తనను తాను తగ్గించుకున్నట్టు అవుతుంది కదా అన్న సందేహం కూడా చాలా మందికి ఉంది.
కానీ మలయాళ ప్రజలు ఫాహద్ లోని మంచి నటుడిని మాత్రమే కోరుకుంటారు. పైగా అతనికి కూడా ఇలాంటి వైవిధ్యమైన పాత్రల పోషణ పట్ల మక్కువ ఎక్కువ. ఈ కొత్త కాంబినేషన్ సెట్ అవడంతో ‘పుష్ప’ సినిమాకి మలయాళంలో మరింత హైప్ వచ్చింది. ‘పుష్ప’ సినిమా పాన్ ఇండియా సినిమాగా రూపొందుతోంది. అందుకే నటుల విషయంలో అంత ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి వస్తోంది. ఇది గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే కథ. ఇందులో అల్లు అర్జున్ పుష్పరాజ్ అనే స్మగ్లర్ పాత్రను పోషిస్తున్నాడు. హీరోయిజం ఎలివేట్ కావాలంటే విలన్ మరింత భయంకరంగా ఉండాలి. ఫాహద్ ను చూస్తే అంత భయంకరమైన విలన్ మాత్రం గుర్తుకురాడు.
ఆయన నటన కూడా సహజసిద్ధంగా ఉంటుంది. తను ఆ పాత్రకు ఎలా సరిపోతానని ఫాహద్ అనుకున్నాడో తెలియదుగానీ ఒకసారి బరిలో దిగాక మాత్రం ఫాహద్ రెచ్చిపోవడం ఖాయం. ఆయన ఈ సినిమాని అంగీకరించాడంటే ఈ పాత్రలో ఏదో తెలియని మ్యాజిక్ ఉండి ఉంటుంది. ఒక వేళ మలయాళ వెర్షన్ లో ఫాహద్ ఇమేజ్ కు తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసే అవకాశం కూడా లేకపోలేదు. ఫాహద్ కు కూడా ఒక్క మలయాళంలోనే కాకుండా ఇతర భాషల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. విలన్ గా ఫాహద్ ఎంపిక వెనక మాత్రం మార్కెట్ స్ట్రాటజీ ఉందన్నది మాత్రం సుస్పష్టం.