చారిత్రక ప్రసిద్ధి చెందిన, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి కాలేజీగా పేరుగాంచిన విజయనగరం మహారాజా డిగ్రీ కాలేజీపై రాజకీయ రంగు పడింది. దీంతో ఈ కాలేజీ ప్రైవేటీకరణ దిశగా పరుగులు పెడుతోంది. ఈ కాలేజీలో డిగ్రీ ప్రవేశాలు నిలిపేశారు. ఇంటర్ విద్యార్థులను ప్రభుత్వ జూనియర్ కాలేజీకి అప్పగించేందుకు నిర్ణయించేశారు. అత్యున్నత విలువలు , మౌలిక సౌకర్యాలు ఉన్న ఈ కాలేజీని ప్రైవేటీకరించొద్దని స్థానికులు, ప్రజాసంఘాలు, విద్యార్థులు, అధ్యాపకులు మొత్తుకుంటున్నా, నిరవధిక దీక్షలు చేస్తున్నా యాజమాన్యం పట్టించుకోవడం లేదు సరే కదా చాప కింద నీరులా యాజమాన్యం తన పని తాను చేసుకుపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం తన కేమీ పట్టనట్లు, నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
కుటుంబ వ్యవహారంగా తేల్చేసిన ‘బొత్స’
‘మాన్సాస్ వ్యవహారంలో చీటికీ మాటికీ ప్రభుత్వాన్ని లాగటం భావ్యం కాదు. అశోక్ గజపతిరాజు, ప్రస్తుత మాన్సాస్ ఛైర్మెన్ సంచైత గజపతిరాజు మధ్య కుటుంబ వ్యవహారాలు ఉంటే వారిలో వారు చక్కదిద్దుకోవాలి. మహారాజ కళాశాల వ్యవహారంలో మాన్సాస్ వలన విద్యార్ధులకు, అధ్యాపకులకు నష్టం వాటిల్లుతుంటే తమ పరిధి మేరకు చర్యలు చేపడతాం. ఎం.ఆర్ కళాశాల అన్ ఎయిడెడ్ చేయమని గతంలో అశోక్ గజపతే ప్రభుత్వాన్ని కోరినట్టు మాన్సాస్ ఛైర్మెన్ సంఛైత తెలిపారు’’ -అని విజయనగరంలో మీడియాతో రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చేశారు. అక్కడితో వారు చేతులు దులుపుకున్నారు.
అశోక్‌పై కక్షతోనే అంటున్న ‘కళా’
‘విజయనగరం మహారాజా కళాశాల ప్రైవేటీకరణను ఖండిస్తున్నాం. అశోక్ గజపతిరాజుపై కక్షతో మాన్సాస్ ట్రస్ట్ను నిర్వీర్యం చేయడం హేయం. పంచభూతాలను దోచుకోవడం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నైజం. పాదయాత్ర సమయంలోనే జగన్ రెడ్డి కన్ను మాన్సాస్ ట్రస్ట్ పై పడింది. మాన్సాస్ ట్రస్ట్ను భ్రష్టు పట్టించడమే లక్ష్యంగా ఏ1, ఏ2 లు తెరవెనుక పావులు కదుపుతున్నారు. మాన్సాస్ ట్రస్ట్ లో ప్రభుత్వం అనవసర జోక్యంతో సామాజిక సేవా కార్యకలాపాలను దెబ్బతీస్తోంది. ఉద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటోంది. ఇది గర్హనీయం.’ -అని అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కళా వెంకట్రావ్ విమర్శలు గుప్పించారు.
బొత్స మరీ విడ్డురం అంటున్న ‘భీశెట్టి’
దేశంలో ఎంతో కీర్తి ప్రతిష్టలు కలిగి 141 ఏళ్ళసుదీర్ఘ చరిత్ర కలిగిన విజయనగరం మహారాజా కళాశాల ప్రైవేటీకరణ వైపు అడుగులు పడుతుంటే రాష్ట్ర పురపాలక శాఖమంత్రి బొత్స సత్యనారాయణ మాన్సాస్ నిర్ణయాలకు, ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పడం మరీ విడ్డురంగా ఉంది. విద్యను సామాన్యులకు అందించాలనే ఉద్దేశంతో మహారాజులు 1879 లో కాలేజీలు ఏర్పాటు చేశారు. ఎంతోమంది గొప్ప వారు చదువుకున్న ఈ కళాశాలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ ఆదేశాలతోనే ప్రైవేటు చెయ్యడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. వివరాలు మీడియా ద్వారా ప్రజలముందుకు వస్తుంటే మంత్రి బొత్స వాస్తవాలు చెప్పకుండా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు అశోకగజపతి, సంచైతలు తప్పులు చేస్తుంటే మంత్రిగా సరిదిద్దే బాధ్యత తీసుకోవాలి. మాన్సస్ ఛైర్మన్ గా సంచిత గజపతిరాజును ఎవరు నియమించారు? ప్రభుత్వం కాదా? మాన్సస్ సంస్థలు ఎండోమెంట్ పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వం ఎయిడెడ్ కళాశాలలను నడుపుతుందనే విషయం మంత్రికి తెలియంది కాదు. అశోకగజపతిరాజు, సంచైత మధ్య మాన్సస్ సంస్థలు నలిగిపోతున్నాయని ప్రజలు భావిస్తున్నారు. మంత్రి బొత్స ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తో మాట్లాడి మాన్సస్ విద్యా సంస్థలను ప్రభుత్వం నడిపే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎమ్మార్ కాలేజీలో ఇంటర్, డిగ్రీ ప్రవేశాల నిలిపివేయాలని యాజమాన్యం నిర్ణయం తీసుకోవడం సరికాదు. మహారాజ స్వయం ప్రతిపత్తి కళాశాల పై జరుగుతున్న పరిణామాలను చర్చించేందుకు లోక్‌సత్తాపార్టీ ఆధ్వర్యంలో ఈనెల 11 ఆదివారం ఉదయం 10 గంటలకు విజయనగరంలో కంటోన్మెంట్లోని గురజాడ పాఠశాలలో రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశాం. అని విజయనగరంలో మీడియాతో లోక్‌సత్తాపార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు భీశెట్టి బాబ్జి అంటున్నారు.
ప్రైవేటు దిశగా పరుగులు పెడుతున్న ఎమ్మార్ కాలేజీపై అధికార, విపక్ష నాయకులు ఎవరిమట్టుగా వారు ప్రకటనలు గుప్పిస్తూ రాజకీయ రంగులు అద్దుతున్నారు. ఆ కాలేజీలో ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులు, అధ్యాపకులు భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నారు. ఫలితం కోసం నిరీక్షిస్తున్నారు.