ఆన్ లైన్ మోసాలకు పాల్పడుతున్నారు జాగ్రత్త వహించండి అని పోలీసులు ఎన్ని విధాలుగా చెప్పినా.. ప్రజలు పట్టించుకోవడం లేదు. ఇలాంటి సంఘటనలు ఎన్ని జరిగినా మళ్లీ ఇలాంటి మోసాలకు బలవుతున్నారు. చివరకు అంతా పోగొట్టుకున్న తర్వాత పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకుంటున్నారు. అలాంటి ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. సోఫియా అలెక్స్ పేరుతో 4 లక్షలకు టోకరా వేసారు. చివరకి మోసపోయానని తెలుసుకున్న బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. వారు కేసును చేధించిన వివరాలిలా ఉన్నాయి.
ఫేక్ ప్రొఫైల్‌తో పరిచయం
సోఫియా అలెక్స్ అనే పేరుతో ఫేస్ బుక్‌లో పరిచయమైన యువతి మాయలో పడ్డాడో యువకుడు. ఫేస్ బుక్ దాటి పరిచయం కాస్త వాట్సప్, వాయిల్స్ కాల్స్ దాకా సాగింది. ఒకరి వివరాలు ఒకరు చెప్పుకున్నారు. తను ఆస్ట్రేలియా నుండి వచ్చి ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నానని సోఫియా చెప్పగానే నమ్మేశాడు బాధితుడు. ఆమె హైదరాబాద్ వస్తున్నాను అనగానే తన కోసం ఆతృతగా ఎదురుచూడ సాగాడు. చివరకు తను అనుకున్న రోజు రానే వచ్చింది. తను ముంబై చేరుకున్నట్లుగా ఒక ఆఫీసర్ ఫోన్ చేసి 75 వేల పౌండ్లు విలువచేసే డబ్బు, బంగారం, మొబైల్స్ తెచ్చిందని.. వాటిని కస్టమ్స్ నుండి విడుదల చేయాలంటే కొంత మొత్తాన్ని చెల్లించాలని చెప్పారు. సోఫియా కూడా తన వద్ద ప్రస్తుతం డబ్బు లేదని, కస్టమ్స్ నుండి విడుదల కాగానే చెల్లిస్తానని చెప్పడంతో విడతల వారిగా 4 లక్షల 83 వేలు వాళ్లు చెప్పిన బ్యాంకు ఖాతాకు పంపాడు. అంతా అయ్యాక గానీ అర్థం కాలేదు అయ్యగారికి, తాను మోసపోయానని. చివరికి పోలీసులే శరణ్యమంటూ వాళ్లని ఆశ్రయించారు.
Must Read ;- Online ‘లోన్స్’పై ఉచ్చుబిగిస్తోన్న తెలంగాణ పోలీసులు

5 గురు అరెస్ట్..
బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. అసలు బాధితుడితో మాట్లాడింది.. అతడి వద్ద డబ్బు తీసుకున్నది అమ్మాయి కాదని తేలింది. వారంతా నైజిరియా ముఠాగా కనుగొన్నారు పోలీసలు. వారిని ఢిల్లీలో కనుగొని అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించి కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ ఐదుగురు 2019-2020 కాలంలో వివిధ సమయాల్లో టూరిస్ట్, బిజినెస్ విసాల ఆధారంగా భారతదేశానికి వచ్చారు. అందులో ఇద్దరి వీసాలు సమయం కూడా ముగిసిపోయింది. ఇతరులకు మోసం చేయడంతోపాటు వీసా సమయం గడువు దాటినా వాటిని రెనివల్ చేయకుండా అక్రమంగా ఉంటున్న కేసులు కూడా నమోదు చేశారు పోలీసులు.
ఇదేం మొదటి కేసు కాదు..
ఈ అయిదుగురు సభ్యులు మోసాలకు పాల్పడడం కొత్తేమీ కాదు. ఇప్పటికే వీరి పైన హైదరాబాద్‌లో మూడు కేసులు నమోదయ్యాయి. వాటికి సంబంధించిన వివరాలను కూడా తాజా కేసుకు జత చేస్తున్నారు పోలీసులు. ఆన్ లైన్ ఆధారంగా అమాయకులకు వలపన్ని వారినుంచి డబ్బు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారు. భారత దేశంలో ఉంటూ వేరే దేశంలో ఉంటున్నట్లుగా తెలియడానికి వీరు ప్రత్యేకమైన అప్లికేషన్‌ని ఉపయోగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
అప్రమత్తతే కాపాడుతుంది
ఇలా మోసపోతున్న ఘటనలు నగరంలోనే కాకుండా.. దేశ వ్యాప్తంగా ఇబ్బడి ముబ్బడిగా నమోదు కావడంతో పోలీసులు ప్రజలను హెచ్చరిస్తున్నారు. తెలియని వారిలో సోషల్ మీడియాలో జాగ్రత్త వహించాలని చెప్తున్నారు. వారికి మన పర్సనల్ సమాచారం చెప్పడం, ఫొటోలు పంపడం, వారిని ఒంటరిగా కలవడం, డబ్బులు పంపడం లాంటి పనులు చేయవద్దని హెచ్చరిస్తున్నారు. మీరు జాగ్రత్త వహించి.. ఇలాంటి సమస్యలు ఎదురైనపుడు వెంటనే పోలీసులను ఆశ్రయించాలని.. వారి సమాచారం పోలీసులకు అందించి సహకరించాలని కోరుతున్నారు.
Also Read ;- ఆన్ లైన్ అప్పు.. ప్రాణాలకు ముప్పు!











