ప్రపంచ కుబేరుడు, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేష్ అంబానీ తనయుడి వివాహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీసమేతంగా హాజరైన సంగతి తెలిసిందే. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా హజరు అయ్యారు. జియో వరల్డ్ ట్రేడ్ సెంటర్‌లో జరిగిన వివాహంతో పాటు మర్నాడు శుభ్ ఆశీర్వాద్ వేడుకకు కూడా చంద్రబాబు వెళ్లారు. ఆ సందర్భంగా ముకేష్ అంబానీ చంద్రబాబుతో మాట్లాడిన వీడియోలు విపరీతంగా నెట్టింట వైరల్ అయ్యాయి.
తాజాగా చంద్రబాబు – ముకేష్ అంబానీకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిజానికి ఈ వేడుకలకు దేశంలోని సినీ, రాజకీయ, క్రీడా దిగ్గజాలు, ప్రముఖులు ఎంతో మంది హాజరయ్యారు. వారిలో సీఎం చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారు. అయితే వేడుకల నుంచి చంద్రబాబు తిరిగి బయల్దేరిన సమయంలో చంద్రబాబుకు ముకేష్ అంబానీ వీడ్కోలు పలికిన తీరు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా చర్చనీయాంశం అవుతోంది.
చంద్రబాబు కాన్వాయ్ బయలుదేరుతుండగా ముకేష్ అంబానీ బయటకి వచ్చి మరీ కారులోని చంద్రబాబుకు చేతులెత్తి నమస్కరించి మరీ వీడ్కోలు పలికారు. ఈ వీడియో ఇప్పుడు బాగా వైరల్ అవుతోంది. ఇప్పుడు ఈ వీడియోను టీడీపీ శ్రేణులు బాగా షేర్ చేసుకుంటున్నారు. అదీ చంద్రబాబు స్థాయి అంటూ కాలర్ ఎగరేసుకుంటున్నారు. మరెవరీ లేనట్లుగా ముకేష్ అంబానీ చంద్రబాబును గౌరవించిన విధానం చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు.
అయితే, వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం ఉండగా విశాఖలో నిర్వహించిన పెట్టుబడిదారుల సదస్సుకు ముకేష్ అంబానీ హాజరయ్యారు. అప్పుడు ఆయన్ను తానే రప్పించానని జగన్ కాలర్లు ఎగరేసుకున్నారు. కానీ, ఇప్పుడు ముకేష్ ఇంట్లో పెళ్లికి వైసీపీ అధినేతకు ఆహ్వానమే అందలేదు. అప్పట్లో పెట్టుబడిదారుల సదస్సు కాబట్టి, తన వ్యాపార విస్తరణల కోసం ముకేష్ అంబానీ ఆ సదస్సుకు హాజరయ్యారు. జగన్ తో అంటీ ముట్టనట్లే ఉన్నారు. కానీ, చంద్రబాబుతో ముకేష్ అంబానీ మెలిగిన తీరుతో వైసీపీ శ్రేణులు గుర్రుపై ఉన్నారు.