నటి పాయల్ ఘోష్ బాలీవుడ్ దర్శకుడు అనురాగ్ కశ్యప్‌పై సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. ముంబైలోని వెర్సోవా పోలీస్ స్టేషన్‌లో ఆమె అనురాగ్ కశ్యప్‌పై లైగింక వేధింపుల కేసు నమోదు చేశారు. . ఐపీసీ సెక్షన్ 376, 354, 341, 342 సెక్షన్లపై ఆయనపై కేసు నమోదు చేశారు. అసభ్య ప్రవర్తన, లైగింక దాడి, శారీరిక హింస లాంటి పలు సెక్షన్ల కింద అనురాగ్ పై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆమె తనకు భద్రత కల్పించమని మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మరో అడుగు ముందుకేసి అతను నన్ను రేపు చేశాడు మీరు న్యాయం చేయండని మహరాష్ట్ర గవర్నర్ ను కలిసి వినతిపత్రం అందచేశారు.
కేంద్ర మంత్రి రాందాస్ ఆదవాలె తో కలిసి ఆమె ‘మహా’ గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీని కలిశారు. ఈ నెల 22న అనురాగ్ పై ఫిర్యాదు చేసిన ఇప్పటి వరకు ముంబై పోలీసులలో కదలిక లేదని ఆమె విమర్శలు చేసింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే చర్యలు తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదైన కేసులో చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆమె ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో ముంబై పోలీసులలో కదలిక వచ్చింది. గురువారం ఉదయం 11 గంటలకు తమ ముందు హాజరుకావాలని వెర్సోవా పోలీసులు అనురాగ్ కశ్యప్ కు నోటీసులు జారీ చేశారు.
అనురాగ్ కాశ్యప్ తన పట్ల అతి క్రూరంగా వ్యవహరించాడని తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని ఆమె సంచలన ఆరోపణలు చేసిన విషయం విదితమే. అనురాగ్ పై ఆమె చేసిన ఆరోపణలపై భిన్న వాదనలు వినబడ్డాయి. అనురాగ్ కు మద్దతుగా కొందరు నిలుస్తుండగా మరి కొందరు పాయల్ వైపు నిలిచారు. అనురాగ్ కు మద్దతుగా ఆయన మాజీ భార్య కొచ్చిన్, నటి తాప్సి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మద్దతు తెలిపారు. ఈ లైగింక వేధింపుల ఆరోపణలను ఇప్పటికే ఖండించిన అనురాగ్ ఇందులో రాజకీయ కుట్ర దాగుందని అభిప్రాయపడ్డారు. సదరు ఆరోపణల్లో నిజం లేదని, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినందుకే కొందరు పనిగట్టుకుని తనపై బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారని అనురాగ్ పేర్కొన్నారు.
గత కొంతకాలంగా, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినవారిపై కేసులు నమోదవుతున్నాయని చర్చ జరుగుతోంది. మోడీకి వ్యతిరేకంగా గళమెత్తిన దీపికా పదుకునే, అనురాగ్ కశ్యప్, స్వర భాస్కర్ లపై కేసులు నమోదయ్యాయని ఆరోపణలు ప్రచారం జరుగుతున్నాయి.











