ప్రపంచం మొత్తం మీద కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. సామాన్యులే కాదు పలువురు ప్రముఖులు కూడా కరోనా బారిన పడుతున్నారు. ఈ మధ్య మన కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాకు కరోనా సోకింది. ఆయన పలు సార్లు అస్వస్థకు గురవడం కూడా జరిగింది. ఆ తరవాత నెమ్మదిగా కోలుకున్నారు. ఆయనే కాకుండా కేంద్ర మంత్రులు, కేంద్ర సహాయ మంత్రులు కూడా ఈ జాబితాలో ఉన్నారు. అయితే కొంత మంది కోలుకున్నారు, మరి కొంతమంది ఈ మహమ్మారికి బలైయ్యారు.
తాజాగా ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు గారు కరోనా బారిన పడ్డారు. ఆయనకు కరోనా లక్షణాలేవీ లేవని, ఆరోగ్యంగానే ఉన్నారని ఉపరాష్ట్రపతి కార్యాలయం మంగళవారం ప్రకటించింది. సాధారణ పరీక్షల్లో భాగంగా కరోనా టెస్టు చేయటంతో పాజిటివ్ అని తేలిందని ఉపరాష్ట్రపతి కార్యాలయం ట్వీట్ చేసింది. 71 ఏళ్ళ వయస్సు ఉన్న వెంకయ్య నాయుడు ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యంపై డాక్టర్లు నిమిషనిషానికి పర్యవేక్షిస్తున్నారని ఉపరాష్ట్రపతి కార్యాలయం ప్రకటించింది.
ఈ విషయంపై నటుడు, జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్‌లో “మన భారత దేశ – గౌరవ ఉప రాష్ట్రపతి ‘శ్రీ వెంకయ్య నాయుడు గారు’ కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను. ఆయన పూర్తి ఆరోగ్యంతో తిరిగి వచ్చి దేశ ప్రజలకు మరెంతో సేవ చేయాలి” అని పవన్ ట్వియిట్ చేసాడు. పవన్ మాత్రమే కాకుండా పలువురు ప్రముఖులు ఉప రాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు త్వరగా కోలుకోవాలని దేవుడను ప్రార్ధిస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు రాజ్యసభ చైర్మన్ హోదాలో వెంకయ్య నాయుడు గారు హాజరైన విషయం తెలిసిందే.











