కరాటే కల్యాణి చాలా తెలుగు సినిమాల్లో నటించారు కానీ పెద్దగా ఎవరికీ ఈమె తెలియదు. కొన్ని నెలల క్రితం టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ అనే అంశం పెద్ద దుమారమే రేపింది. హాట్ భామ శ్రీరెడ్డి ఈ కాస్టింగ్ కౌచ్ విషయం లేవనెత్తింది. ఆ సమయంలో కరాటే కల్యాణి శ్రీరెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడి వార్తల్లో నిలిచింది. అప్పటి నుంచి కరాటే కల్యాణి పేరు అందరికీ తెలిసింది. ఇటీవల బిగ్ బాస్ హౌస్‌కి వెళ్లిన కరాటే కళ్యాణి సినీ, బుల్లితెర వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యారు. ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కూడా హాట్ టాపిక్ అయ్యే వ్యాఖ్యలు చేసింది ఈమె. తిరుమల డిక్లరేషన్ విషయంలో వైఎస్ జగన్ తప్పు చేశారంటూ తీవ్రంగా హెచ్చరించారు.
‘ఆయన సీఎం.. కావొచ్చు పీఎం కావొచ్చు కాని.. తిరుమల రూల్స్‌ని బ్రేక్ చేసే హక్కులేదని.. ప్రశ్నించడం తన హక్కు అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆమె మాట్లాడుతూ.. సీఎం జగన్ ముఖ్యమంత్రి కాబట్టి ఎవరూ ఆపరని తిరుమలకి వెళ్లారా?? ఆయన క్రిస్టియన్ అని అందరికీ తెలుసు మధ్యలో ఆయన హిందూమతం తీసుకున్నారని, శారదా పీఠం దగ్గర గంగలో మునిగారు అని ఫొటోల్లో చూశాం కానీ నాకు తెలుసు మొదటి నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న రూల్‌ని బ్రేక్ చేయడం తప్పు. అది ఎవరైనా కావచ్చు.. సీఎం అవ్వొచ్చు.. పీఎం అవ్వచ్చు. డిక్లరేషన్ ఇచ్చి గుడిలోకి వెళ్లాలి కదా.. ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదు.
ఎవరికి వాళ్లు రూల్స్ పెట్టేసుకుంటే అంతకు ముందు వరకూ ఉన్న రూల్స్‌ని బ్రేక్ చేసినట్టే కదా. సీఎం జగన్ బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నప్పుడు ప్రతి అంశానికి కట్టుబడి ఉండాలి. అన్ని మతాలను గౌరవిస్తున్నప్పుడు ఇది కూడా గౌరవించాలి కదా. ఆయన ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా బైబిల్, ఖురాన్, భగవద్గీత అన్నీ చదివారు. కాని ఆయన పట్టుకున్నది మాత్రం బైబిల్ మాత్రం. నిజానికి ఆయన మొదటి నుంచి క్రిస్టియన్ మతంలో ఉన్నట్టు అందరికీ తెలిసిందే. దాన్ని ఎవరూ కాదనలేం. నేనైతే సీఎం జగన్ చేసిన పనిని తీవ్రంగా ఖండిస్తున్నా. మీరు ఖచ్చితంగా డిక్లరేషన్ ఇచ్చే వెళ్లాలని చెప్తా. ఆయన జెరూసలెం వెళ్తారు, అక్కడ డిక్లరేషన్ ఇవ్వమంటే ఇస్తారు కదా మరి మా తిరుపతి అంటే.. దేవదేవుడు ఉన్న ప్రాంతం అది.. కళియుగ వైకుంఠాన్ని అంత చులకనగా తీసేయాలా? మీరు ఎందుకు డిక్లరేషన్ ఇవ్వలేదో ఆన్సర్ ఇవ్వండి.
హిందువుల మనోభావాలను ఎందుకు దెబ్బతీశారు జగన్ ప్రజలకు చెప్పాలి. నేను బీజేపీలో జాయిన్ అయిన తరువాత ఖచ్చితంగా నిలదీస్తా. గోవిందా.. గోవిందా.. అని కొన్ని కోట్ల మంది గోవిందుడ్ని కొలుస్తారు. ఆ కోట్ల మందిలో మీకు ఓట్లు వేసిన వాళ్లు ఉన్నారు. వాళ్ల మనోభావాల్ని ఎందుకు దెబ్బతీశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి ఇలా చేయడం ఖచ్చితంగా తప్పు. రాష్ట్రంలో విగ్రహాలు ద్వంసం చేస్తున్నా ఈ ప్రభుత్వం పట్టించుకోవడంలేదు. మేం ఖచ్చితంగా అడుగుతాం.. ప్రశ్నిస్తాం.. మీరు వేరు చేస్తే.. మేం వేరు చేస్తాం’ అంటూ భాజపాలో చేరకముందే ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై సంచలన కామెంట్స్ చేసింది కరాటే కళ్యాణి.











