గెలుపు ఓటములు సర్వసాధారణం. చెరువుపై అలిగితే దాహం తీరుతుందా? నిన్న నాగాబాబు, ఈరోజు ప్రకాష్ రాజ్ మా సభ్యత్వానికి రాజీనామా చేశారు. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ తో ఉన్న అనుబంధాన్ని తెంచేసుకున్నారు. మా అసోసియేషన్ పుట్టి దాదాపు పాతికేళ్లు దాటిపోయింది. ప్రకాష్ రాజ్ మా అసోసియేషన్ సభ్యత్వం తీసుకుని 21 ఏళ్లు అయ్యింది. నాగబాబుకు పాతికేళ్లుగా ఈ అసోసియేషన్ తో అనుబంధం ఉంది. వీరిద్దరూ మాను వదిలి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు.
మా అధ్యక్ష పదవికి పోటీ చేసి ఓడిపోయినందుకు ప్రకాష్ రాజ్ ఈ నిర్ణయం తీసుకుంటే, ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతు ఇచ్చినా ఆ ప్యానల్ నుంచి ప్రకాష్ రాజ్ ఓడిపోయినందుకు మనస్తాపానికి గురై నాగబాబు రాజీనామా చేశారు. ‘నా తెలుగు ప్రేక్షకుల నుంచి నా తెలుగు సినిమా నిర్మాతల నుంచి నన్ను వేరు చేస్తారా? నాకు ఒక ఆత్మ గౌరవం ఉంది.. అందుకే ఈ రాజీనామా.. నేను ఓటమి పై విశ్లేషించుకుంటా. మాతో ఉన్న అనుబంధానికి ఈరోజుతో తెరదించుతున్నా. ఇందులో సభ్యత్వం ఉంటే తప్ప వేషాలు రావా? అని ప్రశ్నించారు.
నటించవద్దన్న నిబంధనలు ఏవీ లేవి కాబట్టి యథావిధిగా సినిమాల్లో నటిస్తానన్నారు. అలాగే మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నానని అన్నారు. ‘మా ఎన్నికల్లో ప్రాంతీయ వాదం తీసుకొచ్చారు. నేను తెలుగు వాడిని కాదని నన్ను ఓడించారు. అలాంటప్పుడు నేను మా సభ్యుడిగా ఉండటం లో అర్థం లేదు. మా సభ్యత్వానికి నేను రాజీనామా చేస్తున్నా. అయినా.. తెలుగులో నటించడం కొనసాగిస్తాను. నటీనటులు, దర్శకులు, రచయితలతో నా అనుబంధం కొనసాగుతుంది. నాపై వ్యాఖ్యలు చేసిన కోట శ్రీనివాసరావు, రవిబాబు లాంటి వారి అభిప్రాయాలను గౌరవిస్తున్నా’ అంటూ వివరణ ఇచ్చారు.
ఇక నాగబాబు విషయానికి వస్తే ఆయన ట్విట్టర్ ద్వారా మాకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. ‘ప్రాంతీయ వాదం మరియు సంకుచిత మనస్తత్వం తో కొట్టు-మిట్టాడుతున్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో కొనసాగడం నాకు ఇష్టం లేక “మా” అసోసియేషన్ లో నా ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’ అని వివరించారు. ఈ ఓటమి ఇచ్చిన చేదు అనుభవంతో ఈ క్విట్ మా ఉద్యమం కొనసాగుతున్నట్టు ఉంది. ఇంకా ఎవరెరవరు ఈ బాటలో పయనిస్తారో చూడాలి.
Must Read ;- విష్ణు గెలుపు.. ప్రకాష్ రాజ్ ఓటమికి కారణాలేంటి?
"మా" ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు. "మా" ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు. అందరికి అభినందనలు.
భారత్ మాతాకి జై !#MaaElections2021— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) October 10, 2021