ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్.. కేంద్రంలో అధికార బీజేపీకి కొరకరాని కొయ్య కిందే లెక్క. బీజేపీ విధానాలు, ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయాలపై ప్రకాశ్ రాజ్ తనదైన శైలిలో నిత్యం విమర్శలు గుప్పించడమే ఇందుకు కారణమని కూడా చెప్పాలి. బీజేపీ మతతత్వ పార్టీ అని, ఆ పార్టీ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు లౌకిక వాదానానికి విఘాతమన్న రీతిలో ప్రకాశ్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. కర్ణాటకకు చెందిన ప్రకాశ్ రాజ్.. కన్నడ, తమిళ భాషా చిత్రాల కంటే కూడా తెలుగు చిత్రాల్లోనే సత్తా చాటారు. ఎక్కడా కూడా తాను తెలుగు వాడిని కాదన్న మాటనే వినిపించకుండానే రాణించారనే చెప్పాలి. అయితే ఎక్కడ ఏ మేర రాణించినా.. ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా.. తన సొంత ప్రాంతం కేంద్రంగానే అమలు చేస్తారు కదా. అలాగే రాజకీయాల్లోకి రావాలన్న తన కొత్త నిర్ణయాన్ని కూడా ప్రకాశ్ రాజ్ తన సొంత రాష్ట్రం కర్ణాటక నుంచే అమల్లోకి పెట్టేశారు. ఆ క్రమంలో 2019 ఎన్నికల్లో కర్ణాటక నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన ప్రకాశ్ రాజ్ ఓటమిపాలయ్యారు. ఈ ఓటమి బీజేపీ నేతలకు సంతోషాన్ని కలిగించిందనే చెప్పాలి. అయితే తాజాగా ప్రకాశ్ రాజ్ ‘మా’ ఎన్నికల్లో ఓడిపోయిన తీరు కమలనాథులకు మరింత మేర సంతోషాన్ని కలిగించిందనే చెప్పాలి.
ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు విక్టరీ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు గతంలో ఎన్నడూ లేనంత హోరాహోరీగా జరిగిన సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిటీ మద్దతులో ప్రకాశ్ రాజ్ బరిలోకి దిగగా, ఈ ప్యానెల్ కు వ్యతిరేకంగా మంచు విష్ణు రంగంలోకి దిగారు. హోరాహోరీగా ప్రచారం జరిగింది. ఇరు వర్గాల మధ్య మాటల తూటాలూ పేలాయి. అయితే ఆదివారం జరిగిన ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు చెందిన ఇద్దరు అభ్యర్థులు గెలవగా.. మా అధ్యక్షుడిగా పోటీ చేసిన ప్రకాశ్ రాజ్ మాత్రం ఓటమిపాలయ్యారు. ప్రకాశ్ రాజ్‌ను నాన్ తెలుగు యాక్టర్‌గా ప్రొజెక్ట్ చేసిన మంచు విష్ణు ప్యానెల్ ఎన్నికల్లో సత్తా చాటింది. తెలుగు నటుల అసోసియేషన్‌ను ఎవరో బయటి నుంచి వచ్చిన వ్యక్తి బాగు చేయాల్సిన అవసరం ఉందా? మనం బాగు చేసుకోలేమా? అంటూ మంచు విష్ణు ప్యానెల్ సాగించిన ప్రచారం బాగానే పనిచేసినట్టుంది. ఈ కారణంగానే మెగా ఫ్యామిలీ మద్దతు ఉన్నప్పటికీ ప్రకాశ్ రాజ్ ఓటమిపాలయ్యారు. ఈ ఎన్నికల ఫలితాలు రాగానే.. ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌కు సంపూర్ణ మద్దతు ప్రకటించిన మెగా బ్రదర్ నాగబాబు మా సభ్యత్వానికి రాజీనామా చేయగా.. తాజాగా సోమవారం ఉదయం ప్రకాశ్ రాజ్ కూడా మా సభ్యత్వానికి రాజీనామా చేసేశారు.
బండి ట్వీటే కారణం
ఇక ప్రకాశ్ రాజ్ ఓటమిపై రాజకీయంగా ఏ ఒక్క పార్టీ స్పందించముందే.. బీజేపీ స్పందించేసింది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఉన్న కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ఆదివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత తన ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌లో బండి ఏమంటారంటే..‘‘”మా” అధ్యక్షుడిగా గెలిచిన @iVishnuManchu గారితో సహా ఇరు ప్యానెల్ లోని విజేతలందరికి శుభాకాంక్షలు. జాతీయవాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన “మా” ఓటర్లకు ధన్యవాదాలు. దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది. “మా” ఓటర్లు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎదురు చూశారు. “మా” ఓటర్లు స్ఫూర్తిదాయకమైన తీర్పు ఇచ్చారు. అందరికి అభినందనలు. భారత్ మాతాకి జై !’’ అంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచు విష్ణు ప్యానెల్ విజయంతో పాటు ప్రకాశ్ రాజ్ ప్యానెల్ లో విజయం సాధించిన ఇద్దరికీ గ్రీటింగ్స్ చెప్పిన బండి సంజయ్.. ఈ ఎన్నికలను ఏదో రాజకీయ పార్టీల మధ్య జరిగిన ఎన్నికల మాదిరిగా ప్రొజెక్ట్ చేస్తూ ట్వీట్ చేయడంతో.. కేవలం ప్రకాశ్ రాజ్ ఓటమిని బేస్ చేసుకునే బండి సంజయ్ ఈ ట్వీట్ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Must Read ;- విష్ణు గెలుపు.. ప్రకాష్ రాజ్ ఓటమికి కారణాలేంటి?











