మా ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోవడంలో మెగా హీరోలు ముందున్నారు. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, నాగబాబు తదితరులంతా ఉదయానే వచ్చి ఓటేసి వెళ్లారు. ఓటు హక్కు వినియోగించుకోవడంలో మెగా హీరోలు మొదట్నుంచీ ఉత్సాహం చూపుతున్నారు. ముఖ్యంగా వీరి మద్దతు ప్రకాష్ రాజ్ ప్యానల్ కు ఉండటంతో ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మోహన్ బాబు, విష్ణులను రామ్ చరణ్ ఆలింగనం చేసుకుని మాట్లాడారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక్క బాలకృష్ణ మాత్రమే వచ్చి ఓటేసి వెళ్లారు.
ముంబయి నుంచి ముఖేష్ రిషి, జెనీలియా తదితరులు కూడా వచ్చి ఓటేసి వెళ్లారు. సీనియర్ నటులు గిరిబాబు, విజయ్ చందర్, సుమన్త, చలపతిరావు తదితరులు కూడా వచ్చి ఓటింగ్ లో పాల్గొన్నారు. మంచు విష్ణు ప్యానల్ లో ఉన్న శివబాలాజీని నటి హేమ కొరికినట్టు ఆరోపణలు వచ్చాయి. అలాగే శివబాలాజీ, నటుడు శివారెడ్డి కూడా గొడవపడినట్టు సమాచారం. దీన్ని శివారెడ్డి ఖండించారు. తనది గొడవపడే స్వభావం కాదన్నారు.
ఉదయం పోలింగ్ ప్రారంభం కావడానికి గంటముందే మోహన్ బాబు, మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ అక్కడికి చేరుకున్నారు. ప్రకాష్ రాజ్ చేతిని తీసుకుని విష్ణు చేతితో కలిపి స్నేహపూరిత వాతావరణాన్ని మోహన్ బాబు కల్పించారు. ఆ తర్వాత మంచు విష్ణు, ప్రకాష్ రాజ్ ఆలింగనం చేసుకున్నారు. ప్రకాష్ రాజ్ కూ తనకూ గొడవ జరిగినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని నరేష్ మీడియా ముందు ప్రకటించారు.











