చిత్తూరు జిల్లాలోని పీలేరులో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిపై వైసీపీ నేతలు,వారి అనుచరులు కన్నేశారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నల్లారి కిశోర్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జిల్లాకు చెందిన మంత్రి,ఎంపీ,ఎమ్మెల్యేల అండదండలతో వైసీపీ నేతలు ఆ భూమిని కబ్జా చేసి లే అవుట్లు చేసి విక్రయిస్తున్నారని అన్నారు. వీటికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వ భూములు ఆక్రమించిన వారిపై సీఎం జగన్మోహన్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని కిశోర్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
జాతీయ రహదారికి ఇరువైపులా..
హైదరాబాద్-చెన్నై జాతీయ రహదారి, మదనపల్లె-తిరుపతి జాతీయ రహదారికి ఇరువైపులా ఉన్న ప్రభుత్వ భూములను గత 20 ఏళ్లుగా తాము కాపాడుకుంటూ వస్తున్నామన్నారు. ప్రభుత్వ భూమి ఒక్క అంగుళం ఆక్రమించినా ఊరుకునే ప్రసక్తే లేదని కిశోర్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. రాజకీయ నేతల ఒత్తిళ్లతో జిల్లాలోని అధికారులు స్వేచ్ఛగా పనిచేయలేకపోతున్నారని ఆరోపించారు. భూఆక్రమణలపై సబ్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేయగా ఆమె సైట్లను పరిశీలించి చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ ఇప్పటివరకూ ఎలాంటి చర్యలు లేవన్నారు. పీలేరులోనే కాకుండా చిత్తూరు జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో కూడ భూకబ్జాలు జరుగుతున్నాయని ఆరోపించారు. వేల కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. భూకబ్జాలో టీడీపీ నేతల పాత్ర ఉన్నా చర్యలు తీసుకోవాలన్నారు. మీడియా ప్రతినిధులను తీసుకెళ్లి కబ్జా చేసిన భూముల వివరాలను చూపిస్తామన్నారు. ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రభుత్వ భూములను పరిరక్షించాలని కిశోర్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.