తెలుగు నేల రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఉమ్మడి రాష్ట్రానికి సీఎంగా వ్యవహరించిన దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి సొంతూరు ఏపీలోకి వెళ్లిపోగా.. ఆయన కుమారుడు, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీకే పరిమితమైపోయారు. ఇప్పుడు ఏపీకి జగన్ సీఎంగా ఉన్నారు. తెలంగాణను వదిలేశారు. అయితే తెలంగాణతో పాటు జగన్ తన తండ్రిని కూడా వదిలేసుకున్నారనే చెప్పాలి. ఎందుకంటే.. జల జగడం నేపథ్యంలో వైఎస్సార్ ను తెలంగాణ మంత్రులు తులనాడుతున్నా.. జగన్ పట్టించుకోవడం లేదు కదా. కనీసం ఆ వ్యాఖ్యలను ఖండించిన పాపాన పోలేదు. ఈ లెక్కన తన రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని భావిస్తున్న జగన్.. తన తండ్రి వైఎస్సార్ కు సంబంధించిన వ్యవహారాలు కూడా తనకు అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తున్నట్లే కదా. అయితే టీ పీసీసీ పగ్గాలు చేపట్టిన రేవంత్ రెడ్డి మాత్రం వైఎస్సార్ కు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్ ను జగన్ వదిలేసుకున్నా.. తాము మాత్రం వైఎస్సార్ ను వదిలించుకోలేమని, మరింతగా ఓన్ చేసుకుంటామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
విజయమ్మపైనా విసుర్లు
తెలుగు రాష్ట్రాల జల జగడంపై రేవంత్ రెడ్డి ఇంకా పెద్దగా దృష్టి సారించకున్నా.. వైఎస్సార్ ను తెలంగాణ మంత్రులు తులనాడటంపై మాత్రం ఘాటుగా స్పందించారు. అంతేకాకుండా జగన్, ఆయన తల్లి విజయమ్మల మౌనంపైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా రేవంత్ ఏమన్నారంటే… “తెలంగాణ మంత్రులు వైఎస్సార్ ను ఇంతలా తిడుతున్నా జగన్, విజయమ్మ స్పందించడం లేదు. దీన్ని బట్టి చూస్తే వారిద్దరూ వైఎస్సార్ ను వదిలేసుకున్నట్టు కనిపిస్తోంది. వైఎస్సార్ ను విధానపరంగా ఎవరైనా విమర్శిస్తే తప్పులేదు. కానీ చనిపోయిన వ్యక్తి పట్ల దుర్మార్గంగా మాట్లాడుతున్నారు. వైఎస్సార్ పేరు మీద ఏర్పాటు చేసుకున్న పార్టీకి విజయమ్మ గౌరవాధ్యక్షురాలు. జగన్ ఆ పార్టీకి అధ్యక్షుడు, రాష్ట్ర ముఖ్యమంత్రి. అలాంటి వాళ్లిద్దరూ వైఎస్సార్ ను తిడుతుంటే ఖండించడం లేదు. వాళ్లు వైఎస్సార్ ను వదిలేసుకున్నారని భావించాలేమో. వైఎస్సార్ ను తిడితే జగన్ వదిలేయొచ్చు. కానీ మేం వదిలిపెట్టం. వైఎస్సార్ పై నోటికొచ్చినట్టు మాట్లాడితే ఈ మంత్రుల చెంపచెళ్లుమనిపిస్తాం. ఇక్కడున్న కాంగ్రెస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవు. వైఎస్సార్.. తెలంగాణ కాంగ్రెస్ ఆస్తి. ఆయన బతికున్నంతకాలం కాంగ్రెస్ పార్టీకి సేవలు చేశారు. చనిపోయే ముందు కూడా.. రాహుల్ గాంధీని ఈ దేశానికి ప్రధానిగా చూడాలని ఆకాంక్షించారు” అని ఓ రేంజిలో రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
తుచ్చ రాజకీయాలు చేస్తారా?
తుచ్ఛమైన రాజకీయ ప్రయోజనాల కోసం దివంగత నేలు ఎన్టీఆర్, వైఎస్సార్ ల పేర్లను లాగడం మానుకోవాలని తెలంగాణ మంత్రులకు రేవంత్ హితవు పలికారు. ఎన్టీఆర్, వైఎస్సార్ తమ పాలనలో చేయగలిగినంతా చేశారని, 10 నిర్ణయాల్లో అన్నీ అందరికీ నచ్చకపోవచ్చని, అంతమాత్రాన వారిని ఈ వివాదాలకు బాధ్యులను చేయడం సరికాదని కూడా రేవంత్ వ్యాఖ్యానించారు. మొత్తంగా తెలంగాణ మంత్రులు వైఎస్సార్ ను తిడుతున్నా.. జగన్ పట్టించుకోని వైనంపై విరుచుకుపడుతూనే.. వైఎస్సార్ ను తులనాడుతున్న తెలంగాణ మంత్రులకు రేవంత్ రెడ్డి హెచ్చరికలు జారీ చేసి తనదైన శైలి కొత్త రాజకీయాలకు తెర తీశారు. ఈ దిశగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వైరల్ గా మారాయి.